Friday, 6 January 2012

పోరు జన న్యాయవాది!!

హైదరాబాద్, డిసెంబర్ 30 (ఆన్‌లైన్ సిటీబ్యూరో) మానవ హక్కుల కోసం ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది'' అని ఆమ్నెస్టీ నుంచి ప్రశంసలు పొందిన కన్నబిరాన్.. నిజంగా హక్కులకు పెద్ద దిక్కు. నాలుగు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో పోరాడే ప్రజల పక్షాన ఆయన నిలిచారు. కన్నబిరాన్ పూర్వీకులు తమిళులు. ఎన్నో శాతాబ్దాల క్రితమే నెల్లూరు చేరి.. అక్కడే స్థిరపడిన కుటుంబం. కన్నబిరాన్ విద్యాభ్యాసం నెల్లూరులో, అనంతరం మద్రాస్‌లో సాగింది. స్వాతంత్రోద్యమం ముగింపు సమయం అది. వామపక్ష భావజాలం బాగా పని చేసింది. అదే తనను ఎక్కువగా చదవడానికి, ఆలోచించడానికి దోహదం చేసిందని ఆత్మకథ(24 గంటలు)లో పేర్కొన్నారు.

1953లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న కన్నబిరాన్.. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1951లో వసంతతో ఆయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత 1960లో ఆయన హైదరాబాద్ వచ్చేశారు. న్యాయవాదిగా ఆయన పని చేసిన కాలంలో సామాజికంగా వివిధ వ్యవస్థలు విఫలమైన తీరును బాగా దగ్గరగా గమనించారు. అదే అనంతరం కాలంలో ఆయనను హక్కుల ఉద్యమం వైపు నడిపించింది. 1994లో పీయూసీఎల్ ఏర్పాటు ద్వారా హక్కుల ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నెలకొల్పిన కన్నబిరాన్.. అంతకు ముందు పదిహేనేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటీ (ఏపీసీఎల్‌సీ)కి అధ్యక్షుడిగా పని చేశారు. నక్సలైట్లతో ప్రభుత్వ చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై ఏర్పాటైన తార్కుండే కమిటీలోనూ, భార్గవ కమిషన్‌లోనూ ఆయన పని చేశారు.

సీఎం సంతాపం

కన్నబిరాన్ మృతికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం వెలిబుచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధినేత కేసీఆర్, సిద్ధాంతకర్త జయశంకర్, పీఆర్పీ అధినేత చిరంజీవి, సీపీఐ నేత గుండా మల్లేష్, ఎమ్మెల్సీదిలీప్‌కుమార్, టీఎన్జీవో నేత విఠల్, విద్యావంతుల వేదిక నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్, రచయిత నిఖిలేశ్వర్, ఐఏఎల్ నేతలు పద్మనాభరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు వెంకట్, వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ నేత వేణుగోపాల్, సిపిఐ రాష్ట్ర కమిటీ నేతలు వై. వెంకటేశ్వరరావు, ఎస్. వీరయ్య, ఓపీడీఆర్ నేత భాస్కరరావు, పీయూసీఎల్ నేతలు ప్రభాకర్ సిన్హా, చంద్రశేఖర్, కేశవరావు జాదవ్, ఇక్బాల్‌ఖాన్, జయ వింధ్యాల మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్మన్ కాకుమాను పెదపేరిరెడ్డి వేర్వేరు ప్రకటల్లో సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment