Friday, 6 January 2012

మార్క్స్ సాహిత్యంతోనే పేదల వైపు


'ఏబీఎన్ ఇన్‌సైడర్'లో కన్నబీరన్

ప్రజారహిత వ్యాజ్యాలతో దేశానికి దుర్గతి
న్యాయవ్యవస్థలో కులతత్వమూ ఉంది
వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదు
మధ్య తరగతిదే తెలంగాణ పోరాటం
ఇందులో వర్గ పోరాటం లేదు
'
ఏబీఎన్ ఇన్‌సైడర్'లో కన్నబీరన్
వెల్‌కమ్ టు ది ఇన్‌సైడర్. ఈరోజు మనతో ప్రముఖ న్యాయవాది కేజీ కన్నబీరన్ ఉన్నారు. ఆయన పీడిత ప్రజల ప్లీడర్, ప్రజాహక్కుల పోరాట యోధుడు. ఈ రెండూ ఆయన కళ్లు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఐదు దశాబ్దాల అలుపెరుగని పోరాటయోధుడు కన్నబీరన్‌కు ఇపుడు కొంత విశ్రాంతి దొరికింది. ఆయన మనతో తన అంతరంగాన్ని విప్పదలచుకున్నారు.

రాష్ట్రం ఏదిశలో పోతుందని మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడేర్పడిన సంక్షోభం.. సమగ్రతకు సంబంధించినది. రాజ్యాం గం ఓ ఫెడరల్ సంస్థను ఏర్పాటుచేసుకుని, దాన్ని నడపలేక అవస్థ పడుతోంది. ఇక్కడుండే వర్గాలు, జాతులు, ప్రాదేశిక ప్రజల మధ్య అసమానతలున్నాయి. తెలంగాణది అదే సమస్య. ప్రజల అసమానతను నాయకులు గుర్తించి వాటిని సరిదిద్దితే ఇంతదూరం వచ్చేది కాదు.

కొందరు దీన్ని చట్టవిరుద్ధమైన పోరాటమని సుప్రీంలో పిల్ కూడా వేశారు..
అసలీ పిల్‌లతోనే దేశానికి దుర్గతి పట్టింది. ప్రజలతో సంబంధం లేకుండా అణచివేతకు గురైనవాళ్ల వాదన వినకుండా తీర్పులిచ్చే దురలవాటు ఉంది. దీన్ని ఆపేయాలి. సామాన్యుడికి న్యా యం జరగట్లేదు. న్యాయస్థానం న్యాయం కోసం కాదు.. వకీళ్లు, జడ్జీల కోసమే.

ప్రజాసమస్యలపై అవగాహనలేని వారికి వాటిపై తీర్పుచెప్పే అధికారం ఉందా?
వకీలైన తర్వాత అధ్యయనానికి అవకాశముంది. ఆ అలవాటు ఎవరికీ ఉండట్లేదు. ఓ ఉద్యోగంలో ఉన్నపుడు అందుకు కావల్సిన అవగాహన సంపాదించడం బాధ్యత. అది లేకపోతే వదిలి వెళ్లిపోవచ్చు.

మీ బాల్యం ఎలా గడిచింది?
నాన్నగారు నెల్లూరులో డాక్టర్. ఆయన రెండో పెళ్లి చేసుకోవడంతో మేం విడిపోయాం. చాలా పేదరికం. తర్వాత మా కజిన్ ఉద్యోగం చేయడంతో పుస్తకాలు కొనుక్కోగల సామర్థ్యం వచ్చి బాగా చదివేవాణ్ని. కొన్ని ఉద్యోగాలు చేసి, వదిలేసి సికింద్రాబాద్ వచ్చాను.

సికింద్రాబాద్ ఎంచుకోడానికి ఏమైనా పట్టుదల కారణమా?
అవును. నేనిక్కడకి వచ్చి, నాన్న కంటే ఎక్కువ పేరు సంపాదించాలనుకున్నా. సొంతగా ప్రాక్టీసు మొదలుపెట్టా. తర్వాత ఎంవీవీఎస్ వెంకట్రావు వద్ద చేరాను. అక్కడ వృత్తి లోతుపాతులు తెలిశాయి.

లాయర్‌గా ఎదిగే అవకాశమున్నా, నక్సలైట్ల వైపు ఎందుకు వెళ్లారు?
కమ్యూనిస్టు సిద్ధాంతంపై నమ్మకం, రాజకీయాల్లో విలువలు కనపడకపోతే ఆలోచించడం.. ఈ పరిస్థితుల్లో ఉద్యమం వచ్చింది. జ్వాలాముఖి కేసు నాకు తీసుకొచ్చి ఇచ్చింది నా జూనియర్ చారి. రావి సుబ్బారావు ఎక్కువగా కుట్ర కేసుల్లో ఇరికించారు.

భూమయ్య, కిష్టగౌడ్ కేసు నేపథ్యమేంటి?
వాళ్లు నక్సలైట్ల కొరియర్లు. హత్యారోపణ ఉంది గానీ, శిక్ష వేసేంత సాక్ష్యం లేదు. శిక్ష పడేసరికి వేసవి సెలవులున్నాయి. పిటిషన్ తయారు చేసి గవర్నర్ ఓబుల్‌రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన ఒప్పుకోలేదు. రిట్ పిటిషన్ ఇచ్చి నా జూనియర్లను వెకేషన్ న్యాయమూర్తి గంగాధరరావు ఇంటికి పంపాను. స్టే వచ్చింది. నేను, వసంత జైలుకు వెళ్లి ఉరి అమ లు కాకుండా చూసి.. తర్వాత ముత్యాలముగ్గు సినిమాకు వెళ్లాం. త ర్వాత కేసు మాధవరెడ్డి, మధుసూదనరావుల ముందుకొచ్చింది. రా జ్యాంగాన్ని నమ్మని నక్సలైట్లు దాని కింద రక్షణ ఎలా పొందుతారని మధుసూదనరావు అడిగారు. వాళ్ల విలువలు కాదు, మీ విలువలే ఇక్కడ ముఖ్యమని నేను చెప్పాను.

వాళ్లను ఉరితీయాల్సి వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు?
చాలా కోపం వచ్చింది. అసలు వారికి ఉరెందుకు వెయ్యాలో అర్థంకాలేదు. అప్పట్నుంచి దానిపై పోరాడాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదని నేనన్నాను.

ఎన్‌కౌంటర్ల విషయంలో ఎలా భావించేవారు?
చాలా సందర్భాల్లో అలా జరుగుతుంది. నా ప్రయత్నాల్లో ఉండగానే చాలామంది.. కుర్రాళ్లు నాకు తెలిసి ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఇటీవల పటేల్ సుధాకర్‌రెడ్డిని అలాగే చంపేశారు.

ఏపీసీఎల్‌సీ లాంటివాటిపై నక్సలైట్ల ముద్ర వేశారు కదా..
పోలీసులు నన్నూ నక్సలైటుగానే జమ కట్టేశారు. నేను నక్సలైటునే. వాళ్ల పద్ధతులతో ఏకీభవించను గానీ, ప్రాథమికంగా లెఫ్టిస్టునే.

మిమ్మల్ని చంపుతామన్న బెదిరింపులొచ్చాయా?
అదికూడా అయ్యిందిగానీ, వాళ్లకు ధైర్యంరాలేదు. నా స్థాయి వాడిని చంపాలంటే నైతిక స్థైర్యం కావాలి.

న్యాయవాదిగా ఎక్కువ ఫీజు ఎంత? కేసు ఎలా తీసుకునేవారు?
రిజర్వుబ్యాంకు దగ్గర రోజుకు 30 వేలు తీసుకున్నా. ఫీజు ఇంత కావాలని నాకు నోరు కూడా వచ్చేదికాదు. ఏదైనా అన్యాయం జరిగిందని భావిస్తేనే కేసు తీసుకుంటాను.

నిజమైన న్యాయమూర్తి అని ఎవరి గురించైనా అనుకున్నారా?
న్యాయం చేశారని చెప్పలేను.. బాగా వినేవాళ్లున్నారు. మన వాదన వినడానికే జీతమిస్తారు. చెప్పడం మన హక్కు, వినడం వారి బాధ్యత.

న్యాయమూర్తుల్లోనూ అవినీతి ఉంటుందా?
ఎందుకుండదు? ఉంటుంది. అవగాహన లోపిస్తే చాలామంది ఈ హోదాను బట్టి, తమను తీసేయలేరు కాబట్టి, ఏం చేసినా చెల్లుతుందనుకునేవాళ్లు చాలా కొద్దిమంది ఉన్నారు.

బాధ్యతాయుతమైన న్యాయవాదులు ఎవరైనా కనపడ్డారా?
అసలు ఆలోచించేవాళ్లే తక్కువ. కేసు గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. బాలగోపాల్ చాలా నిబద్ధత ఉన్న న్యాయవాది. 500 నుంచి 2 వేలే తీసుకునేవాడు. ఎక్కువిస్తే తిరిగి ఇచ్చేసేవాడు.

మీకెదురైన మంచి క్లయింట్ ఎవరని చెప్పగలరు?
కొండపల్లి సీతారామయ్య. నేనొచ్చి వాదించాలంటే లేఖ రాసేవారు. పన్నెండుసార్లు కలిసుంటాను. చండ్ర పుల్లారెడ్డిని కూడా కలిశా. ముప్పాళ్ల లక్ష్మణరావు(గణపతి)నీ ఇక్కడే ఎక్కడో ఇళ్లలో చాలా ఏళ్ల క్రితం కలిశాను.

మీ పిల్లలు మిమ్మల్ని మిస్సయినట్లు కనపడలేదా?
అదృష్టవశాత్తు వాళ్లు ముగ్గురూ చాలా తెలివైనవాళ్లు. వాళ్ల జీవితాలు వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. పెద్దమ్మాయి పరిశోధనల్లో ఉంది. నా రచనలను పుస్తకరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. బాబు అమెరికాలో చదివాడు. వాడు సినిమాటోగ్రాఫర్. మంగళ్‌పాండే లాంటి సినిమాలకు చేశాడు.

వసంత గురించి ఐదు వాక్యాల్లో ఎలా వర్ణిస్తారు?
ఆమె ఉత్తమ సహధర్మచారిణి. జీవితంలో అన్ని సమయాల్లోనూ వెన్నంటి నిలిచింది. ఈ స్థాయికి ఎదిగేందుకు తోడ్పడింది.

కన్నబీరన్ ఈ సమాజానికి ఏమిచ్చారు?
ప్రజలు నైతిక స్థైర్యం, పోటీతత్వం కలిగి ఉండాలని చెప్పాను. అవసరార్థులకు సాయం చేయాలని చెప్పాను.

ప్రజలు అడుగుతున్నా తెలంగాణ ఎందుకివ్వలేకపోతున్నారు?
తెలంగాణ ఇవ్వడమంటే అంత సులభం కాదు. వలసవచ్చిన ఆం«ద్రుల ప్రయోజనాలు గుర్తించాలి. ఈ ప్రయత్నాన్ని ప్రతిసారీ వారు భంగపరుస్తున్నారు. 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు ప్యాచ్ వర్క్ చేశారు. దేశంలో మనకున్న ఏకైక గట్టి నేత ఇందిరాగాంధీయే. ఆమె తెలంగాణ ప్రాంతీయ కమిటీ పెట్టారు. దాన్ని సరిగా అమలుచేస్తే బాగానే ఉండేది.

తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏంటి?
తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నా, వీరికి ప్రయోజనం కలగలేదు. నీటి యాజమాన్యాన్ని నాయకులు చూడటం మొదలుపెట్టారు. ఇవి పేదజనాల కొట్లాటలు కావు. వారు ఎక్కడైనా అంతే. మధ్యతరగతే ఈ పోరాటం చేస్తోంది. ఇది శాస్త్రబద్ధమైన తగాదా. దీంట్లో వర్గపోరాటాల్లేవు.

న్యాయవ్యవస్థలో కులతత్వం ఉందా?
మద్రాస్‌లో బ్రాహ్మలు తప్ప వేరెవరూ అడ్వొకేట్లు కారు. వాళ్లకి ఇంగ్లీషుమీద, చట్టం మీద ఆధిపత్యం ఉంది. విశ్లేషించే సామర్థ్యం ఎక్కువ ఉండేది. న్యాయమూర్తులూ బ్రాహ్మలే. ఇప్పుడైనా జాబితా చూస్తే ఎంతమంది అగ్రకులాల వారున్నారు? ఎందరు దళితులున్నారో తెలుస్తుంది.

మీది తమిళ బ్రాహ్మణ కుటుంబం. సంప్రదాయానికి భిన్నంగా దళితులు, ముస్లింల వెంట ఎందుకు పడ్డారు?
మేం పెరిగిన రోజుల్లో పెద్ద ఎత్తున మార్క్సిజం మమ్మల్ని ఆకర్షించింది. పేదవాళ్ల గురించి రాసినవాడు మార్క్స్ ఒక్కడే. మార్క్స్ సాహిత్యం, దాని చుట్టూ ఉన్న విజన్ ఓ ప్రపంచ దృక్పథం కల్పించి, పేదల వైపు నన్ను పంపింది.

No comments:

Post a Comment