Friday, 6 January 2012

రాయ్‌పూర్‌లో వికృత న్యాయం

- ఇందర్ మల్హోత్రా
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/dec/30/edit/30edit3&more=2010/dec/30/edit/editpagemain1&date=12/30/2010

భారత రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని హింసాత్మక పద్ధతులలో కూల్చివేయడానికై, సాయుధ తిరుగుబాటుకు పూనుకున్నవారిని కఠినంగా అణచివేయవల్సిందే. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావులేదు. దేశ ఆంతరంగిక భద్రతకు పెద్ద ముప్పుగా ప్రధాని మన్మోహన్ అభివర్ణించిన నక్సలైట్ల విషయానికి వస్తే, ఈ విధానంలో మరో ముఖ్యమైన అంశముంది.

కత్తి ఎత్తినవాడు కత్తితోనే కూలబడుతాడనే లోకోక్తిని నిజం చేస్తూనే, అదే సమయంలో దేశ ఆదివాసీలకు ముఖ్యంగా మధ్య భారత రాష్ట్రాల్లోని వారికి దశాబ్దాలుగా జరుగుతోన్న భయంకరమైన అన్యాయాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత ప్రభుత్వమూ, పౌర సమాజమూ దృఢ సంకల్పంతో పూనుకోవాలి.

నిస్వార్థ వైద్యుడు, మానవహక్కుల కార్యకర్త డాక్టర్ వినాయక్ సేన్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్ రాజధాని)లోని సెషన్స్ కోర్టు ఒకటి వెలువరించిన తీర్పు మీకు దిగ్భ్రాంతి కల్గించలేదా విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణకు దుర్భలమైన సాక్ష్యాధారాలతో డాక్టర్ సేన్ పట్ల న్యాయస్థానం ఇంత కఠినంగా వ్యవహరించడం ఆయన కుటుంబసభ్యులనే కాదు, ప్రజాస్వామిక చైతన్యం కల ప్రతి ఒక్కరినీ నిరుత్తరుణ్ణి చేసింది.

ఆసేతు హిమాచలం విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు డాక్టర్ సేన్‌కు జరిగిన అన్యాయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నక్సలైట్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటనేది సందేహాతీతమైన విషయం. అయినంత మాత్రాన రాయ్‌పూర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జి బి.పి.వర్మ ఇటువంటి రాక్షస తీర్పు వెలువరించడం న్యాయబద్ధమేనా వర్మ తీర్పు పూర్తిగా లొసుగుల మయమే కాదు, అది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యమైనది కాదు.

భద్రతా సిబ్బంది,అమాయక సామాన్య ప్రజలపై నక్సలైట్లు, అమలు జరుపుతున్న విచక్షణారహిత హింసను వ్యతిరేకిస్తున్నవారు రాయ్‌పూర్ జడ్జి తీర్పును సమర్థించవచ్చు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వలే, ఛత్తీస్‌గఢ్ పోలీసులు కూడా మావోయిస్టులకు మద్దతుదారు గా తాము భావిస్తున్న వ్యక్తికి గరిష్ఠ స్థాయిలో శిక్ష పడాలని కోరుకుంటున్నారు.

డాక్టర్ సేన్ విషయంలో వారి అభీష్టం నెరవేరింది. అయి తే పాలకులు, పోలీసుల కంటే న్యాయమూర్తులు వాస్తవాల పట్ల మెరుగైన అవగాహనతో నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోగలరని ఎవరైనా భావిస్తారు. న్యాయాధికారులు చట్టాన్ని మినహా మరి దేన్నీ పరిగణలోకి తీసుకోకూడదు. రాయపూర్ సెషన్స్ జడ్జి వర్మ ఈ ఆరోగ్యకరమైన న్యాయ నియమాన్ని ఉపేక్షించారు.

వర్మ వెలువరించిన 92 పేజీల తీర్పు పట్ల న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాన్య పౌరులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. సందిగ్ధ సాక్ష్యాధారాలనే ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. అంతకంటే చోద్యం భారతీయ శిక్షా స్మృతిలో విద్రోహానికి సంబంధించిన సెక్షన్ 24 ఎ అనేది వలస పాలకుల నుంచి సంక్రమించిన నిబంధన అని సుప్రీం కోర్టు 1962లోనే స్పష్టం చేసినా ఆ కాలం చెల్లిన నిబంధన ఆధారంగానే జడ్జి వర్మ తన తీర్పునివ్వడం.

నిందితుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును రెచ్చగొడుతున్నాడనేందుకు ప్రత్యక్ష రుజువులు లభించేంతవరకు ఆ వ్యక్తిపై దేశ ద్రోహ అభియోగాన్ని మోపకూడదని సర్వోన్నత న్యాయస్థానం దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే విస్పష్టంగా పేర్కొంది. మరి డాక్టర్ సేన్ కేసులో ఛత్తీస్‌గఢ్ పోలీసులు నివేదించిన సాక్ష్యాధారాలు చాలా బలహీనమైనవి. జైలులో ఉన్న మావోయిస్టు నాయకుడు నారాయణ్ సన్యాల్ నుంచి కొన్ని లేఖలను బయటకు చేరవేశాడన్నదే వినాయక్ సేన్‌పై పోలీసులు చేసిన ఆరోపణ. ఆ లేఖలను కోల్‌కతా లోని పీయూష్ గుహా అనే వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

సన్యాల్‌తో పాటు పీయూష్ గుహాకు కూడా యావజ్జీవ శిక్ష విధించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే డాక్టర్ సేన్ జైలులో ఉన్న మావోయిస్టు నేత నుంచి లేఖలను బయటకు చేరవేశాడనేందు కు పోలీసులు చూపిన రుజువు పీయూష్ వాంగ్మూలం కాదు. ఆ లేఖలను మరో వ్యక్తి ద్వారా పీయూష్‌కు అందజేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఆ మరో సాక్షిని పోలీసులు అరెస్ట్ చేసి రెండేళ్ళ పాటు జైలులో ఉంచారు. అయినప్పటికీ అతన్ని ఎప్పుడు, ఎందుకు అరెస్ట్ చేసింది అన్న విషయమై పోలీసులు వివరణ ఇవ్వలేక పోతున్నారు!

ఇదంతా దేశ ద్రోహ కార్యలాపాలకు జరిగిన 'కుట్ర'గా రాయపూ ర్ జడ్జి పరిగణించారు. నిందితులలో ఒకరైన డాక్టర్ సేన్ జైలులో ఉన్న మావోయిస్టు నేత నారాయణ్ సన్యాల్‌ను పలు మార్లు కలుసుకోవడాన్ని అందుకు అదనపు రుజువుగా జడ్జి భావించారు. జైలు అధికారులు సేన్, సన్యాల్‌ల సమావేశాలకు తామే అనుమతిచ్చామ ని, జైలు అధికారుల సమక్షంలోనే ఆ సమావేశాలు జరిగాయని అనికూడా పేర్కొన్నారు.

సేన్, సన్యాల్‌ల మధ్య జరిగిన వారి సంభాషణల్లో అభ్యంతరకరమైనవేవీ చోటు చేసుకోలేదని కూడా తెలిపారు. ఒక విచిత్రమైన రుజువును కూడా పోలీసులు ఉదహరించారు. డాక్టర్ సేన్ పాకిస్థాన్ గూఢచారి సంస్థకు ఇ మెయిల్స్ పంపారని వారు ఆరోపించారు. నిజానికి సేన్ ఇ మెయిల్‌ను పంపింది ఐఎస్ ఐ (ఢిల్లీలోని 'ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్') కాగా దాన్ని అదే సంక్షిప్త నామం గల పాక్ గూఢచారి సంస్థగా ఛత్తీస్ గఢ్ పోలీసులు భావించారు.

వినాయక్ సేన్ ఉదంతంపై మన విదేశీ గూఢచారి సంస్థ 'రా' రిటైర్డ్ డిప్యూటీ చీఫ్, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక నిపుణు డు బి. రామన్ అభిప్రాయాలను తప్పక పరిశీలనలోకి తీసుకోవల్సి వుంది. డాక్టర్ సేన్ పై నిర్ణయం తీసుకోవడంలో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని వుండవల్సిందని ఆయన పేర్కొన్నారు.

అవి సేన్ మానవీయ వ్యక్తిత్వం, ఆదివాసీలకు ఆయ న చేసిన సేవలు; గతంలో ఎన్నడూ హింసాకాండకు పాల్పడినట్టుగాని, ప్రోత్సహించినట్టుగాని పోలీసుల దృష్టికి రాకపోవడం; విశ్వసనీయమైన రుజువులులేని సాక్ష్యాధారాలను కేసుకు ప్రాతిపదికగా తీసుకోవడం.

తీవ్రవాద కార్యకలాపాల నిరోధక విధాన రూపకర్తలు, ఆ విధానాన్ని అమలుపరిచే వారు కొన్ని వాస్తవాలకు మరింత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని రామన్ పేర్కొన్నారు. 'కరడుగట్టిన' తీవ్రవాదులపై 'కఠినచర్య' తీసుకోవాలని, డాక్టర్ వినాయక్ సేన్ లాంటి ' సానుభూతిపరుల'పట్ల సంయమనంతో వ్యవహరించాలని ఆయన సలహా ఇచ్చారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం వల్ల డాక్టర్ సేన్ వంటి వారు తీవ్రవాదులకు సంపూర్ణ మద్దతుదారులవుతారని, సమస్య మరింత సంక్లిష్ట మవుతుందని ఆయన పేర్కొన్నా రు.

రాయపూర్ సెషన్స్ జడ్జి తీర్పు అనవసరంగా చట్టాన్ని సాగదీసిందని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. ఏ పరిస్థితులనైతే నివారించవచ్చునో ఆ పరిస్థితులనే ఆ తీర్పు సృష్టించింది. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గమూ నక్సల్స్ విషయంలో మితిమీరి చర్యలు చేపట్టే ధోరణిని మానుకోకపోతే జాతీయ ప్రయోజనాలకు హాని జరగడం ఖాయం. రామన్ వివేకవంతమైన సలహాను మన పాలకులు పాటిస్తారని ఆశిద్దాం.

చాలా క్రూరమైన, కాలం చెల్లిన, వలసపాలనాయుగం నుంచి సంక్రమించిన చట్టాలపైనే మనం ఇంకా ఆధారపడుతున్నాం. ఆ చట్టాల స్థానంలో తక్షణమే కొత్త చట్టాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పాలన అరవై మూడేళ్ళ స్వాతంత్య్రానంతరమూ 19వ శతాబ్దిలో బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన చట్టాల ప్రకారమే సాగుతోంది. ఇది చాలా సిగ్గుచేటైన అంశం.

అధికారపూర్వకంగా భూముల స్వాధీనతపై చోటుచేసుకుంటున్న ప్రజల తిరుగుబాట్లకు మూలకా రణం ఆ భూస్వాధీనాలన్నీ 1894 నాటి కాలం చెల్లిన చట్టం ప్రకారం జరగడమే. మన పోలీసు శాఖల పాలన సైతం చాలా పాత కాలం నాటి చట్టం ప్రకారమే జరుగుతోంది. కాలదోషం పట్టిన ఆ చట్టాన్ని సవరించడానికి, పోలీసు వ్యవస్థ పనితీరును మార్చడానికి జరిగిన ప్రయత్నాలేవీ ఇంతవరకు ఫలించలేదు.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

సాటి లేని శంకరన్

-సంపాదకీయం
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/oct/8/edit/8edit1&more=2010/oct/8/edit/editpagemain1&date=10/8/2010

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు- అని ప్రజాకవి అందెశ్రీ రాసిన పాట, మనుషులలో మృగ్యమవుతున్న మానవవిలువల గురించిన ఆవేదన కావచ్చును కానీ, మంచి మనుషులు భౌతికంగా కూడా మాయమైపోతున్నారు. నిజాయితీకి, నిప్పులాంటి ఆచరణకీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మారుపేరుగా మెలగి న హక్కుల నేత కె.బాలగోపాల్ కన్నుమూసి ఏడాది అయిన సందర్భంగా శుక్రవా రం నాడు ఆయనను సగౌరవంగా కృతజ్ఞతతో ఇంకా ఆరని కన్నీళ్లతో సంస్మరించుకోబోతున్నాము. ఇంతలోనే మరో శిఖరం కూలిపోయింది.

జీవితాంతం దళితుల సంక్షేమం కోసం, పేదవారి అభ్యున్నతి కోసం తపన చెందుతూ, అధికార యంత్రాంగం అనే ఇసుము నుంచి సంక్షేమ తైలాన్ని పిండిన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు రెండు దశాబ్దాల కిందట రిటైరయ్యేదాకా ప్రభుత్వ సర్వీసులోనూ, ఆ తరువాత సామాజిక కార్యక్షేత్రంలోనూ తాను నమ్మిన ఆదర్శాల కోసమే పనిచేస్తూ వచ్చిన అరుదైన వ్యక్తి శంకరన్. ఆయన చేసిన కృషిని సవినయంగా స్మరించుకుని శ్రద్ధాంజ లి ఘటించేటప్పుడు- ఆయన వంటి వారు రాను రాను కరువవుతున్న వర్తమానం భయం కలిగిస్తున్నది.

కుటుంబం స్వార్థ చింతన కలిగిస్తుందని, తన ఆదర్శాలకు అవరోధం అవుతుంద ని పెళ్లే చేసుకోకుండా ఉన్న వ్యక్తి శంకరన్. ప్రశాసన నగర్ వైభవం చూసిన వారికి పంజాగుట్టలో శంకరన్ నివసించిన పాతకాలపు క్వార్టర్స్ చూస్తే చాలు ఆయనేమి టో అర్థమవుతుంది. బాలగోపాల్‌లో లాగే శంకరన్‌లో కూడా నిరాడంబరత, నిస్వా ర్థం వ్యక్తిత్వ విశేషాలే తప్ప, అవే వారి వ్యక్తిత్వ సారాంశాలు కావు. పరిస్థితులను మార్చాలన్న దృఢమైన, చైతన్యవంతమైన సంకల్పమే వారి వ్యక్తిత్వాలను అట్లా తీర్చిదిద్దింది.

సాంఘిక సంక్షేమ శాఖలో ఆయన పనిచేసిన కాలం- శంకరన్ యుగం. ఆయన హయాంలో జారీ అయిన అసంఖ్యాకమైన ఉత్తర్వులు శంకరన్ జీవోలు. అసలు ఆయన పేరే సోషల్ వెల్ఫేర్ శంకరన్. నేడు దళితులు అనేక రంగాలలో పొందుతున్న రాయితీలు కానీ, సహాయాలు కానీ శంకరన్ జీవోల ద్వారా సంక్రమించినవే. అత్యాచారాల నిరోధక చట్టం రూపకల్పనలోనూ, దానిని అర్థవంతంగా వినియోగించడంలోనూ ఆయన కృషి విశేషమైనది.

చట్టం అమలులో జిల్లా కలెక్టర్లకు క్రియాశీల పాత్ర కల్పించడం శంకరన్ ఆలోచనే. అత్యాచారాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కూడా ఆయన ప్రయత్న ఫలితమే. దళితుల సంక్షే మం కోసం శంకరన్ చేసిన కృషి అంతటిలోకి విశిష్టమైనది దళిత ఉపప్రణాళిక అమ లు. అట్టడుగుస్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి వరకు వ్యయంలో పదిహేను శాతం దళితుల కోసం వెచ్చించాలని ఆయన పోరాడి ఉత్తర్వులు సాధించారు. ఏజె న్సీ ప్రాంతాలలో పనిచేసినప్పుడు గిరిజన సంక్షేమం కోసం కూడా ఆయన అంతే పట్టుదలగా పనిచేశారు.

అయితే, గిరిజన సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన గిరిజనేతర అధికారులు అనేక మంది కనిపిస్తారు. కానీ, దళితుల కోసం ఇంతగా తపన పడిన దళితేతరుడైన అధికారి ఎవరంటే శంకరన్ పేరు మాత్రమే స్ఫురిస్తుం ది. గిరిజన రాష్ట్రం త్రిపుర అవతరించినప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించాలని వెదికినప్పుడు- దేశమంతటిలోనూ శంకరన్ ఒక్కరే యోగ్యుడిగా కనిపించారు. ఆయనలోని కార్యసాధకుడిని చూసే సుప్రీంకోర్టు శంకరన్‌ను ఆహారహక్కు కమిషనర్‌గా నియమించింది.

ఆహారహక్కును జీవించే హక్కులో భాగంగా పరిగణించి, దాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా శంకరన్ గుర్తించారు. ఆకలి నుంచి ప్రజలకు విముక్తి లభించి, వారు ఆత్మగౌరవంతో జీవించే వీలున్న సమాజా న్ని సృష్టించడమే రాజ్యాంగ కర్తవ్యమని, అందుకే తాను తపన పడుతున్నానని శంకరన్ చెప్పేవారు.

రాజ్యాంగంలో చెప్పిన ఆదేశిక సూత్రాలను కానీ, చట్టాలలో పొందుపరచిన రక్షణలను కానీ ప్రభుత్వాధినేతలు, యథాతథవాద బ్యూరోక్రాట్లు తేలికగా తీసుకోవ చ్చు. ఇరవయి సూత్రాల కార్యక్రమమో, పదిహేను సూత్రాల కార్యక్రమమో మభ్యపెట్టే ప్రయత్నం తప్ప పట్టింపుగా అమలు చేయనక్కరలేదని రాజకీయవాదులు భావించవచ్చు. శంకరన్ భారత రాజ్యాంగాన్ని, అందులో పొందుపరచిన లక్ష్యాల ను, ఆదర్శాలను సీరియస్‌గా తీసుకున్న అధికారి.

శాసనాల్లో చెప్పుకున్న సంక్షేమా న్ని ఆచరణలో ఎందుకు తీసుకురాలేమని పంతం పట్టి, అనేక చేదు అనుభవాలు ఎదురైనా సరే, పట్టువదలని నిజమైన సివిల్ సర్వెంట్ ఆయన. ఇరవయి సూత్రాల అమలులో భాగంగా వెట్టిచాకిరి నిర్మూలనను పటిష్టంగా అమలుచేస్తూ, అస్మదీయులకెవరికో ఇబ్బంది కలిగించారని ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కోపగించినప్పుడు, సెలవులో వెళ్లి తన ఆత్మాభిమానాన్ని, నిరసనను వ్యక్తం చేసిన వారు శంకరన్.

శంకరన్ వ్యక్తిత్వం, నిక్కచ్చితనం పేదప్రజలను ఎట్లాగూ ఆకర్షిస్తుంది. కానీ, ప్రభుత్వోద్యోగులలోనూ, సివిల్ సర్వీస్ అధికారుల్లోనూ ఆయనకు అభిమానులు అసంఖ్యాకం. ఆయన దగ్గర పనిచేసి, ఆయన మార్గంలో ఎంతో కొంత పనిచేయాలని కొందరైనా దళిత, దళితేతర అధికారులు ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు.

అయితే, కఠోర నైతికత, నిరాడంబర జీవనశైలిలో శంకరన్ దరిదాపుల్లో కూడా ఎవ రూ కనిపించరు. తన సామాజిక బాధ్యతను ఉద్యోగ ధర్మంతోనే ఆయన ముడిపెట్టుకోలేదు. ప్రభుత్వమూ నక్సలైట్ల మధ్య చర్చల కోసం ఆయన 'పౌరస్పందన వేది క' ద్వారా జరిపిన ప్రయత్నాలు విశేషమైనవి. నక్సలైట్లు 1987లో కిడ్నాప్‌చేసిన ఐఏఎస్ అధికారుల బృందంలో ఒకరిగా శంకరన్ ఆనాడు సంచలన వార్త అయ్యా రు. శంకరన్ వంటి అధికారిని కాపాడుకోవడం ప్రభుత్వానికి ఆనాడు అనివార్యమైంది.

శంకరన్ బృందానికి అపకారం తలపెట్టగలిగే సాహసం నక్సలైట్లూ చేయలేకపోయారు. కిడ్నాప్ చేసిన నక్సలైట్లు ఒక్కొక్కరుగా తరువాత కాలంలో ఎన్‌కౌంటర్లలో మరణించినప్పుడు శంకరన్ ఎంతో బాధపడ్డారు. నక్సలైట్ల మార్గంతో ఏకీభావం లేనప్పటికీ, మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తున్న సాధకులుగా ఆయనకు వారిపై గౌరవం ఉండేది. అదే సమయంలో హింసా సంఘటనలను ఆయన వ్యతిరేకించేవారు.

శంకరన్ జీవితం, త్యాగపూరిత జీవితం వృథా కావని, ఆయన నుంచి కొందరైనా స్ఫూర్తి పొంది మంచితనాన్ని మిగుల్చుతారని ఆశిద్దాం.

విప్లవ దేశదిమ్మరి అసిత్‌సేన్ గుప్తా

-వరవరరావు
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jan/9/edit/9edit3&more=2011/jan/9/edit/editpagemain1&date=1/9/2011

డాక్టర్ బినాయక్ సేన్, నారాయణ్ సన్యాల్, పీయూష్ ఘోష్ లకు రాయపూర్‌లోని సెషన్స్ జడ్జి యావజ్జీవ శిక్ష ప్రకటించిన రోజే మరో మేధావి, రచయిత, 'వరల్ట్ టు విన్' ప్రచురణ కర్త, ఎడిటర్ అసిత్‌సేన్ గుప్తా కు కూడ అదే పట్టణంలోని మరో సెషన్స్ కోర్టు ఎనిమిదేళ్ల శిక్ష విధించింది. ఈ విషయం ప్రజాస్వామ్య వాదుల దృష్టికి తగినంతగా రానట్లున్నది. కలకత్తాలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ అనే సంస్థ మాత్రం రెండు శిక్షలు రద్దుచేయాలని, భారత శిక్షా స్మృతి నుంచి రాజద్రోహ నేరం తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తున్నది.

అసిత్‌సేన్ గుప్తాకు రాజద్రోహ నేరానికి మూడేళ్లు, మరో ఆరోపణకు ఎనిమిదేళ్లు శిక్ష విధించారు. అంటే ఆయన కనీసం ఎనిమిదేళ్లు జైల్లో మగ్గ వలసిందే. ఇప్పటికే ఆయన రాయపూర్ జైల్లో మూడేళ్లకు పైగా బెయిలు కూడా రాకుండా అనారోగ్యంతో మగ్గుతున్నాడు. 2009 జూలైలో నేను రాయపూర్ లో ఒక సెమినార్‌కు వెళ్లిన సందర్భంగా జైల్లో ఆయననొక్కణ్ణే కలుసుకోగలిగాను. ఆయన నాతో పాటు చిరకాలం అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఎఐఎల్ఆర్‌సి)లో కార్యవర్గ సభ్యుడుగా ఉన్నాడు.

బెంగాలీ, హిందీ, మలయాళీ, ఇంగ్లీష్ భాషల్లో రాజకీయ వ్యాఖ్యానాలు, హిందీలో కవిత్వం కూడా రాసేవాడు. సునిశిత మేధావి. నాకు జైల్లో అసిత్‌సేన్‌ను కలవడానికి అనుమతి కూడా సూపరింటెండెంట్ ఇచ్చినది కేవలం ఆయన రచయిత, నాతోపాటు ఒక సాహిత్య, సాంస్కృతిక సంస్థలో పనిచేశాడనే అనుకూలతతోనే. నేను కలిసినప్పుడు జైలు సూపరింటెండెంట్ స్వయంగా అసిత్ సేన్ హిందీలోకి అనువాదం చేసిన జోస్ మారి యాసిజన్ (సుప్రసిద్ధ ఫిలిప్పైన్స్ విప్లవ నాయకుడు, కవి) కవిత్వం చదువుతున్నాడు. తాను సెన్సార్ చేసి బయటికి పంపడానికి.

అరెస్టయ్యేనాటికి అసిత్‌సేన్ గుప్తా 'స్ట్రగుల్ ఇండియా' అనే సంస్థకు అధ్యక్షుడు. రాయపూర్‌లోనే ఆయన అద్దెకున్న ఇంటి మీద పోలీసులు దాడిచేసినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన సాహిత్యం, వరల్ట్ టు విన్, ఇంగ్లీష్, హిందీ సంచికలు, పూర్వీ పబ్లికేషన్స్ తరఫున ఆయన ప్రచురించిన పుస్తకాలు మాత్రమే దొరికాయి. ఇవన్నీ చట్టబద్ధంగా, బహిరంగంగా వస్తున్న సాహిత్యం. వీటిలో వరల్డ్ టు విన్ -ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడుతూ రిజిష్టర్డ్ కూడా అయిన ప్రామాణిక మైన పత్రిక.

పూర్వీ ప్రచురణ లు కూడా రిజిష్టర్డ్ సంస్థ. అయినా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న యుద్ధ వాతావరణం లో ఆయనకు మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయనే నెపంతో జైల్లో పెట్టి మూడేళ్లుగా ఇంత చిన్న ఆరోపణపై పోలీసులు బెయిలుకు కూడా అడ్డు పడుతున్నారు. ఏ ఆధారమూలేని కుటుంబం కనుక (ఆయన కేరళలోని విప్ల వ ప్రజాసంఘంలో పనిచేస్తున్న మహిళా కార్యకర్తను వివాహమాడారు) ఆర్థికంగా కూడా తన కేసు విచారణ కోసం తానుగా ఏ ప్రయ త్నం చేయలేకపోయాడు.

అసిత్‌సేన్ గుప్తా విప్లవ దేశదిమ్మరి. కలకత్తా బెనారస్, ఢిల్లీ, రాయపూర్, త్రిసూర్‌లో విప్లవ సాంస్కృతికోద్యమాల్లో పనిచేశాడు. నక్సల్బరీ రాజకీయా ల పట్ల ఆకర్షితుడై కేరళ నుంచి వెలువడే రెడ్ ఫ్లాగ్ పత్రికకు సంబంధించిన ప్రచురణలు ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్‌లో తెచ్చేవాడు. ఆ తర్వాత సిపిఐ ఎంఎల్ (నక్సల్బరీ) పార్టీ ప్రచురణలు, సాహిత్యంతో అనుబంధంగా పనిచేశాడు.

కెఎన్ రామచంద్రన్, కానూ సన్యాల్ నాయకత్వంలోని సిపిఐ ఎంఎల్ లో చేరిన తర్వాత అసిత్‌సేన్ కేరళలో ఏర్పడిన 'పోరాటం' సంస్థ సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యకలాపాలను ఢిల్లీ, రాయపూర్‌లో నిర్వహించేవాడు. అట్లా నేపా ల్ మావోయిస్టు పార్టీ చొరవతో వచ్చే వరల్డ్ టు విన్ పత్రిక ప్రచురణను, సంపాదక బాధ్యతలను ఢిల్లీనుంచి నిర్వహించేవాడు. ఆ విధంగా చూసినప్పుడు నిర్మాణ రీత్యానూ, సంస్థాగతంగానూ ఆయన భారత మావోయిస్టు పార్టీ కార్యలాపాలకు కూడా చెందిన వాడుకాదు.

రచయితగా, బుద్ధిజీవిగా, సాంస్కృతి క కార్యకర్తగా ఆయన తన రాజకీయ విశ్వాసాలు ఏమయినప్పటికీ ఎఐఎల్ ఆర్‌సి కాలం నుంచి కూడా భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక సాంస్కృతిక కార్యకలాపాల్లో నక్సల్బరీ పంథాను, చైనా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ భావధారను ప్రచారంచేసే కార్యక్రమాల్లో క్రియాశీలంగా కొనసాగుతూ వస్తున్నాడు. తన కార్యక్షేత్రంగా కూడా రచన, ప్రచురణ రంగాల్లో ఈ భావజాల ప్రచారాన్ని ఎంచుకున్నాడు. దేశ వ్యాప్తం గా అఖిల భారతస్థాయిలో జరిగే సామ్రాజ్యవాద వ్యతిరేక సభల్లో, సదస్సుల్లో ఆయన వేదిక మీద వక్తగా ఎంత కనిపించే వాడో అంతకన్న ఎక్కువ గా ఆయన సహచరితో కలిసి ప్రచురణలు అమ్మే పుస్తకాలశాలల్లో కనిపించేవాడు.

స్నేహ పాత్రుడు. సాహిత్య జీవి. వయసేమిటో పోల్చుకోలేనంత బక్క పలుచని అతి సాధారణ శరీర నిర్మాణం. మాంసం లేని శరీరం. ఆచ్ఛాదనగా ఉండే ఆహార్యం. సాన్నిహిత్యం, సంభాషణల్లో , ప్రసంగాల్లో మాత్ర మే వ్యక్తమయ్యే అపార మైన అధ్యయన, అనుభవ జ్ఞానం. అవగాహన. ఒక బలమైన దేశవ్యాప్తమైన నిర్మాణంలో సంస్థలో ఉన్న వాడు కాదు.

అష్ట దారిద్య్రాన్ని అనుభవిస్తూ పుస్తకాలు అచ్చు వేసుకుంటూ, అమ్ముకుంటూ అదే ఆధారంగా జీవిక వెళ్ల దీసుకుంటున్నవాడు. కాకపోతే నక్సల్బరీ రాజకీయా ల్లో నాకు తెలిసి మూడు దశాబ్దాలుగా అలుపెరగని సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారంలో ఢిల్లీ, రాయపూర్‌లు కేంద్రంగా తిరుగుతున్నాడు. అసిత్ సేన్‌గుప్తాను అరెస్టుచేసి ఆ నిరరంతర చలన ప్రచారాన్ని అరికట్టగలిగిందే గానీ ప్రభుత్వం ఆయన నిబద్ధతను నిర్బంధించలేకపోయింది.

విశ్వాసాలను బంధించి, శిక్ష వేస్తే రాజద్రోహం చేయకుండా ఒక బుద్ధి జీవి బుద్ధిగా ఉండగలడన్నంత పిరికిగా, కక్షతో వ్యవహరిస్తున్నది రాజ్యం. అందుకే గ్రీన్‌హంట్ ఆపరేషన్ కేవలం వనర్ల కోసం కంపెనీల దళారీగా ప్రభుత్వం తన ప్రజల మీద తాను చేసే ప్రత్యక్ష యుద్ధం మాత్రమేకాదు. అది ఒక భావజాలం. అభివృద్ధి నమూనా పేరుతో అమలవుతున్న ఒక విధ్వంస భావజాలం. ఒక దోపిడీ భావజాలం. ఇవ్వాళ దేశంలో ఒక మౌలిక ప్రతిఘటనా భావజాలంగా, ప్రజల అభివృద్ధి రాజకీయంగా ఆచరణలో ఉన్నది. నక్సల్బరీ పంథాను ముందుకు తీసుకు పోతున్న మావోయిస్టు సిద్ధాంత ఆచరణ.

జల్, జంగిల్, జమీన్, గనులు, వనర్లు ఈ దేశ ప్రజలకే చెందాలని వాటిపై దేశప్రజలకే సార్వభౌమాధికారం ఉండాలని నమ్ముతు న్న నిజమైన దేశభక్తుల్లో అసిత్‌సేన్ గుప్తా ఒకరు. తన వంటి వారిని కలుపుకొని 'స్ట్రగుల్ ఇండియా అనే ఒక పోరాట సంస్థను నిర్మాణం చేస్తున్న దశలో నే అసిత్‌సేన్ గుప్తాను నిర్బంధించి ఇవ్వాళ ఆయనకు రాజద్రోహ నేరానికి, మరో ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణకు ఎనిమిదేళ్ల శిక్ష విధించింది కోర్టు. బినాయక్ సేన్ యావజ్జీవ శిక్ష రద్దు చేయాలని ఉద్యమిస్తున్న ప్రజాస్వామ్యవాదులందరూ అసిత్‌సేన్ గుప్తాకు కోర్టు విధించిన శిక్ష కూడా రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.

-వరవరరావు

కడపటి వీడ్కోలు- కొన్ని ఆలోచనలు

 -వసంత కన్నబిరాన్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/jan/5/edit/5edit5&more=2011/jan/5/edit/editpagemain1&date=1/5/2011

కన్నబిరాన్ డిసెంబర్ 30న వెళ్ళిపోయారు. మేము ముందే మాట్లాడుకున్న మాటలపై ఆధారపడి, ఆయన కోరిక మేరకు, ఆయన అంతిమ సంస్కారాలు నిరాడంబరంగా, త్వరితంగా, లౌకిక పద్ధతిలో జరుగుతాయని తెలియజే శాం. లౌకికింగా జరగటానికి ఏ అభ్యంతరాలు లేవు. ఏ పేచీ లేదు. పూలు, దీపాలు, మంత్రాలు, ఇతర తంతులేమీ లేవు. కానీ 'అభ్యుదయ సంప్రదాయా లు' తీవ్రంగా ఇబ్బంది పెట్టడం నేను గమనించాను. మతపరమైన ఛాందసా న్ని వదిలించుకుని మనం వేరే విధమైన ఛాందసాన్ని కొని తెచ్చుకుంటున్నామనిపించింది.

కాలధర్మం చెందిన మనిషికి చివరిసారి గౌరవం తప్పనిసరిగా తెలుపుకోవాల్సిందే (పువ్వులు, నినాదా ల రూపంలో). చివరి దర్శనం చేసుకోవాలి దేనిని 51 సంవత్సరాలు కన్నబిరాన్ భార్యగా ఉన్న నేనే ఆయన చివరకు మిగిల్చి వెళ్ళిన శరీరాన్ని కన్నబిరాన్ అనుకోలేకపోయాను. నా బాధ, విచారం అంతా నిరంతరం అలుపెరగకుండా ఆయన చేసిన పోరాటం గరించి, ఆయన చిరునవ్వుల గురించి, సున్నిత హృద యం గురించి. అవి ఈ భౌతికకాయంలోంచి వెళ్ళిపోయాయి.

మేమిద్దరం చాలాకాలం క్రితమే మాలో ఎవరం చనిపోయినా భౌతికకాయాన్ని ఎవరి కోసమూ, మా ఒక్క అబ్బాయి అరవింద్ కోసం కూడా వేచి ఉంచకూడదనుకున్నాం. కన్నబిరాన్ ప్రజల మనిషి. ఆయన ను ప్రేమించే ప్రజలకే చెందిన మనిషి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ దాని అర్థం ఆ ప్రజలు -నిజానికి ప్రజలు కాదు- ఆ ప్రజలకు ప్రతినిధులుగా తమను తాము నియమించుకున్న వారికి, పరస్పరం ఘర్షణపడే అనేక గ్రూపులకు చెందిన వారి కి ఆయన శరీరాన్ని ముక్కలు చేసి తలొక దిక్కుకీ తీసుకెళ్ళే హక్కు కావాలా

మనకు సంకేతాలు తప్ప సారాంశం అక్కర్లేదు. దానికి తోడు కొంత మన గురించి మనకో ధైర్యం, హామీ దొరకాలి. మనం ఎంత పెద్దగా స్పష్టంగా నినాదాలిచ్చినా కణ్ణా కు అవి వినపడతాయా అవి సంప్రదా య మంత్రాల వలె ఆయన ఆత్మను స్వర్గానికి తీసి కెళ్తాయా ఎవరికి మనం ధైర్యం చెప్తున్నాం మనకు మౌనం అంటే భయం దేనికి

మన రాడికల్ ఛాందసత్వాలను తిరోగామి ఛాందసత్వాలకంటే మరింత కరకుగా అర్థరహితంగా చేస్తున్నాం. రియాక్షనరీ ఏది రాడికల్ ఏది మనం ప్రేమించే వ్యక్తులకు స్మృతి చిహ్నాలు కట్టడానికి అంత ఆత్రం దేనికి కన్నబిరాన్ ప్రజల హృదయాల్లో జీవించకపోతే నివాళులు, స్మృతి చిహ్నాలు ఆయనను సజీవంగా నిలప గలుగుతాయా

నిజమేమిటంటే చనిపోయిన వారికి ఇవేమీ పట్టవని మనకు తెలుసు. మనం ఆ కీర్తిశేషుల పక్కన కనిపించాలనే తహ తహే అసలు విషయం. ప్రజల ముం దు మన ముండాలనేదే అసలు సంగతి. ఆ టివి కెమెరాలు మన విషాదాన్ని మన గొప్పదనాన్ని మన మన గ్రూపుల ప్రజలకు ప్రసారం చేసి చూపటం మీదే మన ఆసక్తి. ఇవాళ మీడియానే పరిపాలిస్తోంది.

వాళ్ళ దగ్గరున్న ఫైల్ ఫోటోలు, అర్థవంతమైన ఇంటర్వ్యూలను బైటికి తీసి చూపించే బదులు కెమెరాల్ని మృత శరీరం మీదా, ముక్కుల్లో ఉంచిన దూది మీదా ఏడ్చే వాళ్ళ విషాదం మీదా ఫోకస్ చేసి 'పబ్లిక్' ముందుంచుతారు. టెక్నాలజీని పరిణతి లేకుండా అర్థరహితంగా వాడే రియాలిటీ షోల కొనసాగింపే ఇది.

మరణించే వ్యక్తిని ఆయనను ప్రేమించేప్రజల ముందు సజీవం చేయకుండా ఆ వ్యక్తి దహనకర్మల వివరాలతో నింపుతారు. ఎంతమంది వచ్చారు ఎన్ని బ్యానర్లు, ఎన్ని ప్లకార్డులు, ఎన్ని సంస్థలు ఎంత మం ది విఐపిలు మరణించిన మనిషి గౌరవార్ధం వచ్చారనే లెక్కలు. మరణించిన వ్యక్తికి గౌరవం ఇవ్వటానికి మొదటి గుర్తు గన్‌మెన్‌లను, సెక్యూరిటిగార్డులను దూరంగా ఉంచి రాగలగటం. కె.జి.కన్నబిరాన్ దగ్గరకు పక్కన గన్‌మెన్‌లతో రావడమంటే ఆయన భావాలకు అవమానం మరొకటుందా

ఆయన పట్ల అంతకంటే మొరటుదనంగా వ్యవహరించటం ఊహించగలమా మనం మన తుప్పుని, బూజుని ఒదిలించుకు ని ఆలోచించగలగాలి. మౌనానికున్న విలువను గ్రహించాలి. ఈ మొత్తమంతటిలో దీనివల్ల నాకేం వస్తుంది, నా ఆర్గనైజేషన్‌కేం ఒస్తుందనే ఆలోచన మర్చిపోవాలి.

మన ప్రవర్తన గురించి, దృక్పథం గురించి ఆలోచించకుండా సంతాప వ్యాసాలు రాసి, సంతాప సభ లు పెట్టి ప్రయోజనం లేదు. చనిపోయిన వ్యక్తికి పురుత్థానం అవసరం లేదు. ప్రజల 'గొంతుల'కు 'ప్రాతినిధ్యానికి' పునరుత్థానం కావాలి. కన్నబిరాన్ పేద ప్రజల గొంతు. బిగ్గరగా, ధైర్యంగా, స్పష్టంగా లేచిన గొంతు. ఆయన తనను తాను ఎన్నడూ ప్రదర్శించుకోలేదు. ఆ అవసరం ఆయనకు లేదు. కన్నబిరాన్ లా ఉండటం తేలికకాదు. దానికో జీవితకాలం కావాలి. ఆయన్ని పొగుడుతూ అరవడం తేలిక. ఆ అరుపు ఒక క్షణంలో అణిగిపోతుంది.
-వసంత కన్నబిరాన్

బడుగుల బాంధవుడు

-జి.హరగోపాల్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/oct/12/edit/12edit3&more=2010/oct/12/edit/editpagemain1&date=10/12/2010

యస్.ఆర్.శంకరన్ గారు గుర్తేడు కిడ్నాప్ తరువాత వీణా శతృఘ్న ఇంట్లో కలవాలని కబురు పంపారు. అక్కడ కిడ్నాప్ గురించి చాలా వివరంగా-చిన్న చిన్న సంఘటనలతో సహా- చెప్పారు. అప్పుడు ఒకవేళ తనకు ఏమైనా జరిగి ఉంటే బాలగోపాల్ తన మీద నివాళి వ్యాసం వ్రాసేవాడా అని నన్నడిగారు. ఆ ప్రశ్నకు అప్పటికి నా దగ్గర సమాధానం లేదు. బాలగోపాల్ మీదై నా, శంకరన్ మీదైనా నివాళి వ్యాసాలు వ్రాయవలసిన అవసరం ఏర్పడడం వ్యక్తిగతంగా ఒక విషాదమే!

అయితే అరుదైన వ్యక్తుల గురించి, అమానవీయంగా మారుతున్న సమాజంలో ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయ సంస్కృతి, విలువలు భ్రష్టుపడిపోతున్న సందర్భంలో మన మధ్యే ఏ సుఖాలు కోరకుండా అర్థవంతమైన జీవితాన్ని, ఒక రకంగా మానసికంగా ఒక పరిపక్వ జీవితాన్ని గడిపిన వారి గురించి మాట్లాడుకోకుండా ఉండటం ఎలా అది ఆ మరణించిన వ్యక్తుల అవసరం కాదు, మనని మనం మనుషులు గా నిలుపుకోవడానికి చాలా అవసరం. శంకరన్ గారి జీవిత విశేషా లు కొన్ని మీడియాలో ప్రచురించారు. కాని ఆయన సున్నితమైన మానవీయ మనస్తత్వాన్ని అరుదైన ఆచరణను గురించి మరింత విస్తృతంగా, లోతుగా చర్చ జరపడం ఇప్పటి దిగజారుతున్న సమాజ అవసరం.

శంకరన్ గారితో పరిచయమేర్పడిన తర్వాత, ఆయన సర్వీసు లో ఉన్నప్పుడు తరచుగా కలవ లేదు. అలా కలిస్తే చాలా గొప్ప అనుభవంగా ఉండేది. శంకరన్ పదవీ విరమణ తర్వాత పౌర స్పందన వేదికలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆ విధంగా గంటల తరబడి, రోజుల తరబడి ఆయనతో పనిచేసే క్రమంలో ఆయన సున్నితమైన మనస్సు, అతి సున్నితమైన ఆచరణను గమనించే అవకాశం నాకు వచ్చింది. అది ఒక మరవరాని మానవీయ అనుభవం.

తత్వవేత్త రూసో మనిషి సంఘజీవి కావడంతో తన సహజ ప్రవృత్తిని కోల్పోయాడని, అతని సహజ ప్రవృత్తి మీద మానరాని గాయం ఏర్పడిందని ఒక వ్యాఖ్యానం చేశాడు. అందువలనే మని షి సహజ ప్రవృత్తికి, అతని సామాజిక బాహ్య వర్తనకి ఇక పూడ్చలేని అంతరం ఏర్పడి మనుషుల ప్రవర్తనంటే అసహజంగా మారిపోయిందని అంటాడు. ఇది చాలవరకు వాస్తవమైనా, ఎందుకో శంకరన్ లాంటి వాళ్లు ఈ వైరుధ్యంలో చిక్కుకోలేదేమో మనిషి తన సహజత్వాన్ని కాపాడుకొనడానికి అవకాశాలున్నాయని మళ్లీ మానవాళి తన సహజమైన రీతిలో జీవించే ఒక భవిష్యత్ సమా జం సుసాధ్యమే అన్న ఒక విశ్వాసాన్ని కలిగించారని అనిపిస్తుంది.

ఆయనతో ఎన్నో గంటలు గడిపినా ఎన్ని చర్చలు చేసినా ఆయన మాట్లాడేప్పుడు కాని, ఒక పనిచేసేప్పుడు కాని జాగ్రత్తలు తీసుకున్నట్లు కాని, ఆలోచనలను సెన్సార్ చేసుకుంటున్నట్లు కాని ఎక్కడ అనిపించేది కాదు. ప్రతి అంశానికి చాలా సహజంగా స్పందించేవాడు, ప్రతిస్పందనలో మానవీయ పరిమళ ముండేది. మనిషి మంచితనమ్మీది ప్రగాఢ విశ్వాసముండేది. ఎక్క డ ఏ మంచి జరిగినా తనకే ఆ మంచి జరిగిందని ఆనందపడేవాడు. ఎక్కడైనా ఏ చెడు జరిగినా చాలా సహజంగా బాధ పడేవాడు. ఆ బాధను మాటల్లో ఎక్కువ చెప్పేవాడుకాదు కాని ఆయన ముఖకవళికలో కనిపించేది. ఆ విషయాన్ని కొనసాగిస్తే, ఒక తాత్విక ధోరణిలో స్పందించేవాడు.

ఆయన ప్రవర్తనలో అట్టడుగు వర్గాల పట్ల ఉండే 'కన్సర్న్' చాలా చాలా బలం గా, అదొక వ్యక్తిగత బాధగా తోచేది. నిరంతరం ఆ వర్గాల సమస్యల గురించి, వాటి కి పరిష్కారాల గురించి భిన్న కోణాల నుంచి ఆలోచించే వారు. ఈ మనస్తత్వం నేను చాలా సందర్భాల్లో గమనించాను కాని రెండో మూడు సంఘటనలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి.

మాటల సందర్భంలో ఒకసారి తాను ప్రభుత్వాధికారిగా గ్రామాలకు వెళ్ళి పేద కుటుంబాలను, పూటకు గడవని నిస్సహాయమైన కుటుంబాలను కలిసినప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారని తన స్వంత డబ్బులు ఇస్తూ ఈ డబ్బులు ఏదో ఒక 'పేదల సంస్థ' తన దగ్గర పెట్టిందని, పేదల కుటుంబాలకు ఇవ్వవలసిందిగా తనకు ఆ బాధ్యత ఇచ్చారని చెప్పే వారట. అంతేకాక డబ్బులు ఇచ్చినట్టు ఒక తెల్లకాగితం మీద వేలి ముద్ర వేయించుకు నే వాడట.

అలా ఎందుకు చేశాడంటే ఆ కుటుంబానికి చేసిన చిన్న సహాయం తాను చేశానని తెలిస్తే జీవితమంతా శంకరన్‌గారు మాకు సహాయం చేశారు అనే కృతజ్ఞతా భావం మిగులుతుందని, జీవితంలో బరువుని మోస్తున్న ఆ పేద వాళ్ళకు ఆ జ్ఞాపకం మరొక అదనపు భారమేనని అనుకున్నాడట! ఈ అవగాహన వలన త్రిపురలో ప్రధాన కార్యదర్శిఇగా పనిచేసే కాలంలో ప్రతి సబ్ కలెక్టర్ దగ్గర కొంత ఫండ్ పెట్టేలా , ఎవరైనా తమకు ఆ రోజు తిండి దొరకలేదనో, ఆకలితో ఉన్నామనో వస్తే ఏ నిబంధనల ప్రమేయం లేకుండా సబ్ కలెక్టర్ వారికి ధన సహాయం చేసేలా ఒక పద్ధతి పెట్టాడు.

ఇది నేను త్రిపురలో మానవహక్కల పరిశీలనకు వెళ్ళినప్పుడు మా విద్యార్థి నాగరాజ్ తన ఇంటి ముందు నిలబడిన ఒక మనిషికి డబ్బులిస్తూ ఈ వెసులుబాటు శంకరన్ గారి హయాంలో కల్పించబడిందని చెప్పాడు. ఎదుటి మనిషి ఆకలిని ఇంత సున్నితంగా, లోతుగా ఆలోచించడం ఆయనకున్న మానవీయతా ముద్ర దృక్కోణానికి ఒక బలమైన ఉదాహరణ.

ఒకసారి ఇద్దరం కలిసి హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకటి రెండు స్థలాలను చూయించి ఇక్కడ భోజనం 8 లేదా 10 రూపాయలకే దొరుకుతుంది అని అన్నాడు. ఈ చవక భోజన ఇళ్ళ గురించి ఈయన ఎందుకింత సమాచారం సేకరించాడు అని ఆలోచిస్తే అది మాలో చాలా తక్కువ ఆదాయాలు ఉండే వాళ్ళకు పట్టణంలో తిండి ఎక్కడెక్కడ దొరుకుతుందని పనికట్టుకుని సమాచారం సేకరించారని పించింది.

మేం శాంతి చర్చల సందర్భంలో శ్రీశైలంలో కొంత ఆగవలసి వచ్చింది. ఎలా గు అక్కడ ఉన్నాం కదా అని గుడిలోకి వెళ్ళాం. గుళ్ళో మాకొరకు ప్రత్యేక పూజ చేశారు. బయటికి వచ్చిన తర్వాత మేం కొంత హాస్యంగానే మీకు కుటుంబం లేదు పిల్లలు లేరు మీరు దేవుణ్ణి ఏం కోరుకున్నారు అని అడిగితే 'నాకేముంటుంది మా దళితులకు మరిన్ని అవకాశాలు రావాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని కోరుకొనడం తప్ప' అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆడవికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా, పట్టణంలో తిరుగుతున్నా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నా ఆయన ధ్యాసంతా పేద వాళ్ళ మీదే. ఈ విషయాల మీద ప్రభుత్వాధికారులు సరిగా స్పందించడం లేదని వాపోయేవారు.

ఒక సందర్భంలో పంజగుట్ట ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ చాలా సేపు పోయింది. మా ఇంట్లో చాలా దోమల గొడవ ప్రారంభమయింది. తోచక శంకరన్ గారికి ఫోన్ చేశాను. సార్ దోమలు చాలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారని అడిగితే నన్ను దోమలు కుట్టవు మీకు తెలుసా అన్నారు. నేను అది ఎలా సాధ్యం అంటే దోమలకు నేనంటే కొంచెం ఇష్టం లేదు. మూడున్నర దశాబ్దాల పాటు ఐఎ ఎస్‌లో పనిచేసిన మనిషిని కుట్టినా ఏం కాదు, వాళ్ళకు ఏం స్పంద న ఉండదని దోమలకు కూడా తెలిసిపోయిందని సున్నితంగా, కొంచెం సెటైరికల్‌గా అన్నారు. శంకరన్‌గారు తనకు నచ్చని అంశాలను చాలా విట్టీగా చెప్పేవారు. మా మీద అలాంటి విట్టీ కామెం ట్స్ చేసి నవ్వించే వారు.

అందరు మనుషులు సంతోషంగా జీవించాలని మనసారా కోరుకున్న మనిషి తన చావుతో అందరిచేత కళ్ళ నీళ్ళు పెట్టించాడు. ఒకరి మనసును బాధ పెట్టకూడదని సహజంగా నమ్మి, ఆచరించి న మనిషి శంకరన్. ఆయనను తన జ్ఞాపకాలు అనుభవాలు వ్రాయవలసిందిగా చాలా సందర్భాల్లో చాలా మంది మిత్రులు కోరారు, అక్టోబర్ 6న సాయంత్రం ఏడు గంటలకు ఆయనను కలుసుకున్నాను. ఒక గంటకంటే ఎక్కువ కూచుని చాలా విషయాల మీద మాట్లాడుకున్నాం.

ఆ రోజు ఒక తెల్లటి చొక్కా (ఆయన మనసులాంటిదే) వేసుకుని నా ముందు కూచున్నారు. ఆ సందర్భంలో అరుణారాయ్ మీద, వరంగల్ జాయింట్ కలెక్టర్ కరుణ గారి మీద అవసరాన్ని బట్టి మాట్లాడవలసి వచ్చింది. ఆయనకు చాలా ప్రీతిపాత్రమైన వారు చాలా మంది ఉన్నారు కాని ఆ రోజు వాళ్ళెంత మంచి వాళ్ళో అని ఆ ఇరువురి గురించి చెప్పాడు. వరంగల్‌కు వచ్చి, బాలగోపాల్ మీద పర్స్‌స్పెక్టివ్స్ ప్రచురించిన 'రాజ్యం-సంక్షేమం-బాలగోపాల్ ప్రసంగాలు' ని ఆవిష్కరించాలని ఆయనను కోరాను.

బాలగోపాల్ వ్రాసిన రచనలు 11, 12 సంపుటాల దాకా ఉన్నాయ్ అని అంటే 'అమ్మ అంత వ్రాశాడా!' అన్నారు. దానికి జవాబుగా మీకు కూడా చాలా సంపన్నమైన అనుభవం ఉంది, మీరు సమాజంతో పంచుకోవలసిన అనుభవాలూ ఉన్నాయి, మీరు చెప్పే అభిప్రాయాలని, అనుభవాలని సమాజం గౌరవ పూర్వకంగా చదువుతుంది అని అంటే నవ్వి ఊరుకున్నారు. చివరి కి మనకు జ్ఞాపకాలను మాత్రమే వదిలి వెళ్ళారు. ఆయనతో అనుభవాలు, ఆయన జీవితం సమాజం మీద వీచిన ఒక పరిమళమైన తూర్పుదిక్కు గాలిలా అనిపిస్తుంది.
-జి.హరగోపాల్

పోరు జన న్యాయవాది!!

హైదరాబాద్, డిసెంబర్ 30 (ఆన్‌లైన్ సిటీబ్యూరో) మానవ హక్కుల కోసం ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది'' అని ఆమ్నెస్టీ నుంచి ప్రశంసలు పొందిన కన్నబిరాన్.. నిజంగా హక్కులకు పెద్ద దిక్కు. నాలుగు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో పోరాడే ప్రజల పక్షాన ఆయన నిలిచారు. కన్నబిరాన్ పూర్వీకులు తమిళులు. ఎన్నో శాతాబ్దాల క్రితమే నెల్లూరు చేరి.. అక్కడే స్థిరపడిన కుటుంబం. కన్నబిరాన్ విద్యాభ్యాసం నెల్లూరులో, అనంతరం మద్రాస్‌లో సాగింది. స్వాతంత్రోద్యమం ముగింపు సమయం అది. వామపక్ష భావజాలం బాగా పని చేసింది. అదే తనను ఎక్కువగా చదవడానికి, ఆలోచించడానికి దోహదం చేసిందని ఆత్మకథ(24 గంటలు)లో పేర్కొన్నారు.

1953లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న కన్నబిరాన్.. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1951లో వసంతతో ఆయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత 1960లో ఆయన హైదరాబాద్ వచ్చేశారు. న్యాయవాదిగా ఆయన పని చేసిన కాలంలో సామాజికంగా వివిధ వ్యవస్థలు విఫలమైన తీరును బాగా దగ్గరగా గమనించారు. అదే అనంతరం కాలంలో ఆయనను హక్కుల ఉద్యమం వైపు నడిపించింది. 1994లో పీయూసీఎల్ ఏర్పాటు ద్వారా హక్కుల ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నెలకొల్పిన కన్నబిరాన్.. అంతకు ముందు పదిహేనేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటీ (ఏపీసీఎల్‌సీ)కి అధ్యక్షుడిగా పని చేశారు. నక్సలైట్లతో ప్రభుత్వ చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై ఏర్పాటైన తార్కుండే కమిటీలోనూ, భార్గవ కమిషన్‌లోనూ ఆయన పని చేశారు.

సీఎం సంతాపం

కన్నబిరాన్ మృతికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం వెలిబుచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధినేత కేసీఆర్, సిద్ధాంతకర్త జయశంకర్, పీఆర్పీ అధినేత చిరంజీవి, సీపీఐ నేత గుండా మల్లేష్, ఎమ్మెల్సీదిలీప్‌కుమార్, టీఎన్జీవో నేత విఠల్, విద్యావంతుల వేదిక నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్, రచయిత నిఖిలేశ్వర్, ఐఏఎల్ నేతలు పద్మనాభరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు వెంకట్, వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ నేత వేణుగోపాల్, సిపిఐ రాష్ట్ర కమిటీ నేతలు వై. వెంకటేశ్వరరావు, ఎస్. వీరయ్య, ఓపీడీఆర్ నేత భాస్కరరావు, పీయూసీఎల్ నేతలు ప్రభాకర్ సిన్హా, చంద్రశేఖర్, కేశవరావు జాదవ్, ఇక్బాల్‌ఖాన్, జయ వింధ్యాల మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్మన్ కాకుమాను పెదపేరిరెడ్డి వేర్వేరు ప్రకటల్లో సంతాపం తెలిపారు.

బలమైన గొంతుక ఏదీ

ఎస్. జీవన్‌కుమార్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/dec/30/edit/30edit5&more=2011/dec/30/edit/editpagemain1&date=12/30/2011

బాలగోపాల్, కన్నబిరాన్ ఆకస్మాత్తుగా మాయమైనప్పటి నుంచి సమాజం ఒక బలమైన గొంతు కోసం వెతుకుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశం విషయంలో ప్రజల ఆకాంక్షలపై రాజకీయ కపటత్వం నీళ్ళు చల్లుతున్నప్పుడు, ప్రజాస్వామిక ఉద్యమాన్ని పోలీసులతో అణచివేస్తుంటే, ఇదంతా అన్యాయమని నిలదీసే బలమైన గొంతుక కోసం ప్రజలు తాపత్రయపడ్డారు. రాజకీయ పార్టీల రెండు నాల్కల ధోరణి, రాజకీయ భ్రష్టత, విలువల రాహిత్యాన్ని, ప్రజలు ఇంత స్పష్టంగా ఎప్పుడూ వీక్షించి ఉండరు. ఇంత బహిరంగంగా భూముల్ని, వనరుల్ని దోచుకోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు.

ఇదివరకు ఫలానా భూమి, వనరు ఫలానా మంత్రి లేక నాయకుడు అక్రమంగా వశపరుచుకున్నారట అని గుసగుసలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు అన్నీ బహిరంగం అయినప్పటికీ, నిస్సిగ్గుగా రకరకాల విధాల పాదయాత్రలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడతూ ఉపన్యాసాలు దంచడం ఎప్పుడూ చూడలేదు. రైతులు 'అన్నం అరగక' 'మానసిక సమస్యలతో' ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక మంత్రి అంటే ఇవన్నీ 'నష్ట పరిహారం' కోసమే అన్న వాళ్ళ నాయకుడి వైనాన్ని చూసాం.

వీళ్ళే ఇప్పుడు తలకు కండువాలు కట్టుకుని మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఇది ప్రభుత్వామా ఇది పాలనేనా అని గొంతెత్తి అరుస్తున్నారు. ప్రజలు ఈ తమాషా నాటకాన్ని వింతగా వీక్షిస్తన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు రకరకాల మాఫియాలతో సంబంధాలు ఉన్నాయని పత్రికలు కథనాలు రాసేవి. ఇప్పుడు ఆ మాఫియాలే నిర్భయంగా ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి ఇదివరకు నడిపించాయి. రాజకీయ అనిశ్చిత పరిస్థితి, సంక్షోభం ఆసరాగా అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రి సొల్లు మాటలు వత్తి పలుకుతూ, 'గ్యాస్' కొడుతూ పాలన సాగించటం ప్రజలు చూస్తున్నారు. ఎవరిపనులు వాళ్ళు నిర్భయంగా చేసుకుంటూ పోతున్నారు.

ఎన్‌కౌంటర్‌లు, లాక ప్ హత్యలు, చిత్రహింసలు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితులు ఎట్లా ఉన్నా పోలీసు వ్యవస్థ ఎప్పటిలాగానే తమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. అంతా ప్రజల అభివృద్ధి కోసమే అని చెపుతూ మన 'జి. డి.పి. పెరగాలి కదా', 'మనం అభివృద్ధి కావాలి' కదా, అంటూ ప్రధా న మంత్రి దగ్గరి నుంచి స్థానిక నాయకుని వరకు ప్రజల జీవితాలు ఎట్లా విధ్వంసం చేయాలో, జీవించే హక్కును ఎట్లా భగ్నపర్చాలో పథకాలు వేస్తూ ముందుకు పోతూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ అప్పుడప్పుడు ఉలిక్కిపడుతూ ఎక్కువ కాలం నిదురపోతూనే ఉంది.

ఇలా ఉన్న ఈ వ్యవస్థ చాలా క్రూరమైంది అని కన్నబిరాన్ ఎప్పుడో అన్నారు. ఈ వ్యవస్థకు చట్టబద్ధ పాలనతో సంబంధం లేనేలేదని మరీ నొక్కి చెప్పారు. చాలాకాలంగా హక్కుల సంఘాలు పోలీసు వ్యవస్థలో ఉన్న అధికార దుర్వినియోగం, 'శిక్షలేని - శిక్ష భయం' లేని అధికార నేర ఉన్మాదంపై ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి నేరాల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి, సమర్ధిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ హత్యలన్నీ ప్రభుత్వ ఆదేశాలతోనే జరుగుతున్నాయి. చర్చల పేరుతో పిలిచి తదుపరి చల్లగా హత్యలు చేసారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని చంపారు ఇంకా చంపుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్‌కౌంటర్‌లు ఆపమంటే అప్పుడు ఆగిన సందర్భాలని గమనించాము.

అయితే ఈ శిక్షారహిత నేర సంస్కృతి పోలీసు వ్యవస్థ నుంచి పాలనా వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు విస్తరించింది. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు భయం లేకుండా నేరాలు చేస్తూనే ఉన్నారు. పోలీసు శాఖ నేరాల్ని మాత్రమే ప్రధానంగా ఎత్తిచూపే హక్కుల సంఘాల బాధ్యత ఇంకా పెరిగిపోయింది. ప్రజలు ఎవరి కోసమో, దేనికోసమో వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక బలమైన గొంతుక, తమ ఆరాటాల్ని, ఆకాంక్షల్ని ప్రతిధ్వనించే గొంతుక ఎక్కడైన వినిపిస్తుందా అని చూస్తున్నారు.

ప్రజాస్వామిక వాదులు, విలువల కోసం ఆరాటపడే వ్యక్తులు, ప్రజలను ప్రేమించే పౌరులంతా ఏకమైతే తప్ప ఆ గొంతుక ప్రజలకు వినపడదు, పాలకులను భయపెట్టదు. అటువంటి ఒక బలమైన, నిర్భయమైన, స్వచ్ఛమైన గొంతుక కోసం మనం అంతా ఐక్యం కావడమే కన్నబిరాన్‌కు మనం ఇచ్చే నివాళి.

- ఎస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల కార్యకర్త
(కన్నబిరాన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా)

బాలగోపాల్ ఉంటే...

-జి.హరగోపాల్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/oct/8/edit/8edit2&more=2010/oct/8/edit/editpagemain1&date=10/8/2010

బాలగోపాల్ లేకుండా ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో చాలా సందర్భాల్లో బాలగోపాల్ లేని లోటు చాలా కొట్టవచ్చినట్టుగా కనిపించింది. ఆయన ఈ మొత్తం సంవత్సరంలో ఎన్ని పనులు చేసేవాడో, ఎన్ని రచనలు చేసేవాడో, ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ క్రమంలో కొత్త ఆలోచనలను భావాలను ప్రతిపాదించే వాడో ఊహిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఆలోచన 57 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని లోతులు తరచిం దో, ఎన్ని ఎత్తులు చూసిందో గమనిస్తే మరింత ఆశ్చర్యం వేస్తుం ది.

ఇంత అరుదైన మేధస్సు గల మనిషి అణగారిన ప్రజల పట్ల నిబద్ధత గలిగుండటం వల్ల ఆయన లేని లోటును పూరించడం సమాజానికి ఒక కష్టమైన సవాలే. అన్నింటికి మించి ఒక మనిషి తాను సమాజానికి ఇచ్చే దానికంటే సమాజం నుంచి ఎక్కువ తీసుకున్నప్పుడు జీవితానికి అర్థంకాని, ప్రయోజనం కాని ఉండదని బలంగా బాలగోపాల్ విశ్వసించేవాడు. అందుకే అహోరాత్రులు విరామం లేకుండా తాను నమ్మిన పనిని తాను చేస్తూ పోయాడు.

బాలగోపాల్ లేని లోటును నేను తీవ్రంగా ఫీల్ అయిన చాలా సందర్భాలున్నాయి. మావోయిస్టు పార్టీకి, సిపిఐ(ఎంఎల్) పార్టీకి ఒరిస్సాలో చాలా విభేదాలు వచ్చాయి. దాని పర్యవసానంగా వాళ్ల ఒక ప్రధాన నాయకుడు అర్జున్‌ను కోల్పోయారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నన్ను ఈ ఘర్షణలో జోక్యం చేసుకోమని అడిగినప్పుడు, బాలగోపాల్ ఉంటే ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎంతో సుళువుగా ఉండేది అనిపించింది.

దీనికి కారణం మన రాష్ట్రంలో జనశక్తి పార్టీకి అప్పటి పీపుల్స్‌వార్ పార్టీకి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చినప్పుడు ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణను ఎలాగైనా నివారించడానికి ప్రయత్నం చేయాలని పౌరహక్కుల సంఘంలో కొందరు బాధ్యులు సంఘం మీద ఒత్తిడి పెట్టారు. అప్పుడు ఇరువైపుల నాయకులతో మాట్లాడినప్పుడు బాలగోపాల్ తీసుకున్న చొరవ వల్ల ఇరువైపుల మధ్య పరస్పర అవగాహన పెరిగి రెండువైపుల నుంచి చంపుకోవడాన్ని నివారించడం లో బాలగోపాల్ చాలా కీలకమైన బాధ్యతను నిర్వహించాడు.

ఆ అనుభవం వల్లే మళ్లీ మరోసారి రెండు విప్లవ పార్టీల మధ్య వచ్చి న విభేదాలలో జోక్యం చేసుకోమని కోరినప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఆయనుంటే ఒరిస్సా వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలను సేకరించి అవసరమైతే ఇద్దరినీ విమర్శించి, వాళ్ల వాళ్ల తప్పులను పరిమితులను పేర్కొని ఘర్షణ ను నివారించే ప్రయత్నం తప్పకుండా చేసేవాడు.

అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, మన రాష్ట్రంలో జరిగినట్టు గా శాంతి చర్చలు జరగాలని, ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున గిరిజనుల మీద దాడి చేసే ప్రమాదముందని దాన్ని ఎట్లయినా నివారించి ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత పౌరహక్కుల, మానవహక్కుల సంఘాల మీద ఉన్నద ని గట్టిగా విశ్వసించాడు.

ఢిల్లీ స్థాయిలో ప్రజాసంఘాలు చొరవ తీసుకుని ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలని నాతో అంటూ, ఈ ప్రయత్నంలో భాగం పంచుకొనడానికి నన్ను వెళ్లమని అడిగినప్పుడు, నాకు ఇతర ఇబ్బందులు పరిమితుల వల్ల వెళ్లడం సాధ్యం కాదేమోనని అన్నప్పుడు, తానే స్వయంగా వెళ్ళాడు. ఈ 'సిటిజన్స్ ఫర్ పీస్ ఇనీషియేటివ్' చురుకుగా పనిచేయాలని ఆశించాడు. ఆలస్యం చేస్తే చాలా విధ్వంసం జరుగుతుందని ఆందోళనపడ్డాడు. ఈ కమిటి రెండవసారి కలిసే వరకే బాలగోపాల్ లేకపోవడం ఢిల్లీలో చాలా మంది ఫీల్ అయ్యారు.

ఆ మాట చాలా మంది సభలో ప్రస్తావించారు కూడా! ఈ చొరవ తర్వాత కాలంలో ముందుకు సాగలేదు. బాలగోపాల్ ఉంటే అంత త్వరగా ఈ శాంతి చర్చల ప్రతిపాదన దెబ్బతినేది కాదు. అయితే ఈ ఘర్షణలో సామాన్యమైన గిరిజనుల జీవితానికి ముప్పు వాటిల్లుతోందని ఎవరు జోక్యం చేసుకున్నా ఛత్తీస్‌గఢ్ గిరిజనుల పక్షాన మాట్లాడాలని ఆయన భావించాడు.

బాలగోపాల్ ఈ సంవత్సర కాలంలో తప్పనిసరిగా చేసేపని లేదా వ్రాసే రచన కాశ్మీర్ మీద కాశ్మీర్ ప్రజల పట్ల నిబద్ధత కలిగి చేసేవాడు. ఎందుకో బాలగోపాల్‌కి కాశ్మీరు స్వయం నియంత్రాణాధికారం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేది. కాశ్మీర్‌కు ఎన్ని సార్లైనా వెళ్ళడానికైనా సంసిద్ధత ఉండేది. కాశ్మీర్ సమస్య మీద వందల మీటింగ్‌లలో మాట్లాడాడు.

నరేంద్రనాథ్ ఆరోగ్యం బాగాలేదని కాశ్మీర్ పర్యటనను వాయిదా వేసుకున్నాడు. ఆయన కాశ్మీర్ వెళ్ళినప్పుడు కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ వైపు ప్రవహిస్తున్న నదిని చూసి ఈ నది దేశ సరిహద్దులు, మతాలతో ప్రమేయం లేకుండా ఎంతో శాంతి గా, నిష్పక్షపాతంగా ప్రవహిస్తున్నది అని వ్యాఖ్యానించాడట.

బాలగోపాల్ తెలంగాణ ఉద్యమానికి మొదటినుంచే మద్ద తు పలికాడు. పౌరహక్కుల సంఘం తెలంగాణకు మద్దతు ఇవ్వాలని అది ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష అని పౌరహక్కుల సంఘం గుర్తించడానికి ఆయన కృషి కూడా ఉంది. ఆంధ్ర ప్రాంతం పౌర హక్కుల కార్యకర్తలు ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. నేను ఈ మధ్యే కడప వేమన విశ్వవిద్యాలయంలో 'ఉన్నత విద్యలో సవాళ్ళు' అనే అంశం మీద మాట్లాడడానికి వెళ్ళాను. కడపలో కొందరు 'నేను తెలంగాణ మీద మాట్లాడితే మేం ఊరుకునేది లేదు' అని అన్నారట.

బాలగోపాల్ ఉంటే తెలంగాణకు ఎందుకు మద్దతు ఇవ్వాలో కడపలో మీటింగ్ పెట్టి మాట్లాడేవాడు, ఆ ప్రాంతంలో ప్రచారం చేసేవాడు. అలాగే కడపకు వై యస్ ఆర్ పేరు పెట్టడం సమంజసం కాదని పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. మీటింగ్ జరిగింది, కొందరం మాట్లాడాం, కాని అక్కడ ఉన్న అందరి మనస్సులో బాలగోపాల్ ఉంటే ఇలా జిల్లాలకు వ్యక్తు ల పేర్లు పెట్టడం ఎందుకు తప్పో చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, చట్టబద్ధ కారణాలను మరింత లోతుగా పరిశీలించి, పరిశోధించి మాట్లాడేవాడు అనిపించింది.

అలాగే గత సంవత్సరంగా తెలంగాణలో ఉధృతమైన ఆత్మహత్యల గురించి విశ్లేషించేవాడు. ఆత్మహత్యల నివారణకు తన వంతు పాత్రను నిర్వహించే వాడు. నేను ఆత్మహత్యల గురించి మాట్లాడినప్పుడు లేదా వ్రాసినప్పుడు వీటిని బాలగోపాల్ ఏ కోణం నుంచి చూసేవాడు ఎలాంటి కార్యకారణ సంబంధాల ను చూపేవాడో అని చాలాసార్లు అనిపించింది. నిజానికి ఆయన లేని ఈ ఒక్క సంవత్సరం రాష్ట్రంలో రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత, రాజకీయాలు అనూహ్యమైన తీరులో మారాయి. ఆయన చనిపోయినప్పుడు అందరమూ కొన్ని జాగ్రత్తలు తీసుకునే మాట్లాడాం.

ఆ విష యం మానవహక్కుల వేదిక దశాబ్ది సభలో ప్రస్తావిస్తూ, ఎందుకు తెలుగు సమాజం ఇలా భయపడుతున్నది అనే ప్రశ్న అడుగుతూ మన సమాజంలో భయం, అవకాశవాదం రాజ్యమేలుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించాడు. వైయస్ఆర్ మరణం తర్వాత రాజకీయపార్టీల సంస్కృతి లో వచ్చిన అవకాశవాదాన్ని ప్రజాస్వామ్య వాతావరణంలో వచ్చిన భయానక ధోరణుల నుంచి సమాజాన్ని కాపాడాలని మాట్లాడేవాడు, వ్రాసేవాడు.

వీటన్నిటికిమించి ఆయన తన నోట్స్‌లో సోషలిజాన్ని గురిం చి సోషలిస్టు మౌలికసూత్రాల గురించి మరోసారి పునాదులలోకి వెళ్ళి పరిశీలించడం ప్రారంభించాడు. బహుశా ఆయన మార్క్సి జం మీద సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా కొన్ని కొత్త ప్రతిపాదనలు చేసేవాడు. నేను ఒక సందర్భంలో విప్లవోద్యమాలకు, మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అని అడిగితే నాకు తెలియదు అని చాలా క్లుప్తంగా జవాబిచ్చా డు. ఈ జవాబులో ఒక నిజాయితీ ఉంది.

ప్రత్యామ్నాయమేమి టి అనే ఒక అన్వేషణ ఆయనలో ఉంది. సమకాలీన అన్ని ఉద్యమాల పట్లా (మావోయిస్టు ఉద్యమంతో సహా) ఆయనకు గౌరవ భావన ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళు చేసే చర్యలు మరింత ఆలోచించి, జాగ్రత్తగా, ప్రాణనష్టం లేకుండా చేస్తే బావుండేది అనేవాడు. ఈ గౌరవ భావన వలన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, ఆచరణను మరింత సుసంపన్నం చేయడానికి ఆయన విశ్లేషణ, సూత్రీకరణ, చారిత్రక పరిశీలన, మానవ ప్రవృత్తి పట్ల ఆయన అవగాహన చాలవరకు దోహదపడేవి అని నేను అనుకుంటున్నాను.

పి.ఎస్ ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ఇక లేరు. మన సమా జం మరో మహోన్నత వ్యక్తిని కోల్పోవడం చరిత్ర విషాదం.

-జి.హరగోపాల్
(నేడు బాలగోపాల్ ప్రథమ వర్ధంతి)

శాంతి చర్చలు ఒక మైలురాయి

- జి. హరగోపాల్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/dec/30/edit/30edit2&more=2010/dec/30/edit/editpagemain1&date=12/30/2010
ఈ (21) శతాబ్దంలోని మొదటి దశాబ్ద సామాజిక అనుభవాన్ని అంచనా వేయడమంటే ఒక కోణంలో ఈ మొత్తం శతాబ్ద కాల అనుభవం ఎలా ఉండబోతున్నదనే అంచనా వేయడమే. ఈ దశాబ్దకాలంలో ప్రపంచం ఒక తీవ్ర ఆందోళనకు, ఉద్రిక్తతకు, అభద్రతకు గురైంది. ఆ ఉద్రిక్తతకు మానవాళి ఏమైనా సృజనాత్మ క, ప్రజాస్వామ్యబద్ధ పరిష్కారాలు కనుక్కొంటుందా లేక ప్రపం చం మరింత హింస, విధ్వంసంలో కూరుకుపోతుందా అన్న ఆం దోళన కలుగుతుంది. ఈ ఘర్షణకు మూలాలు ఎక్కడున్నాయి అని కనుక్కుంటే తప్ప మౌలిక పరిష్కారాలు సాధ్యం కావు.

సోవియట్‌యూనియన్ పతనం తర్వాత పెట్టుబడిదారీ వ్యవ స్థ తనకింక అదుపు, ఆజ్ఞలు లేవని భావిస్తున్నది. తనేం చేసినా చెల్లుతుందన్న అహంకారం సర్వత్రా కనిపిస్తున్నది. ప్రపంచీకర ణ అనే ముద్దుపేరుతో ప్రపంచాన్ని కబళించాలని ప్రయత్నిస్తున్న ది. ఎక్కడ ప్రకృతి వనరులున్నా అది పెట్రోల్ కావచ్చు, గనులు, నదులు కావచ్చు, అడవి కావచ్చు, ఆ సంపద మీద దేశ సరిహద్దులు దాటి, దేశాల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తన ఆధిపత్యం కొరకు ఒక 'యుద్ధాన్నే' ప్రకటిస్తున్నది. ఆ యుద్ధానికి ఆయా దేశాధినేతలు, నాయకులు, మీడియా, ఆధిపత్య వర్గాలు వత్తాసు పలుకుతున్నాయి.

ఈ యుద్ధం లో పేదలు, శ్రామికులు, గిరిజనులు, మన దేశంలో దళితులు, రైతాంగం, స్త్రీలు, నిరుద్యో గ యువత అన్నిరకాల బలహీనులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకునే మనుషులు ఎలా తిరగబడతారు ఎలాంటి పద్ధతు లు ఎన్నుకుంటారు. ఎంత సమిష్టి గా, సమైక్యంగా ఉద్యమించగలుగుతారు ఈ మొత్తం అమానవీయమైన అభివృద్ధిని ఎంత చైతన్యంతో ప్రతిఘటిస్తారు అన్నదే ఈ శతాబ్ద చరిత్రను నిర్దేశిస్తుంది.

మన దేశ చరిత్రలో గత శతాబ్దం మొదటి అర్ధ భాగమంతా స్వాతంత్రోద్యమం సాగితే తరువాత అర్ధ భాగంలో ఆ స్వాతం త్య్ర ఫలితాలు కొందరే అనుభవిస్తూ వచ్చారు. ఫలితంగా అట్టడుగు ప్రజల జీవితాలు మౌలికంగా మారకపోవడంతో 1960 దశాబ్దాంతానికి భిన్నమైన ప్రజా ఉద్యమాలు ముందుకు వచ్చా యి. ఈ అన్ని ఉద్యమాలలో నక్సల్బరి విప్లవ ఉద్యమం గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లకు గురై ఒక చోట క్షీణిం చి, మరోచోట బలం పుంజుకుని శతాబ్దం చివరి దశలో 'దేశభద్రతకు ప్రధానమైన ప్రమాదం' అని దేశ ప్రధానమ్రంతి అనే దాకా విస్తరించింది.

ఎందుకు ఈ ఉద్యమమే దేశభద్రతకు ప్రధానమైన ముప్పు అంటున్నారు పార్లమెంటరీ పార్టీలు అన్నీ అంగీకరించి న ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్న బలమైన ఉద్యమాలలో ఈ ఉద్యమం అగ్రభాగాన ఉంది కాబట్టి. ఈ దశాబ్దమంతా సీరియస్ రాజకీయ చర్చ దీని చుట్టే జరిగింది, జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో (రాష్ట్రం వచ్చే దశాబ్దం లో ఈ రూపంలో ఉండకపోవచ్చు) జరిగిన పరిణామాలు, ప్రయోగాలు నా దృష్టిలో చాలా చారిత్రకమైన ఘట్టాలు.

గత శతాబ్దం చివరి దశలో రైతాంగ ఉద్యమాలు ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమం హింసా వలయంలో ప్రాణనష్టం పెరిగిపోవ డం ఒక ఆందోళనకరమైన విషయమే! నిజానికి ఈ ఉద్యమం ప్రారంభమైన ఉత్తర ఆంధ్రలో కాని తర్వాత విస్తరించిన ఉత్తర తెలంగాణలో కానీ అది ఒక ప్రగాఢమైన ప్రభావాన్ని వేసింది. అన్ని రంగాల మీద పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఈ ఉద్యమ ప్రభావం ఉంది. ఈ ఉద్యమ అంతిమ లక్ష్యం (నా అవగాహన లో) ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడం లేదా ఒక నూతన మానవుణ్ణి సృష్టించడం.

సోవియట్ యూనియన్ ప్రయోగ వైఫ ల్యం, చైనాలో అభివృద్ధి వికృతీకరింపబడడంతో, మార్పు ఆలస్యమైనా ఉద్యమ దశలో జరగాలే కాని తర్వాత దశలో జరుగుతుందనుకోవడానికి చారిత్రక ఆధారాలు లేకుండాపోతున్నాయి. ఈ అవగాహన ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో మన రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చల్లో అంతర్లీనంగా ఉంది అని భావి స్తే తప్ప శాంతి చర్చల ప్రాముఖ్యత పూర్తిగా అర్థం కాదు.

పౌరస్పందన వేదిక శాంతి చర్చల కృషి తన కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఈ ప్రయోగం మధ్యలో వచ్చిన ఆలోచన. ప్రయోగం ప్రారంభం కావడానికి నేపథ్యం- పెరుగుతున్న రాజ్యహింస, దానికి ప్రతిగా విప్లవ ఉద్యమాల స్పందన లేదా ప్రతిహింస. ఉద్యమం అంటే కేవలం ఆయుధాలు, హింస అనే ప్రచా రం విస్తృతంగా జరిగింది, దానికి ఉద్యమాలు చేసిన పొరపాటు, తప్పిదాలు కూడా దోహదపడ్డాయి.

ఈ పొరపాట్లను ఉద్యమాలు అంగీకరిస్తూ వస్తున్నాయి కూడా! ఈ ఘర్షణలో పౌర సమాజాని ది కేవలం ప్రేక్షక పాత్రనా లేక సమాజం కూడా దీన్ని పట్టించుకోవాలా అన్న ప్రశ్న ఈ ప్రయత్నం వెనక లేదా ప్రయత్నంలో భాగంగా ఉంది. సమాజంలో ఉండే ప్రజాస్వామ్య శక్తులు నిశ్శబ్దంగా ఉంటే అది సమాజానికి చాలా హాని చేస్తుంది అన్నది ఇందులో ప్రధానం... అందుకే ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు సమాజం కూడా దాన్ని పట్టించుకుని చొరవ తీసుకోవా లి అన్న ఒక బలమైన ప్రజాస్వామిక సూత్రం ఈ ప్రయత్నంలో ఉంది.

ఆరకంగా శాంతి చర్చల ప్రక్రియ ఈ దశాబ్దంలో జరిగిన ఘటనలలో చాలా విలువైంది. శాంతి చర్చలు ఏం సా««ధించాయి అనే ప్రశ్న ముందుకు రావ చ్చు. శాంతిచర్చల వల్ల ఉద్యమాలకు విఘాతం కలిగింది అనే వాదన ఉండవచ్చు. రాజ్యమే ఈ ప్రయోగం నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందింది అని అనవచ్చు, ప్రజాస్వామ్యవాదుల ప్రయత్నాన్ని, వాళ్ళ ఆకాంక్షలని తప్పుపట్టవచ్చు. ఇవన్నీ ప్రయో గ వైఫల్యం తర్వాత వచ్చిన వాదనలు.

అయితే సుదీర్ఘ సామాజిక చరిత్రలో లేదా భౌతిక శాస్త్రాల పరిణామంలో ప్రయోగం చేసేప్పుడు కచ్చితంగా ఫలితాల గురించి చెప్పలేరు. ఒక చరిత్రకారుడు అన్నట్లు విప్లవాలు వస్తాయని కచ్చితమైన నిర్ధారణ చేయగలిగితే, అవి ఏ దశాబ్దంలో లేదా సంవత్సరంలో వస్తాయి అని చెప్పగలిగితే విప్లవాలను తప్పకుండా నివారించేవారే అంటాడు. మౌలిక మార్పులు ఎప్పుడు, ఎలాంటి దశలో వస్తాయో అది అనుభవంలో వస్తుంది కాని కచ్చితంగా చెప్పిరాదు.

కనుక ఈ మొత్తం ప్రక్రియలో భిన్న ప్రయోగాలు జరుగుతుంటాయి, సమాంతరంగా చాలా ఉద్యమాలు వస్తుంటాయి. మన రాష్ట్రం లో దళిత ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు, కులవివక్ష వ్యతిరేక ఉద్యమాలు, కులనిర్మూలన ఉద్యమాలు- ఇలా భిన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏ ఉద్యమస్థానం దానిది. ప్రతి ఉద్యమానికి పరిమితులున్నాయి,

ఈ పరిమితులు చారిత్రక పరిమితులే కావచ్చు, ఉద్యమాల్లో పనిచేస్తున్న వ్యక్తుల పరిమితులే కావచ్చు, భిన్నమైన బలహీనతలే కావచ్చు- వీటన్నింటితోనే ఉద్యమాలు నడుస్తుంటాయి. ఈ ఉద్యమాలన్నీ భవిష్యత్తులో సమిష్టి ఉద్యమాలుగా మారుతాయా తెలియదు. అన్ని ఉద్యమాలలో కొన్ని ప్రజాస్వామ్య, మానవీయ ఆకాంక్షలుంటాయి. ఆ ఆకాంక్షలను గుర్తించడం చాలా అవసరం. ఈ అన్ని ప్రయోగాల లాగే పౌరస్పందన వేదికది కూడా ఒక ప్రయోగమే.

ఈ ప్రయోగంలో సమాజ మార్పు తక్కువ హింసతో జరగా లి (ఎకానమైజింగ్ వయొలెన్స్) అన్నది ఒక ఆకాంక్ష. దీంట్లో రాజ్యం చేస్తున్న హింస చాలా ప్రమాదకరం. ఆ హింస మీద సమాజ నియంత్రణ లేకపోతే అది ఏ స్థాయికైనా వెళ్లవచ్చు. అలాంటి దృష్టాంతాలు చరిత్ర నిండా ఉన్నాయి. రాజ్యం ఉద్భవించడానికి ప్రధాన కారణం సమాజంలో ఉండే వ్యవస్థాపర హింసను తగ్గించడానికి అని ఉదారవాద సిద్ధాంతం (లిబరల్ థియరీ) వాదిస్తుంది.

కాని నిజానికి జరిగింది వ్యవస్థాపర హింస ను కాపాడడమే కాకుండా ప్రోత్సహిస్తూ ఆ మిష మీద తన హింసను పెంచుతూ పోయింది. అందుకే మానవ నాగరికతలో రాజ్యం ఒక పరిష్కారం కాకుండా, అదొక సమస్యై కూర్చుంది. ఈ రాజ్యహింస గురించి సమాజం చర్చించాలి, కార్యకారణ సంబంధాలను తెలుసుకోవాలి. రాజ్యం మీద సమాజం తన నియంత్రణను కోల్పోకూడదు. కాని రాజ్యం ఉద్యమాలలో జరిగే హింస బూచిని చూపించి తన హింసను పెంచుతూ పోతుంటుంది.

ఉద్యమాలలో ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉందని, సామాజిక మార్పు కొరకు అవి ఘర్షణ పడుతున్నాయన్నది సమాజం పూర్తి గా మరచిపోయేంత ప్రచారం చేస్తుంది. ఆ దిశలో ఉద్యమాలు ఏం కాంక్షిస్తున్నాయో సమాజం మరొకసారి గుర్తించడానికి, ఉద్యమాలు తమ ఆశయాలు, లక్ష్యాలు ఏమిటో సమాజానికి చెప్పడానికి శాంతి చర్చల ప్రయోగం ఒక ఆహ్వానించవలసిన మార్గం. ఇంకా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్నది శోధించవలసి ఉన్నది.

ఈ ప్రయోగం విఫలమైన మాట నిజమే. అయితే ఈ చర్చలు ప్రారంభించినప్పుడే ప్రతినిధులు అయినను పోయిరావలె హస్తినకు'' అని ముందే అన్నారు. కనుక వైఫల్యం అనూహ్యమయిందేమీ కాదు. చర్చల వల్ల మన రాష్ట్రంలో ఉద్యమం దెబ్బతిన్నదా అనే అంశం మీద అంచనా వేయడానికి ఇంకా చాలాకాలం పడుతుంది. కాని ఇది ఈ దశాబ్దంలోనే ఒక ప్రధానమైన ఘట్టం అనడానికి కారణం, శాంతి చర్చల ప్రస్తావన జాతీయ స్థాయిలో రావడం.

చత్తీస్‌గఢ్, జార్ఖండ్ లేదా ఒరిస్సా, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రు లు కూడా ఈ ప్రయోగం గురించి మాట్లాడడం. ఘర్షణ తీవ్రతరం అయినకొద్దీ శాంతి చర్చల ప్రస్తావన పెద్దయెత్తున జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుం దా లేదా, వాళ్ళకు చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ప్రశ్నకాదు, హింస పాత్ర ను తగ్గించడానికి ఇదొక ప్రత్యామ్నాయమని భిన్నమైన స్థాయిల లో గుర్తించడం ఒక కీలకమైన పరిణామం.

కేంద్ర ప్రభుత్వమే కాక మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఆజాద్ రాసిన చివరి లేఖలో కూడా చత్తీస్‌గఢ్ గిరిజనుల నిత్యజీవిత అనిశ్చితుల దృష్ట్యా వాళ్ల కు ఊపిరి పీల్చుకునే అవకాశం కొరకు తమ పార్టీ ఒక అడుగు వెనక్కి వెయ్యడానికి సిద్ధంగా ఉందని, ఈ భాషలో కాకున్నా ఈ స్ఫూర్తి ఆ లేఖలోఉంది.

రాష్ట్రంలో శాంతిచర్చలు విఫలమై, ఉద్యమం దెబ్బతిన్నది అన్న వాస్తవం గుర్తించినా, మావోయిస్టు పార్టీ శాం తిచర్చల ప్రస్తావన జాతీయ స్థాయిలో చేయడం, ఆ ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు చేయాలని కోరడం, దానికి స్వామి అగ్నివేష్, బి.డి.శర్మ, అరుంధతిరాయ్ లాంటి వాళ్ళను ప్రతినిధులు గా కోరుకోవడం, రాష్ట్ర స్థాయి చర్చల్లో మధ్యవర్తిగా పాల్గొన్న నాలాంటి వాళ్ళకు ఒక సంతృప్తిని కలిగించింది. మన రాష్ట్రంలో ఈ ప్రయత్నమే జరగకపోతే జాతీయ స్థాయిలో ఈ ప్రత్యామ్నాయమున్నదని ఎలా తెలిసేది

శాంతి చర్చల వల్ల మావోయిస్టు లేదా ఇతర విప్లవ ఉద్యమాలు దెబ్బతిన్నాయి అన్నది ఎంత వాస్తవమో ప్రజలలో ఉద్యమస్ఫూర్తి దెబ్బతినలేదు అనడానికి విస్తృతంగా జరుగుతున్న సజీవ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాక్ష్యం. ఉద్యమాల రూపం వేరుండవచ్చు కాని సారంలో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్న ఆకాంక్ష బలంగానే ఉంది. ఇందులో విప్లవ రాజకీయాలను అభిమానించే ఎంతో మంది క్రియాత్మకమైన పాత్రను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉండడానికి, మిగతా అన్ని ఉద్యమాల పాత్ర ఉన్నదన్నది కూడా ఒక నిజం.

- జి. హరగోపాల్

హక్కులకు పెద్దదిక్కు కన్నబిరాన్ అస్తమయం

నిరాడంబరంగా అంత్యక్రియలు
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/dec/31/main/31main64&more=2010/dec/31/main/main&date=12/31/2010

హక్కుల ఉద్యమం దిక్కు కోల్పోయింది! రాజ్యం అణచివేతను ప్రశ్నించిన కంఠం.. మూగబోయింది. హక్కుల ఉద్యమానికి ఊపిరులూదిన మహా నేత.. తుదిశ్వాస విడిచాడు. నలభై ఏళ్లుగా సాగిన ఉద్యమ ప్రస్థానం ఆగిపోయింది. విరామమెరుగని ఉద్యమకారుడు.. దీర్ఘ విశ్రాంతిలోకి వెళ్లిపోయాడు. ప్రఖ్యాత పౌర హక్కుల నేత, న్యాయవాది, కేజీ కన్నబిరాన్.. అస్తమించారు. మానవ హక్కుల కోసం ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది'' అని ఆమ్నెస్టీ నుంచి ప్రశంసలు పొందిన కన్నబిరాన్ ఉద్యమ చరిత్రలో తనకంటూ విలక్షణమైన అధ్యాయాన్ని రచించుకుని.. వెళ్లిపోయారు.

హైదరాబాద్, డిసెంబర్ 30(ఆన్‌లైన్ సిటీబ్యూరో)  హక్కుల ఉద్యమం ఓ యోధుడిని కోల్పోయింది. పదిహేనేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ హక్కుల ఉద్యమంలో, అనంతరం పీయూసీఎల్‌లో మమేకమైన కేజీ కన్నబిరాన్.. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య వసంత, కుమార్తెలు కల్పన, చిత్ర, కుమారుడు అరవింద్ ఉన్నారు. ఏడాది కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు మారేడ్‌పల్లిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కన్నబిరాన్..రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమానికి ఊపిరి పోసిన తొలితరం నేత. ఆయన మరణవార్త తెలియగానే పెద్ద సంఖ్యలో హక్కుల సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

కన్నబిరాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కన్నబిరాన్ భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో మంత్రులు జానారెడ్డి, మాణిక్య వర ప్రసాద్, ఎంపీ మధు యాష్కీ, ప్రజా గాయకుడు గద్దర్, హక్కుల, విప్లవ సంఘాల నేతలు హరగోపాల్, వరవరరావు, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, అరుణోదయ విమలక్క, ప్రెస్ అకాడెమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి, హెచ్ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ ఉన్నారు.

అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో మారేడ్‌పల్లి శ్మశానవాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపారు. కన్నబిరాన్ చితికి.. కుమారుడు అరవింద్ నిప్పటించారు. తన మృతి వార్త ప్రపంచానికి తెలియనివ్వవద్దని, తా ను జీవించి ఉన్నాననే ప్రపంచానికి తెలియాలని కన్నబిరాన్ కో రుకున్నారు. దాంతో నిరాడంబరంగా అంత్యక్రియలు జరిపారు. కన్నబిరాన్ మృతితో మారేడ్‌పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రాజ్యాంగం తెలియని ప్రజలకు రాజ్య హక్కుల్ని తెలిపిన మహా నాయకుడు కన్నబిరాన్ అని గద్దర్ నివాళులర్పించారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కన్నబీరన్ మృతితో హక్కుల ఉద్యమంలో ఓ మహా వీరుడు ఒరిగినట్లయిందని చెప్పారు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన హక్కుల దిక్కు కణ్ణబీరన్ అని వరవరరావు జోహార్లర్పించారు.

కన్నబిరాన్ మృతికి సీపీఐ నేతలు సురవరం, నారాయణ ,ఏపీసీఎల్‌సీ నేతలు ఎస్.శేషయ్య, కె.క్రాంతి చైతన్య, సీఎల్‌పీ నేత పాలడుగు, రైతు కూలీ సంఘం నేతలు ఎస్.ఝాన్సీ, కె.కోటయ్య, చైతన్య మహిళా సంఘం నాయకులు జ్యోతి, దేవేంద్ర, పీడీఎస్‌యూ(పిడికిలి) నేతలు వెంకటేష్, వీరన్న, సామాజిక వేత్తలు ఉ.సా, కొత్తగట్టుమల్లయ్య, వెంకటనారాయణబోయ(తెలంగాణమహాసభ), పాపని నాగరాజు(టీబీఎస్‌యూ), గుండా రవి కురుమ(తెలంగాణ బీసీ మహాజన సమితి) ఏపీయూడబ్యుజే నేతలు కె. శ్రీనివాస్‌రెడ్డి, వై. నరేందర్‌రెడ్డి,, ఐజేయూ నేత కె. అమర్‌నాథ్, టీఎన్జీవో నేతలు స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, దేవీప్రసాద్, సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గం రాష్ట్ర కమిటీ నేతలు వేర్వేరు ప్రకటకల్లో సంతాపం తెలిపారు

మార్క్స్ సాహిత్యంతోనే పేదల వైపు


'ఏబీఎన్ ఇన్‌సైడర్'లో కన్నబీరన్

ప్రజారహిత వ్యాజ్యాలతో దేశానికి దుర్గతి
న్యాయవ్యవస్థలో కులతత్వమూ ఉంది
వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదు
మధ్య తరగతిదే తెలంగాణ పోరాటం
ఇందులో వర్గ పోరాటం లేదు
'
ఏబీఎన్ ఇన్‌సైడర్'లో కన్నబీరన్
వెల్‌కమ్ టు ది ఇన్‌సైడర్. ఈరోజు మనతో ప్రముఖ న్యాయవాది కేజీ కన్నబీరన్ ఉన్నారు. ఆయన పీడిత ప్రజల ప్లీడర్, ప్రజాహక్కుల పోరాట యోధుడు. ఈ రెండూ ఆయన కళ్లు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఐదు దశాబ్దాల అలుపెరుగని పోరాటయోధుడు కన్నబీరన్‌కు ఇపుడు కొంత విశ్రాంతి దొరికింది. ఆయన మనతో తన అంతరంగాన్ని విప్పదలచుకున్నారు.

రాష్ట్రం ఏదిశలో పోతుందని మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడేర్పడిన సంక్షోభం.. సమగ్రతకు సంబంధించినది. రాజ్యాం గం ఓ ఫెడరల్ సంస్థను ఏర్పాటుచేసుకుని, దాన్ని నడపలేక అవస్థ పడుతోంది. ఇక్కడుండే వర్గాలు, జాతులు, ప్రాదేశిక ప్రజల మధ్య అసమానతలున్నాయి. తెలంగాణది అదే సమస్య. ప్రజల అసమానతను నాయకులు గుర్తించి వాటిని సరిదిద్దితే ఇంతదూరం వచ్చేది కాదు.

కొందరు దీన్ని చట్టవిరుద్ధమైన పోరాటమని సుప్రీంలో పిల్ కూడా వేశారు..
అసలీ పిల్‌లతోనే దేశానికి దుర్గతి పట్టింది. ప్రజలతో సంబంధం లేకుండా అణచివేతకు గురైనవాళ్ల వాదన వినకుండా తీర్పులిచ్చే దురలవాటు ఉంది. దీన్ని ఆపేయాలి. సామాన్యుడికి న్యా యం జరగట్లేదు. న్యాయస్థానం న్యాయం కోసం కాదు.. వకీళ్లు, జడ్జీల కోసమే.

ప్రజాసమస్యలపై అవగాహనలేని వారికి వాటిపై తీర్పుచెప్పే అధికారం ఉందా?
వకీలైన తర్వాత అధ్యయనానికి అవకాశముంది. ఆ అలవాటు ఎవరికీ ఉండట్లేదు. ఓ ఉద్యోగంలో ఉన్నపుడు అందుకు కావల్సిన అవగాహన సంపాదించడం బాధ్యత. అది లేకపోతే వదిలి వెళ్లిపోవచ్చు.

మీ బాల్యం ఎలా గడిచింది?
నాన్నగారు నెల్లూరులో డాక్టర్. ఆయన రెండో పెళ్లి చేసుకోవడంతో మేం విడిపోయాం. చాలా పేదరికం. తర్వాత మా కజిన్ ఉద్యోగం చేయడంతో పుస్తకాలు కొనుక్కోగల సామర్థ్యం వచ్చి బాగా చదివేవాణ్ని. కొన్ని ఉద్యోగాలు చేసి, వదిలేసి సికింద్రాబాద్ వచ్చాను.

సికింద్రాబాద్ ఎంచుకోడానికి ఏమైనా పట్టుదల కారణమా?
అవును. నేనిక్కడకి వచ్చి, నాన్న కంటే ఎక్కువ పేరు సంపాదించాలనుకున్నా. సొంతగా ప్రాక్టీసు మొదలుపెట్టా. తర్వాత ఎంవీవీఎస్ వెంకట్రావు వద్ద చేరాను. అక్కడ వృత్తి లోతుపాతులు తెలిశాయి.

లాయర్‌గా ఎదిగే అవకాశమున్నా, నక్సలైట్ల వైపు ఎందుకు వెళ్లారు?
కమ్యూనిస్టు సిద్ధాంతంపై నమ్మకం, రాజకీయాల్లో విలువలు కనపడకపోతే ఆలోచించడం.. ఈ పరిస్థితుల్లో ఉద్యమం వచ్చింది. జ్వాలాముఖి కేసు నాకు తీసుకొచ్చి ఇచ్చింది నా జూనియర్ చారి. రావి సుబ్బారావు ఎక్కువగా కుట్ర కేసుల్లో ఇరికించారు.

భూమయ్య, కిష్టగౌడ్ కేసు నేపథ్యమేంటి?
వాళ్లు నక్సలైట్ల కొరియర్లు. హత్యారోపణ ఉంది గానీ, శిక్ష వేసేంత సాక్ష్యం లేదు. శిక్ష పడేసరికి వేసవి సెలవులున్నాయి. పిటిషన్ తయారు చేసి గవర్నర్ ఓబుల్‌రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన ఒప్పుకోలేదు. రిట్ పిటిషన్ ఇచ్చి నా జూనియర్లను వెకేషన్ న్యాయమూర్తి గంగాధరరావు ఇంటికి పంపాను. స్టే వచ్చింది. నేను, వసంత జైలుకు వెళ్లి ఉరి అమ లు కాకుండా చూసి.. తర్వాత ముత్యాలముగ్గు సినిమాకు వెళ్లాం. త ర్వాత కేసు మాధవరెడ్డి, మధుసూదనరావుల ముందుకొచ్చింది. రా జ్యాంగాన్ని నమ్మని నక్సలైట్లు దాని కింద రక్షణ ఎలా పొందుతారని మధుసూదనరావు అడిగారు. వాళ్ల విలువలు కాదు, మీ విలువలే ఇక్కడ ముఖ్యమని నేను చెప్పాను.

వాళ్లను ఉరితీయాల్సి వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు?
చాలా కోపం వచ్చింది. అసలు వారికి ఉరెందుకు వెయ్యాలో అర్థంకాలేదు. అప్పట్నుంచి దానిపై పోరాడాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదని నేనన్నాను.

ఎన్‌కౌంటర్ల విషయంలో ఎలా భావించేవారు?
చాలా సందర్భాల్లో అలా జరుగుతుంది. నా ప్రయత్నాల్లో ఉండగానే చాలామంది.. కుర్రాళ్లు నాకు తెలిసి ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఇటీవల పటేల్ సుధాకర్‌రెడ్డిని అలాగే చంపేశారు.

ఏపీసీఎల్‌సీ లాంటివాటిపై నక్సలైట్ల ముద్ర వేశారు కదా..
పోలీసులు నన్నూ నక్సలైటుగానే జమ కట్టేశారు. నేను నక్సలైటునే. వాళ్ల పద్ధతులతో ఏకీభవించను గానీ, ప్రాథమికంగా లెఫ్టిస్టునే.

మిమ్మల్ని చంపుతామన్న బెదిరింపులొచ్చాయా?
అదికూడా అయ్యిందిగానీ, వాళ్లకు ధైర్యంరాలేదు. నా స్థాయి వాడిని చంపాలంటే నైతిక స్థైర్యం కావాలి.

న్యాయవాదిగా ఎక్కువ ఫీజు ఎంత? కేసు ఎలా తీసుకునేవారు?
రిజర్వుబ్యాంకు దగ్గర రోజుకు 30 వేలు తీసుకున్నా. ఫీజు ఇంత కావాలని నాకు నోరు కూడా వచ్చేదికాదు. ఏదైనా అన్యాయం జరిగిందని భావిస్తేనే కేసు తీసుకుంటాను.

నిజమైన న్యాయమూర్తి అని ఎవరి గురించైనా అనుకున్నారా?
న్యాయం చేశారని చెప్పలేను.. బాగా వినేవాళ్లున్నారు. మన వాదన వినడానికే జీతమిస్తారు. చెప్పడం మన హక్కు, వినడం వారి బాధ్యత.

న్యాయమూర్తుల్లోనూ అవినీతి ఉంటుందా?
ఎందుకుండదు? ఉంటుంది. అవగాహన లోపిస్తే చాలామంది ఈ హోదాను బట్టి, తమను తీసేయలేరు కాబట్టి, ఏం చేసినా చెల్లుతుందనుకునేవాళ్లు చాలా కొద్దిమంది ఉన్నారు.

బాధ్యతాయుతమైన న్యాయవాదులు ఎవరైనా కనపడ్డారా?
అసలు ఆలోచించేవాళ్లే తక్కువ. కేసు గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. బాలగోపాల్ చాలా నిబద్ధత ఉన్న న్యాయవాది. 500 నుంచి 2 వేలే తీసుకునేవాడు. ఎక్కువిస్తే తిరిగి ఇచ్చేసేవాడు.

మీకెదురైన మంచి క్లయింట్ ఎవరని చెప్పగలరు?
కొండపల్లి సీతారామయ్య. నేనొచ్చి వాదించాలంటే లేఖ రాసేవారు. పన్నెండుసార్లు కలిసుంటాను. చండ్ర పుల్లారెడ్డిని కూడా కలిశా. ముప్పాళ్ల లక్ష్మణరావు(గణపతి)నీ ఇక్కడే ఎక్కడో ఇళ్లలో చాలా ఏళ్ల క్రితం కలిశాను.

మీ పిల్లలు మిమ్మల్ని మిస్సయినట్లు కనపడలేదా?
అదృష్టవశాత్తు వాళ్లు ముగ్గురూ చాలా తెలివైనవాళ్లు. వాళ్ల జీవితాలు వాళ్లే తీర్చిదిద్దుకున్నారు. పెద్దమ్మాయి పరిశోధనల్లో ఉంది. నా రచనలను పుస్తకరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. బాబు అమెరికాలో చదివాడు. వాడు సినిమాటోగ్రాఫర్. మంగళ్‌పాండే లాంటి సినిమాలకు చేశాడు.

వసంత గురించి ఐదు వాక్యాల్లో ఎలా వర్ణిస్తారు?
ఆమె ఉత్తమ సహధర్మచారిణి. జీవితంలో అన్ని సమయాల్లోనూ వెన్నంటి నిలిచింది. ఈ స్థాయికి ఎదిగేందుకు తోడ్పడింది.

కన్నబీరన్ ఈ సమాజానికి ఏమిచ్చారు?
ప్రజలు నైతిక స్థైర్యం, పోటీతత్వం కలిగి ఉండాలని చెప్పాను. అవసరార్థులకు సాయం చేయాలని చెప్పాను.

ప్రజలు అడుగుతున్నా తెలంగాణ ఎందుకివ్వలేకపోతున్నారు?
తెలంగాణ ఇవ్వడమంటే అంత సులభం కాదు. వలసవచ్చిన ఆం«ద్రుల ప్రయోజనాలు గుర్తించాలి. ఈ ప్రయత్నాన్ని ప్రతిసారీ వారు భంగపరుస్తున్నారు. 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు ప్యాచ్ వర్క్ చేశారు. దేశంలో మనకున్న ఏకైక గట్టి నేత ఇందిరాగాంధీయే. ఆమె తెలంగాణ ప్రాంతీయ కమిటీ పెట్టారు. దాన్ని సరిగా అమలుచేస్తే బాగానే ఉండేది.

తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏంటి?
తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నా, వీరికి ప్రయోజనం కలగలేదు. నీటి యాజమాన్యాన్ని నాయకులు చూడటం మొదలుపెట్టారు. ఇవి పేదజనాల కొట్లాటలు కావు. వారు ఎక్కడైనా అంతే. మధ్యతరగతే ఈ పోరాటం చేస్తోంది. ఇది శాస్త్రబద్ధమైన తగాదా. దీంట్లో వర్గపోరాటాల్లేవు.

న్యాయవ్యవస్థలో కులతత్వం ఉందా?
మద్రాస్‌లో బ్రాహ్మలు తప్ప వేరెవరూ అడ్వొకేట్లు కారు. వాళ్లకి ఇంగ్లీషుమీద, చట్టం మీద ఆధిపత్యం ఉంది. విశ్లేషించే సామర్థ్యం ఎక్కువ ఉండేది. న్యాయమూర్తులూ బ్రాహ్మలే. ఇప్పుడైనా జాబితా చూస్తే ఎంతమంది అగ్రకులాల వారున్నారు? ఎందరు దళితులున్నారో తెలుస్తుంది.

మీది తమిళ బ్రాహ్మణ కుటుంబం. సంప్రదాయానికి భిన్నంగా దళితులు, ముస్లింల వెంట ఎందుకు పడ్డారు?
మేం పెరిగిన రోజుల్లో పెద్ద ఎత్తున మార్క్సిజం మమ్మల్ని ఆకర్షించింది. పేదవాళ్ల గురించి రాసినవాడు మార్క్స్ ఒక్కడే. మార్క్స్ సాహిత్యం, దాని చుట్టూ ఉన్న విజన్ ఓ ప్రపంచ దృక్పథం కల్పించి, పేదల వైపు నన్ను పంపింది.

అయాన్ రాండ్ - ఉదారవాదం

కుక్షింభర తత్వం
- బ్రూస్ ఇ.లెవినె
https://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain

అయాన్ రాండ్ 'తాత్వికత' తన నీతిబాహ్యతలో దాదాపుగా పరిపూర్ణమైనది. మన సమాజంలో మనం ఒక ఆసక్తికరమైన కొత్త దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆమె 'తాత్వికత'కు పెరుగుతున్న ఆదరణ శుభపరిణామం కాదు. అత్యాశ, అహంకారంను సమర్థించి, కొనియాడటం అనైతికమేకాక దుర్మార్గమని కూడా నాకు అనిపిస్తుంది.
- గోర్ విడాల్

అమెరికా చరిత్రలో సాహిత్యవేత్తలు అరుదుగా మాత్రమే తమ ప్రజలను ఇతరుల సంక్షేమం పట్ల మరింత బాధ్యతగా లేదా తక్కువ శ్రద్ధతో వ్యవహరించే జాతిగా పరిణమింప చేశారు. 1850ల్లో అమెరికా మరింత మానవీయ జాతిగా రూపొందేలా చేయడంలో హారియెట్ బీచర్ స్టోవ్ (1811-96) ఒక శక్తిమంతమైన పాత్ర నిర్వహించారు. బానిసత్వంలో మగ్గుతున్న ఆఫ్రికన్ అమెరికన్లను స్వేచ్ఛా పౌరులను చేసింది స్టోవ్ ప్రభావిత అమెరికా.

ఒక శతాబ్దం అనంతరం అయాన్ రాండ్ (1905-82), పారిశ్రామిక ప్రపంచంలో తోటి పౌరుల శ్రేయస్సుపట్ల అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించే ప్రజలుగా అమెరికన్లు మారిపోవడానికి, దోహదం చేశారు. ఇదొక సరికొత్త డికెన్సియన్ సమాజం. ఇందులో అన్ని వ్యయాలను భరించగలవారికే ఆరోగ్యభద్రత; విద్యాభ్యాసానికై పెద్ద ఎత్తున రుణాలు తీసుకొనేలా యువజనులను బలవంతపెడుతున్న వ్యవస్థ ఇది. రాండ్ ప్రభావం విస్తృతమైనది, ప్రగాఢమైనది. అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దిన రాజకీయ ప్రముఖులు పలువురిపై ఆమె ప్రభావం ఉంది.

1950ల్లో 'కలెక్టివ్'గా ప్రసిద్ధికెక్కిన తన ఆంతరంగిక యువ మిత్ర మండలిలో చదివి విన్పించిన చిత్తుప్రతులే తదనంతర కాలంలో 'అట్లాస్ ష్రగ్‌డ్' రూపం దాల్చాయి. ఆ యువ మిత్రులలో, 1987 నుంచి 2006 దాకా ఫెడరల్ రిజర్వ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న, అలన్ గ్రీన్‌స్పాన్ ఒకరు. 1996లో రోనాల్డ్ రీగన్‌లో ఒక వ్యక్తిగత లేఖలో 'తాను అయాన్ ర్యాండ్ అభిమాని'నని రాశారు. తను రాజకీయాలలోకి ప్రవేశించడానికి 'అట్లాస్ ష్రగ్‌డ్' స్ఫూర్తినిచ్చిందని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పౌల్ ర్యాన్ అన్నారు.

అట్లాస్ ష్రగ్‌డ్ తన ఆలోచనలకు ప్రాతిపదిక గ్రంథమని సెనేటర్ రాన్ తన బాగే గాని ఇతరుల బాగు గురించి ఏ మాత్రం పట్టించుకోనవసరం లేదని ఉపదేశించే రాండ్ తాత్విక చింతననే ఆమె వ్యక్తిగత జీవితమూ అనుసరించింది. ఆమె రోజుకు రెండు సిగరెట్ ప్యాకెట్లను ఖాళీ చేసేవారు. ధూమపానం ప్రమాదాలను గురించి ప్రశ్నించినప్పుడు ఆమె చాలా తేలిగ్గా తీసుకొనేవారు. అంతేగాక 'గణాంక సాక్ష్యాల అశాస్త్రీయతను, హేతువిరుద్ధ స్వభావాన్ని ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటారని' ఆమె తన యువ మిత్రులను కోప్పడేవారు. ఒక వైద్య పరీక్షలో ఆమె ఊపిరితిత్తులకు కేన్సర్ సోకినట్లు వెల్లడయింది. రాండ్ ధూమపానాన్ని నిలిపివేశారు.

శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 'కలెక్టివ్'లోని యువ సహచరులు కొంత మంది ఒకసారి ఆమెతో ఇలా వాదించారు 'మీ భావాల మీద గౌరవంతో, మీ మాటమీద పూర్తి నమ్మకంతోనే సమాజంలో ఎంతో మంది ధూమపానాన్ని కొనసాగిస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు ధూమపానం గురించి నిజం చెప్పాలి. అయితే లంగ్ కేన్సర్ గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. కొత్త శాస్త్ర రుజువులను దృష్టిలో ఉంచుకొని ధూమ పానాన్ని నిలిపివేయాలని ప్రజలకు చెప్పాలని కోరారు. అయాన్ రాండ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కామిక్స్ బుక్స్‌తో పాటు రాండ్ గ్రంథాలు 'ది ఫౌంటైన్‌హెడ్', 'అట్లాస్ ష్రగ్‌డ్' మొదలైన వాటిని కూడా చదివాను. కథానాయకుల సరళత పరంగా కామిక్ పుస్తకాలకి, ర్యాండ్ గ్రంథాలకు మధ్య పెద్ద తేడా లేదు బేధమల్లా సూపర్ మ్యాన్, బ్యాట్ మన్ వలేకాకుండా రాండ్ నవల్లో స్వార్థం ఒక వీరోచిత గుణంగా అభివర్ణితమయింది. ఇతరుల గురించి పట్టించుకోవడం, పట్టించుకున్న వాడి బలహీనతలకు తార్కాణం.

రాండ్ ఇలా అన్నారు 'పెట్టుబడిదారీతనం, పరోపకార వాదం పరస్సర విరుద్ధమైనవి. మనం దేనిని అనుసరించాలనేది స్పష్టమే. స్వేచ్ఛ, న్యాయం, ప్రగతి, భూమిపై మనుగడ మొదలైన వాటిపై ప్రభావం చూపే సహేతుకమైన స్వప్రయోజనపు నూతన నైతికత లేదా పరోపకారవాద ఆదిమ నీతి. ఈ ఆదిమ నీతిని మనం అనసరిస్తే దాని పర్యవసనాలు బానిసత్వం, పశుప్రాయత, స్తబ్ధత, భీతి, అంతులేని బాధలు''. తనను గురించి పట్టించుకోవడమే ముఖ్యమని, వేరెవ్వరిని పట్టించుకోనవసరం లేదని, ఇలా వ్యవహరించడం 'నైతిక'మేనన్న రాండ్ భావాలకు యువజనులు విశేషంగా ఆకర్షితులయ్యారు.

వాటి ప్రాతిపదికనే తమ 'జీవిత భావన'ను రూపొందించుకున్నారు. అయా న్ రాండ్ భావాలతో స్ఫూర్తి పొంది, జీవితంలో ఒక దశలో ఆ అభిప్రాయాలను మార్చుకున్న పలువురి గురించి నాకు తెలుసు. వారంతా నాకు వృత్తి లేదా సామాజిక జీవితంలో పరిచయస్తులే. రాండ్ తత్వం పట్ల భ్రమలు కోల్పోయిన తరువాత వారు చెప్పిన విషయాల సారాంశాన్ని ఇలా చెప్పవచ్చు 'రాండ్ గ్రంథాలు చదవకముందు నా భర్త చాలా మంచి వ్యక్తిగా మెలిగేవారు. రాండ్‌ను చదివిన తరువాత అతనిలో చాలా మార్పు వచ్చింది. తనను గురించి మినహా మా గురించి పట్టించుకోవడం మాని వేశాడు. ఇప్పుడు పిల్లలు సైతం విసిగిపోయి అతనితో మాట్లాడడం లేదు'.

తన యువ అభిమానులకు రాండ్ తరచు ఒక విషయాన్ని చెబుతుండేవారు. ఒకసారి ఒక పుస్తక విక్రేత తనను ఒక కాలి మీద నుంచొని తన తాత్విక చింతనను క్లుప్తంగా, సమగ్రంగా వివరించమని సవాల్ చేశాడట. అందుకు ఆమె ఇలా సమాధానమిచ్చింది అధిభౌతిక చింతన- వస్తుగత యథార్థం; జ్ఞాన మీమాంస-హేతువు; నైతిక విశ్వాసం- స్వప్రయోజనం; రాజనీతి- పెట్టుబడిదారీ విధానం. ఈ తాత్విక చింతన యువ మనస్సులను ఎలా స్వాధీనం చేసుకొంది

అధిభౌతిక భావాలు 'వస్తుగత యథార్థం' ఒకటి ఉందని రాండ్ విశ్వసించారు. అదేమిటో కూడా ఆమెకు నిశ్చితంగా తెలుసు. అందులో ఆకాశ హర్మ్యాలు, పరిశ్రమలు, రైల్‌రోడ్లు, భావాలు-కనీసం ఆమె భావాలు ఉంటాయి. ఆమె విశ్వసించే వస్తుగత యథార్థంలో విచారానికి, ఆదుర్దాకు తావే లేదు. హాస్యానికి అసలే స్థానం లేదు. కనీసం ఒకరు తనపై తాను చేసుకునే పరిహాసాస్పద వ్యాఖ్యలకు సైతం అందులో చోటు లేదు. తాను విశ్వసించే యథార్థతలో బీథోవెన్, రెంబ్రాండ్ట్, షేక్స్‌పియర్ వాస్తవికతలకు స్థానం అసలే లేదు.

అవి ఉదాసీనమైనవి, విషాదాత్మకమైనవి. మిస్కే స్పిల్లన్ రచనలను ఆమె అభిమానించేవారు. జీవితం చరమ దశలో 'ఛార్లెస్ ఏంజెల్స్' వైపు ఆకర్షితులయ్యారు. జ్ఞాన మీమాంస రాండ్ 'హేతువు' విశ్వాన్ని నియంత్రించేది. ప్లేటో అంటే ఆమెకు ఇష్టం లేదు. ఆ తాత్వికుడిని తిరస్కరించమని 'కలెక్టివ్'లోని తన యువ మిత్రులకు ఆమె చెబుతుండేవారు. సత్యావిష్కరణకై కచ్చితమైన నిర్వచనాలను అన్వేషించేందుకు, తర్కం ప్రాతిపాదికన ఖచ్చితమైన, స్పష్టమైన ఆలోచనా విధానాన్ని రూపొందించుకునేందుకు ఉపయోగించే 'సోక్రటిక్ పద్ధతి' హేతుబద్ధమైనది కాదని ఆమె విమర్శిస్తుండే వారు.

అయితే తన యువ మిత్రులతో చర్చించేటప్పుడు ఆమె ఆ తాత్విక పద్ధతినే అనుసరించే వారు! డాస్టోవస్కీ లాంటి రచయితలను అభిమానించేలా ఆమె తన యువ మిత్రులను ప్రోత్సహించే వారు. అటువంటి ఆలోచనా ధోరణికి అలవాటు పడిన వారు ఎటువంటి అధికారాన్ని ప్రశ్నించలేరు కదా. యువ జనులలో స్పష్టమైన ఆలోచనా విధానం వికసించకుండా చూడడమే అయాన్ రాండ్ లక్ష్యం.

నైతిక విశ్వాసం రాండ్ దృష్టిలో పరోపకారవాదులందరూ అవినీతిపరులే. వ్యవస్థలను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకొనేవారే. ఆమె విశ్వసించే స్వప్రయోజనం నైతికతకు ప్రాతనిధ్యం వహించేదికాదని ఆమె అభిమానులే భావించారు. ఆమె సృష్టించిన ఆర్కిటెక్ట్ పాత్ర హోవార్డ్ రోవార్క్ ఒక కమిషన్‌ను తీసుకోవడానికి తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆ పనిని తనదైన రీతిలో తాను సరిగ్గా నిర్వర్తించలేననే అనుమానంతో. రాండ్ అభిమానుల దృష్టిలో స్వప్రయోజనమంటే ఇదే. ఇతరులకు మనస్తాపం కల్గించకుండా తన స్వప్రయోజనాలను నెరేవర్చుకోవాలన్న నైతికాంశాన్ని ఆమె పట్టించుకోలేదు. రాజనీతి సోవియట్ కమ్యూనిస్టు వ్యవస్థను రాండ్ తిరస్కరించారు.

అయితే కార్పొరేట్ నియంతృత్వ సాముదాయక వ్యవస్థలు కూడా సోవియట్ కమ్యూనిజం మాదిరిగా వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తిగత చొరవకు ప్రాధాన్యమివ్వవన్న సత్యాన్ని గుర్తించడానికి ఆమె నిరాకరించారు. ఇది ఆమె ద్వంద్వనీతికి తార్కాణం. కార్పొరేట్ అమెరికాలో కేవలం సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవడం, పై వారు చెప్పినట్టు చేయడం వల్లే పెద్దగా డబ్బు ఆర్జించలేమన్న సత్యం ఆమెకు తెలుసు. అందుకే 'అమెరికాలో వేధింపులకు గురవుతున్న మైనార్టీ వర్గం  గుత్త వ్యాపారులు' ఇత్యాది అంశాలపై ఆమె ప్రసంగాలు చేసేవారు.

పాలకుల నుంచి, పెట్టుబడిదారుల నుంచి ఎటువంటి సమస్యలు ఉండనటువంటి 'రాడికల్ పెట్టుబడిదారీ విధానాన్ని' ఆమె ప్రవచించారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రముఖ రాజకీయవేత్తలందరూ అయాన్ రాండ్ భావాలను బహిరంగంగా ఆమోదిస్తున్నారు. క్రైస్తవ మత విలువలను ఆమె తీవ్రంగా విమర్శించారన్న విషయం తెలిసి కూడా ఆమె రాజకీయ, ఆర్థిక భావాలను అ ంగీకరిస్తున్నారు. ఇందుకు భిన్నంగా రాండ్ జీవితకాలంలో స్వప్రయోజనం అనే భావన సంపన్న వర్గాలవారి ఆమోదం పొందినప్పటికీ ఆమె మత భావాల విషయంలో ఇబ్బంది పడేవారు. తమ స్వార్థపరత్వం నైతికతపై ఆమె గ్రంథాల ఆధారంగా వారు తమను తాము అభినందించుకునేవారు.

మతం, భగవంతుడు అనే భావనల విషయంలో రాండ్‌ను దూరంగా ఉంచేవారు. ఒక సారి ఆమె ఇలా చెప్పారు 'నేను దేవుడికి వ్యతిరేకిని. మతాన్ని నేను అంగీకరించను. అది మానసిక బలహీనతకు రుజువు. దానిని నేను ఒక పాపంగా భావిస్తాను'. నిజానికి ఆమె సునిశ్చిత విశ్వాసానికి ఇది పూర్తిగా భిన్నమైనది. తనకు భగవంతుడు ఉన్నాడని రాండ్ చెప్పారు. ఆ దేవుడు ఆమే! రాండ్ ఇలా అన్నారు

నేను 'మనము' అనే పదాన్ని త్యజించాను. అది బానిసత్వం, దోపిడీ, దయనీయత, అసత్యం, సిగ్గును సూచించేది. ఇప్పుడు నేను భగవంతుడిని చూస్తున్నాను. ఆ దేవుడిని భూమిపైకి తీసుకొచ్చాను. మానవులు ఉనికిలోకి వచ్చినప్పటినుంచీ ఆ భగవంతుడి కోసం అన్వేషిస్తున్నారు. వారు కోరుకొనే ఆనందాన్ని, శాంతిని ఆయన ప్రసాదిస్తాడు. ఈ భగవంతుడే 'నేను'. ఈ పదాన్నే నేను అంగీకరిస్తాను''.

ఆఫ్రికన్ అమెరికన్ల దయనీయ బతుకులు, బానిసత్వం ఒక నాగరిక దేశానికి ఎంత లజ్జాకరమో హారియెట్ బీచర్ స్టోవ్ అమెరికాకు తెలుపగా, ఎల్లవేళలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ, ఎవరి బాగోగులను పట్టించుకోకపోవడంపై అమెరికన్ల అపరాధ భావాన్ని అయాన్ రాండ్ తొలగించారు. పన్నులలో తమ వంతు వాటాను సంపన్నులు సక్రమంగా చెల్లించక పోవడాన్ని 'నైతికం' చేయడమే కాక తమ సొంత బిడ్డలతో సహా ఇతరుల బాధలను పట్టించుకొనే బాధ్యత నుంచి లక్షలాది అమెరికన్లను రాండ్ విముక్తం చేశారు. తమ జీవితాలకు రాండ్ తత్వశాస్త్రం చేసిన హానిని గుర్తించి తమ మనస్సుల నుంచి దానిని తుడిచి వేయడానికి ఆమె మాజీ అభిమానులు పూనుకుంటున్నారు. ఒక జాతిగా అమెరికా కూడా అటువంటి పని చేస్తుందా

- బ్రూస్ ఇ.లెవినె
(ఆల్టెర్‌నెట్ సౌజన్యంతో)

‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా

“మతం ప్రజల పాలిట మత్తు మందు” అని కారల్ మార్క్స్ అన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఒక్కటి మాత్రమే మార్క్సు అని ఊరుకున్నాడా లేదు. ఆయన మతానికి మత పెద్దలు కూడా ఇవ్వలేని విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని కారల్ మార్క్స్ నిర్వచించాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని ఎలా నిర్వచించవచ్చో, నిజానికి, మత సూత్రాలలో ఉద్దండ పండితులెవ్వరికైనా తెలిసి ఉంటుందని భావించలేము. వారంతా మతాన్ని దేవుడి దృక్పధంలో నుండి, మత పండితుల ఆత్యాధ్మిక తర్క జ్ఞానం నుండి నిర్వచించారే తప్ప అది మనిషి నుండి ఎలా ఉధ్భవించిందీ, మనిషి నుండి ఉద్భవించిన మతం, ఆ మనిషికి ఎలా ఊరటగా నిలిచిందీ, ఎలా మత్తుమందుగా మారిందీ నిర్వచించాడు. కారల్ మార్క్స్ మాటల్లోనే మతం అంటే ఏమిటో తెలుసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

మతరాహిత్య విమర్శకు పునాది ఏమిటంటే మనిషే మతాన్ని తయారు చేశాడు, మతం మనిషిని తయారు చేయలేదు. మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness) మరియు ఆత్మ-గౌరవం (self-esteem). కాని, మనిషి, ప్రపంచానికి వెలుపల బాసింపట్లు వేసుకుని కూర్చున్న అమార్త జీవి కాదు. మనిషి, మనిషి యొక్క ప్రపంచం – రాజ్యం, సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం మతాన్ని సృష్టించింది. మతం, ప్రపంచం యొక్క తలకిందులుగా ఉన్న చైతన్యం. ఎందుకంటే వారు (రాజ్యం, సమాజం -అనువాదకుడు) తలకిందులుగా ఉన్న ప్రపంచం కనుక. మతం, ఈ ప్రపంచం యొక్క సాధారణ సిద్ధాంతం. మతం, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం యొక్క సారం. మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం. మతం ప్రపంచం యొక్క ఉత్సుకత, నైతిక నియమం, వైదిక అనుబంధితం (solemn complement), మరియు ప్రపంచపు ఊరటకూ, ఔచిత్యానికీ సార్వజనీన ప్రాతిపదిక. మానవ సారం (human essence) ఏ విధంగానూ నిజమైన వాస్తవికతను సంతరించుకోని పరిస్ధితుల్లో అది మానవ సారం యొక్క అద్భుతమైన సాక్షాత్కారం (fantastic realization). కనుక, మతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే, పరోక్షంగా, ఏ ప్రపంచం యొక్క సర్వవ్యాపిత సూక్ష్మ లక్షణంగా (aroma) మతం ఉన్నదో ఆ ప్రపంచానికి వ్యతిరేకంగా పోరాటమనే అర్ధం.

మతపరమైన దుఃఖం అన్నది, ఒకే సమయంలో, వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా. మతం, అణచివేతకు గురవుతున్న ఒక జీవి విడిచే నిట్టూర్పు. హృదయం రహిత ప్రపంచానికి హృదయం, అత్మరహిత పరిస్ధితులకు ఆత్మ. అది ప్రజలపాలిట మత్తుమందు.
(వక్కాణింపులు అనువాదకుడివి కావు)

Posted by visekhar ⋅ డిసెంబరు 22, 2011 ⋅ వ్యాఖ్యానించండి
4 స్పందనలు to “‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా?”

“మతపరమైన దుఃఖం అన్నది, ఒకే సమయంలో, వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా. మతం, అణచివేతకు గురవుతున్న ఒక జీవి విడిచే నిట్టూర్పు. హృదయం రహిత ప్రపంచానికి హృదయం, అత్మరహిత పరిస్ధితులకు ఆత్మ. అది ప్రజలపాలిట మత్తుమందు.”

మతం ప్రజల పాలిట మత్తుమందు అని మార్క్స్ చేసిన సూత్రీకరణ వెనుక విస్తృతార్థాన్ని చక్కగా అనువదించారు. ప్రపంచంలో ఉనికిలోకి వచ్చిన అన్ని భక్తి ఉద్యమాలను అణచివేతకు గురైన జీవి విడిచే నిట్టూర్పుగా అర్థం చేసుకుంటేనే, పోతన కావ్య వేదనను, అన్నమయ్య గీతాల అంతరార్థాన్ని, కబీర్ దాసు రామాయణాన్ని, త్యాగరాజు అజరామర సంగీత ధారను, ‘ఎవడబ్బ సొమ్మాని కులుకుతు తిరిగేవు రామచ్చంద్రా’ అంటూ సాక్షాత్తూ రాముడిపైనే తిరగబడిన రామదాసు సామాజిక నేపధ్యాన్ని మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోగలం. ‘దుర్మధాంధులైన రాజులకు, కర్నాట కిరాత కీచకులకు తన కృతిని అంకితం ఇవ్వడం కంటే, తన పద్యాలను రాజులకు ధారపోయడం కంటే పొలం దున్నుకుని బతకటం గౌరవప్రదం’ అంటూ పోతన వర్ణించిన పద్యం పాలకులకు వ్యతిరేకంగా నాటి భక్తికవులు ఎన్నుకున్న తీవ్రనిరసనకు అద్దం పడుతుంది.

“మతం, ఈ ప్రపంచం యొక్క సాధారణ సిద్ధాంతం. మతం, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం యొక్క సారం.”
మనిషి తయారు చేసిన మతం ప్రాతిపదిక గురించి ఇంత ఔన్నత్యంతో మరే తత్వవేత్త సూత్రీకరించలేదేమో. మతం మత్తుమందు అంటూ మార్క్స్ ఇచ్చిన గంభీర నిర్వచనంపై, అదేదో మతంపై తిట్టుపదంలాగా నెగటివ్ వ్యాఖ్యానాలు చేసి దాని సారాంశాన్ని తోసిపుచ్చడం పరమ అభ్యంతరకరం.

“మానవ సారం (human essence) ఏ విధంగానూ నిజమైన వాస్తవికతను సంతరించుకోని పరిస్ధితుల్లో అది -మతం- మానవ సారం యొక్క అద్భుతమైన సాక్షాత్కారం (fantastic realization).”

ఇది మతంపై మార్క్స్ పరమోన్నత భావన. మత, ధార్మిక సాహిత్యాన్ని, మన పౌరాణిక, ఐతిహాసక కావ్యాలను భక్తి ఉద్యమ కారుల అమోఘ కృషిని ఈ నేపధ్యంలోనే మనం గ్రహించాలి. మధ్యయుగాల పాలకుల పీడనను, జీవన దుర్భరత్వాన్ని ఎదుర్కోవడానికి ఏ సాధనాలూ సమాజానికి లేనప్పుడు, తమ కష్టాలు, కన్నీళ్లు, వ్యధలను భగవంతుడనే అమూర్తభావన ముందు విన్నవించుకుంటూ నీవే దిక్కు అంటూ భక్తి తత్వాన్ని జీవన తత్వంగా మార్చుకున్న వారు, ‘భగవంతుడు మినహా ఇక ఎవరూ తమకు ఆదర్శం కారం’టూ పాలకుల రాజ్యాధికారాన్ని, దురహంకారాన్ని తృణీకరించడం మధ్యయుగాల్లో ప్రజలు చేపట్టిన వ్యవస్థా వ్యతిరేక తీవ్ర నిరసనగానే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా భక్తి ఉద్యమాలలోని ప్రగతి శీలాంశం ఇక్కడే ఉంది.

మత పరమైన దుఃఖం అనేది వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా వ్యక్తమయ్యే నిరసన కూడా.
ఇది మతం లోని అభ్యుదయాంశం.

మతం, ప్రపంచం యొక్క తలకిందులుగా ఉన్న చైతన్యం.
వాస్తవ ప్రపంచాన్ని తృణీకరించే క్రమంలో మానవ చింతనే తల్లకిందులు కావడం. జీవితంలోని దుర్భల పరిస్థితులకు వ్యతిరేకంగా ఎవరిపై, వేటిపై పోరాడాలో వారిపై, వాటిపై పోరాడటం కాకుండా తన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచాన్ని తృణీకరించడం. భ్రమాన్విత నిరసన మార్గం చేపట్టడం.
ఇది మతంలోని ప్రతికూల లక్షణం.

మతం మత్తుమందు. ఒక నిర్దిష్ట చారిత్రక కాలంలో యావత్ సమాజానికి అవసరమైన మత్తుమందు. వాస్తవ ప్రపంచంనుంచి మనిషిని పక్కకు నెట్టిన మత్తుమందు. పరిష్కార మార్గం లభ్యంకాని అలనాటి సమాజాలకు తప్పనిసరిగా దక్కిన మత్తుమందు.

మతంపై మార్క్స్ భావనను ఇలాగే నేను అర్థం చేసుకుంటున్నాను.

మార్క్స్ మతంపై తన ఈ సూత్రీకరణను ఏ నేపథ్యంలో పేర్కొన్నాడో మీరిక్కడ కోట్ చేసి ఉంటే బాగుండేదనకుంటాను.

ధన్యవాదాలు.
Posted by రాజశేఖర రాజు | డిసెంబరు 23, 2011, 10:52 ఏ ఎమ్
   
మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాదం గురించి ప్రభాకర్ సాంజ్‌గిరి గారు వ్రాసిన “మనిషి కథ” పుస్తకం చదివారా? సమాజాన్ని భావం కంటే భౌతికతే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. గొప్పగొప్ప డాక్టర్లు కూడా భావవాదమైన మతాన్ని నమ్ముతారు కానీ తమ ప్రాక్టికల్ జీవితంలో భౌతికవాదాన్నే ఆచరిస్తారు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా భౌతికతని నమ్మకపోతే ఏ పనీ జరగదు కదా. కర్మవాదం (fate theory) & దైవ నిర్ణయం (god’s will) లాంటి వాటిని నమ్మేవాళ్ళకి మతం వల్ల నష్టమే ఉంటుంది కానీ ఊహలలో మతాన్ని నమ్ముతూ ప్రాక్టికల్ జీవితంలో భౌతికతని ఆచరించేవాళ్ళకి మతం వల్ల నష్టం ఉండదు.

Posted by Praveen Sarma | డిసెంబరు 23, 2011, 1:48 సాయంత్రము

ప్రవీణ్, ‘మనిషి కధ’ చదివిన గుర్తు లేదు. దొరికితే చదవుతాను.
Posted by visekhar | డిసెంబరు 23, 2011, 5:58 సాయంత్రము

మార్టిన్ హీడెగ్గర్ గొప్ప నాస్తికుడే. కానీ పెట్టుబడిదారీ వర్గం వాళ్ళు మార్టిన్ హీడెగ్గర్‌ని ఎందుకు విమర్శించరు? నమ్మనిదాన్ని నమ్ముతున్నట్టు నటించడం ఇష్టం లేనివాళ్ళు పెట్టుబడిదారీ వర్గంలో కూడా ఉంటారు కదా. వీళ్ళ దృష్టిలో నమ్మకం పెద్ద సమస్య కాదు. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన అంటే ఒక వర్గంవాళ్ళకి నచ్చదు. దాని గురించి డైరెక్ట్‌గా చెప్పలేక మతం పేరుతో విమర్శిస్తారు. కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రోనాల్డ్ రీగన్, సద్దాం హుస్సేన్‌లు కూడా తాము ప్రైవేట్ ఆస్తి కోసమే కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకున్నారు కానీ మతం కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకోలేదు. కేవలం మతం పేరు చెప్పి కమ్యూనిజాన్ని విమర్శించేవాళ్ళు ఉన్నది ఇండియాలోనే.

Posted by Praveen Sarma | డిసెంబరు 23, 2011, 1:58 సాయంత్రము
http://teluguvartalu.com/2011/12/22/%E0%B0%AE%E0%B0%A4%E0%B0%82-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F-%E0%B0%AE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6/