జీవితం రెండున్నర దశాబ్దాలు దాటకముందే, జీవితం కోసం కంటున్న కలలు నెరవేరకముందే ఆ జీవితం అంతమవుతుందని ఎవరు ఊహించగలరు పాతికేళ్లు కూడా నిండని తరుణ్ సెహ్రావత్ సెరెబ్రియల్ మలేరియాకు గురై దాదాపు నెలన్నర మృత్యువుతో పోరాటం తర్వాత ఢిల్లీలోని అత్యంతాధునికమైన ఆసుపత్రిలో గత నెల 15న మరణించారు. చాలామంది ఇప్పటికీ నివాళి వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. ఆయన మావోయిస్టు ప్రాంతాల్లో తన పత్రిక తెహల్కా తరఫున ఫోటోలు తీయడానికి వెళ్లినందువల్ల మావోయిస్టు పార్టీ నివాళులర్పించింది. విప్లవకవులు, రచయితలు విషాదగీతికలు పాడుతూనే ఉన్నారు. ఆయన ఒక లక్ష్యం కోసం మరణించారని ఆయనకు తెహల్కా సంపాదకులతో సహా పలువురు జోహార్లు అర్పించారు. నిజంగా తరుణ్ తరుణ వయస్సులోనే అమరుడయ్యారు.
నిజానికి తరుణ్ ఒక లక్ష్యం కోసం ప్రాణాలర్పించారా లేక కార్యసాధనలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నందువల్ల మరణించారా అన్న విషయంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. చాలా మంది, మే«ధావులనుకునే వారు కూడా కొన్ని విషయాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోరు. జ్వరం వస్తే, లేక దెబ్బ తగిలితే అందుబాటులో ఉన్న మందులు వేసుకుంటారే కాని, కనీసం ఆ మందులకు కాలం చెల్లిందా లేదా అని కూడా పరిశీలించరు. జీవితం పట్ల ఆసక్తి లేనట్లు వ్యవహరించేవారు ఇతరుల జీవితాల గురించి ఎలా పోరాడుతారా అని ఆశ్చర్యం కలుగుతుంది.
తరుణ్ కూడా యుక్తవయస్సులో ఉన్న అత్యుత్సాహం వల్ల ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్‌లో పర్యటిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోనందువల్ల ఆ ప్రాంతంలో విస్తృతంగా ఉన్న మలేరియా, టైఫాయిడ్, జాండిస్‌లకు గురై మరణించారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా తనకు వచ్చిన జ్వరాన్ని పట్టించుకోకుండా ఆఫీసుకు వెళ్లి విధి నిర్వహించడం కొనసాగించారు. ఆ వ్యాధి క్రమంగా శరీరమంతా ప్రాకేవరకూ గమనించకుండా ఉండిపోయారు. కనీసం ఆయనకు ఆఫీసులో సలహాలిచ్చే వారు కూడా లేకపోయారు. తీరా ఆయనకు ప్రాణాంతక వ్యాధి వచ్చిన తర్వాత మేలుకొని అత్యంత ఖరీదైన ఆసుపత్రిలో చేర్పిస్తే మాత్రం ఫలితం ఏముంది మరణించిన తర్వాత జోహార్లు అర్పిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంది.
బస్తర్‌లో విస్తృతంగా పర్యటించిన జర్నలిస్టు రాహుల్, పండితా తరుణ్ సెహ్రావత్ మరణంపై బాధపడుతూనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భయానక జీవితాలను అనుభవిస్తున్న ఆదివాసుల జీవితాలను ఫోటోలు తీసే క్రమంలో తరుణ్ మరణించారని, నీళ్లు దొరక్క నానా కష్టాలు పడ్డారని, 40 కి.మీ నడిచారని, కప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో అడవుల్లో బహిరంగ ప్రదేశంలో పురుగులు కుడుతుండగా నిద్రించారని సంపాదకులు రాసుకోవడంపై మండిపడ్డారు. అబూజ్‌మాడ్‌లో పర్యటించడం అంత సాధారణ విషయం కాదని, నీరు అయిపోతే కనీస క్లోరిన్ టాబ్లెట్లు ఉపయోగించాలన్న విషయం కూడా తెలీకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను దట్టమైన అడవుల్లో ప్రయాణించేటప్పుడు దుస్తుల కన్నా దోమలనెదుర్కొనే మందులు, ఆంటీబయాటిక్స్, ఓఆర్ఎస్, గ్లూకోజ్ పొట్లాలు, పెయిన్ కిల్లర్ల్ వంటివాటిని ఎక్కువగా తీసుకువెళతానని చెప్పారు.
అవును.. ఒక ప్రాంతానికి వెళ్లేటప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందే సిద్ధమై ఉండాలి. తాను ఛత్తీస్‌గఢ్ వెళ్లినప్పుడు అక్కడి సిఆర్‌పిఎఫ్ జవాన్లు, మావోయిస్టులు అక్కడ నీటి గురించి, దోమల గురించి హెచ్చరించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న హిందూ పత్రిక విలేకరి రాశారు. ఢిల్లీలోనే ఛత్తీస్‌గఢ్ వెళ్లి మలేరియా వాతపడి, సకాలంలో చికిత్స పొంది మృత్యువునుంచి తప్పించుకున్న ఒకరిద్దరు జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. తరుణ్ కానీ, ఆయనను విధి నిర్వహణ కోసం పంపిన సంపాదకులు కానీ ఈ విషయంలో ప్రదర్శించిన అజ్ఞానమే ఒక నిండు ప్రాణం కోల్పోయేలా చేసిందనడంలో సందేహం లేదు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను, వారు దొరక్కపోతే ఆదివాసులను పిట్టల్లా కాల్పిచంపే ప్రభుత్వం అక్కడ ప్రబలిన ప్రాణాంతకమైన వ్యాధులపై మాత్రం పోరాడకపోవడం దారుణం. ముఖ్యంగా ఈ దేశంలో కలుషితమైన నీరు వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దేశంలో ప్రజల్ని అత్యధిక సంఖ్యలో హతమారుస్తున్నది నీరేనని రాహుల్ పండితా పుస్తకం 'హలోబస్తర్'కు వెనుకమాట రాసిన ప్రముఖ మావోయిస్టు మేధావి కోబడ్ గాంధీ అన్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రతి ఏటా మనదేశంలో నీటి సంబంధిత వ్యాధులకు గురై లక్ష మంది మరణిస్తున్నారు.
35 జిల్లాల్లో నీటిలో విషపదార్థాలు ఉండడం వల్ల 50 లక్షల మంది విషం వాతపడుతున్నారు. 205 జిల్లాల్లో నీటిలో అత్యధిక ఇనుము శాతం, 109 జిల్లాల్లో అత్యధిక నైట్రైట్ శాతం ఉంది. భారత రిజిస్ట్రార్ జనరల్ లెక్కల ప్రకారమే ప్రతి ఏడాదీ 14 లక్షలమంది పిల్లలు నివారించదగ్గ అయిదు జబ్బులకు గురై మరణిస్తున్నారు. త్రాగునీటిలో అత్యధిక శాతంలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల 6.5 కోట్ల మంది ఫ్లోరోసిస్ వ్యాధికి గురయ్యారని ప్రణాళికా సంఘం లెక్కలే చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలో మలేరియాను అరికట్టడంలో విఫలమవుతున్నామని ప్రణాళికా సంఘం అంగీకరించింది.
23 కోట్ల మంది ప్రజలకు కనీస పోషకాహారం అందడం లేదని అంచనాలు చెబుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణపై అతి తక్కువ ఖర్చు పెడుతున్న దేశం మనదే. యుఎన్ సహస్రాబ్ది లక్ష్యాల ప్రకారం జిడిపిలో 3 శాతం ఆరోగ్య సంరక్షణకు ఖర్చు పెట్టాల్సి ఉంది. అయితే జాతీయ స్థాయిలో జిడిపిలో కేవలం 1.4 శాతమే ఆరోగ్య సంరక్షణకు ఖర్చుపెడుతుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు జిడిపిలో 0.5 శాతం కూడా ఖర్చు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వాసుపత్రులు కూడా నిధులు లేక, పరికరాలు లేక శ్మశానాలుగా మారుతుంటే ప్రభుత్వ విధానాలు నకిలీ డాక్టర్లు, కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి.
రాజకీయ నాయకుల భద్రతకు, ఉద్యమాల అణిచివేతకు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరిపేందుకు ఖర్చుపెట్టే మొత్తంలో పావుభాగం ఆరోగ్య సంరక్షణకు ఖర్చు పెట్టినా పరిస్థితి ఎంతో మెరుగుపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అభివృద్ది అంటే ఆకాశ హర్మ్యాలు, మాల్స్, అయిదు నక్షత్రాల హోటల్స్ నిర్మించడం అనే దృక్పథం మానుకోవాలి. ప్రజలకు కనీస ఆరోగ్యం, ప్రాథమిక విద్య కల్పించలేని దేశం సాధించిన అభివృద్ది ఏమి అభివృద్ది అనేక గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, వైద్య వసతులు, డాక్టర్లు లభ్యం కావడంలేదని, ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, అసమర్థతే అందుకు కారణమని అధికారులే ఒప్పుకుంటున్నారు. ఆర్థికాభివృద్ది రేటుకూ ఆరోగ్య సంరక్షణకూ కూడా అవినాభావ సంబంధం ఉన్నదని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఒక రోగగ్రస్త దేశం అభివృద్ధి సాధించగలదా
తరుణ్ సెహ్రావత్ తన మరణం ద్వారా సాధించింది ఒకటున్నది. అది ఆదీవాసీ ప్రాంతాల్లో ప్రబలుతున్న భయంకరమైన వ్యాధుల గురించి దేశానికి తెలియజేయడం. ఢిల్లీలో ఒక ప్రముఖ పత్రిక ఫోటోగ్రాఫర్ మరణిస్తే అది కొంత చర్చనీయాంశంగా మారి ప్రభుత్వం తనలో కొంత కదలిక ఏర్పడ్డట్లు నటించడం సహజమే. తర్వాత మళ్లీ ప్రభుత్వం యధావిధిగా ఉదాసీనంగా మారుతుంది. ఇదే ఛత్తీస్‌గఢ్‌లో 19 మంది గిరిజనులను కాల్చిచంపితే ఢిల్లీలో అది అరణ్య రోదనగా మారింది. అదే విధంగా లక్షింపేటలో అయిదుగురు దళితుల ఊచకోత కూడా ఢిల్లీ పాలకుల చెవులకు వినపడలేదు. తమ కాళ్ల క్రిందకు నీరు వచ్చేంతవరకూ ప్రతిదాన్నీ చూసి చూడనట్లుండడం వారికి ఉన్న రోగం. ముందుగా ఈ రోగానికి చికిత్స చేయవలిసి ఉంటుంది.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
- ఎ. కృష్ణారావు
http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/jul/11/edit/11edit2&more=2012/jul/11/edit/editpagemain1&date=7/11/2012
No comments:
Post a Comment