Saturday, 14 July 2012

బస్తర్‌లో ఏం జరుగుతోంది


“ఈ దేశంలోని మధ్యతరగతి మనసు ఎంత కరుడుగట్టినా, పసిపిల్లలు అంటే ఎక్కడో కొంచెం మానవ స్పందన మిగిలిందేమోనన్న అనుమానంతో మీడియా మావోయిస్టులు పిల్లలను అడ్డుపెట్టుకోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు.”

రెండు నెలల కిందట బస్తర్‌లో జరిగిన కలెక్టర్ అపహరణ సందర్భంలో ఆ ప్రాంతం, అక్కడి ఉద్యమాల గురించి దేశ వ్యాప్తంగా, అలాగే మీడియాలో కూడా చర్చ జరిగింది. కలెక్టర్‌ను కిడ్నాప్ చెయ్యడం ఎంతవరకు సమర్థనీయమని దేశంలోని చాలామంది మధ్యతరగతి విద్యావంతులు ప్రశ్నించారు. మీడియా, హిందూ లాంటి వార్తా పత్రికతో సహా రాజ్యం ఏ పరిస్థితుల్లో రాజీపడకూడదని ‘ఢీలా రాజ్యం’గా (Soft State) ప్రవర్తించకూడదని, ఇది ‘కఠినమైన రాజ్య’మనే సందేశం మావోయిస్టు పార్టీకి, ఇతర ప్రజలకు అర్థమయ్యేలా ప్రవర్తించాలని సలహాలు వచ్చాయి.

ఈ కిడ్నాప్ ఉదంతాన్ని మీడియా తన టీఆర్ పీ రేటింగ్‌ను పెంచుకోవడానికి కొంత రసవత్తరంగానే నడిపించింది. ఇంతకి బస్తర్‌లో పరిస్థితి కిడ్నాప్‌ల దాకా ఎందుకు వచ్చిందని కాని, అక్కడ గిరిజనుల స్థితిగతులు ఎలా ఉన్నాయని కాని, రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక హక్కులు గిరిజనులు అనుభవిస్తున్నారా లేదా అని కాని చర్చ జరగలేదు. అంతకుమించి మన్మోహన్ (ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వర్తిస్తున్నారు) చిదంబరం, కపిల్‌సిబాల్ ఒక్కొక్కరు అభివృద్ధి నమూనా మహాభిమానులు. వాళ్లు చెప్పే అభివృద్ధి ఎవరి కోసం ఈ అభివృద్ధిలో బస్తర్ గిరిజనుల పాత్ర ఉందా వాళ్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న అడగడం మానేశారు.

రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చిన హక్కులను పూర్తిగా కాలరాశారు. ఈ పరిస్థితే అందమైన, ఆహ్లాదకరమైన బస్తర్‌ను విపరీత సంక్షోభంలోకి నెట్టడంతో శాంతిని, ప్రకృతిని ప్రేమించే ఆదివాసీలు ఆయుధాలు పట్టుకోవలసి వచ్చింది. ఆయుధాలు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అడగడానికి మీడియా సాహసించడం లేదు. ఆ ప్రశ్న అడిగితే ఏ కార్పొరేటు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా రో, ఆ కార్పొరేటు మూలాలు కదులుతాయన్నది మీడియాకు తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రశ్నలను అడగడమే కార్పొరేటు పక్షాన జవాబులు వచ్చేలా తయారు చేస్తారు. ఉదాహరణకు నాలుగు రోజుల కిందట బస్తర్‌లో జరిగిన మానవహననంలో 20మంది అమాయక గిరిజనులు హత్య గావించబడ్డారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నా రు. ఈ దేశంలోని మధ్యతరగతి మనసు ఎంత కరుడుగట్టినా,పసిపిల్లలు అంటే ఎక్కడో కొంచెం మానవ స్పందన మిగిలిందేమోనన్న అనుమానంతో మీడియా మావోయిస్టులు పిల్లలను అడ్డుపెట్టుకోవడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నను సంధించడం మొదలుపెట్టారు. నిజానికి బస్తర్‌లోని బీజాపూర్‌లో జరిగిన హత్యాకాండలో ఇది కీలకమైన ప్రశ్నేనా మొత్తం సంఘటనలో మావోయిస్టులు అక్కడ లేరని గిరిజను లు భూమిపూజ పండుగ జరుపుకుంటున్నారని, సాయుధ బలగాలు తప్పుడు సమాచారం వలన అక్కడికి అర్ధరాత్రి చేరుకుని కాల్పులు జరిపారని హిందూ పత్రిక మూడు రోజులు వరుసగా వార్తలు రాస్తున్నా, స్వయాన కాంగ్రెస్ పార్టీ సభ్యులే నిజనిర్ధారణ కమిటీ వేసి, చిదంబరం పోలీసు చర్యలను సమర్థిస్తూ చేసిన ప్రకటనను ఖండిస్తూ ఒక ప్రకటన చేసినా, దాని మీద జరగవలసినంత చర్చ జరగడం లేదు.

ఇప్పుడు కేంద్ర గిరిజన శాఖామంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇది బూటకపు ఎన్‌కౌం టర్ అని హిందూ పత్రికకు ఇచ్చిన ఒక వివరణాత్మక ఇంటర్వ్యూలో అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల లోతుకు వెళ్లడానికి సిద్ధంగా లేదు, సరికదా తప్పు డు ప్రశ్నలు, సమాచారాన్ని వక్రీకరించి అందించడంవల్ల ఒక సాధారణ మధ్యతరగతి మనిషి మొత్తం మావోయిస్టు ఉద్యమం పట్ల ముఖ్యంగా గిరిజన పోరాటాల పట్ల ఒక శాస్త్రీయ, లేదా ప్రజాస్వామ్య దృక్పథాన్ని అవలంబించలేకపోతున్నాడు. ఇప్పటికైనా విద్యావంతులు మీడియాలో వచ్చిన వార్తలే కాక సరైన సమాచారం సేకరించడానికి కొంత శ్రమపడాలి. కనీసం మీడియా ఇచ్చిన సమాచారాన్ని విమర్శనాత్మకంగా చూడడం అలవాటు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇది చాలా అవసరం.

కారణం ఏదైనా ఈసారి ఛత్తీస్‌గఢ్ సంఘటన పాలకుల మధ్యే తీవ్ర విభేదాలకు దారి తీసింది. అంతకుముందు బస్తర్ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడని లేదా భయంతో బతుకుతున్న కాంగ్రెస్ సభ్యులు నిజనిర్ధారణ కమిటీ వేసి మొత్తం ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చారు. ఈ విషయం మణిశంకర్ అయ్యర్ బాహాటంగానే అంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌పార్టీ, ఆ పార్టీ సభ్యులు, కేంద్ర గిరిజనమంత్రి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కేంద్ర వ్యవసాయ సహాయమంత్రి అందరూ ఇది బూటక ఎన్‌కౌంటరని అంటున్నారు. చిదంబరం మాత్రం సంఘటన జరిగిన మరుక్షణమే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అని తేల్చేశారు. కేంద్ర హోంమంవూతి గా తమ బలగాలు ఏది చేసినా సమర్థించడం ఆయన తన బాధ్యతయని అనుకోవచ్చు. కానీ వాస్తవాలకు కూడా కొంత బలముంటుంది. ఈ వాస్తవాల వల్ల అంతిమంగా సాయుధ బలగాల, హోంమంవూతితో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీదే ప్రజలు విశ్వాసం కోల్పోతే జరిగే ప్రమాదం సామ్రాజ్యవాద పెట్టుబడికి దాసోహం అంటున్న హోంమంత్రికి అర్థమైనా కావడం లేదు, లేదా స్వామి భక్తి ఒక తదాత్మన స్థితికి చేరుకొని ఆదిశంకరుడి భ్రాంతి మధ్యనైనా చిక్కు కుని ఉండాలి.

కిశోర్ చంద్రదేవ్ గిరిజన మంత్రిగా, స్వయాన గిరిజనుడు కావడం వల్ల, నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడిన ఉత్తరాంధ్రవాసిగా కొన్ని వాస్తవాలు నిర్భయంగా, నిజాయితీగా ప్రకటించాడు. అంతేకాక కొన్ని మౌలిక ప్రశ్నలు కూడా అడిగారు. సంఘటన తీవ్రవాదులకు పోలీసులకు మధ్యే జరిగి ఉంటే ఆయుధాలులేని వాళ్లు చాలామంది అక్కడ ఎందుకున్నారు నిరాయుధులైన మనుషులపైన సాయుధ బలగాలు కాల్పులు జరపకూడదన్న నియమం ఏమైంది అర్ధరాత్రి కాబట్టి ఏది అగుపించలేదు అని అంటే అర్ధరాత్రి పేరుతో విచ్ఛలవిడిగా సాయుధ బలగాలు కాల్పులు జరపవచ్చునా ఒకవేళ తీవ్రవాదులే గిరిజనులను సమీకరిస్తే గిరిజనులకు తగిన రక్షణ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వమున్నప్పుడు, వారు తమ ప్రాణాలను బలి ఇవ్వవలసిందేనా అయితే కిశోర్ చంద్రదేవ్ చాలామంది అంటున్నట్టే గిరిజనులు ఇటు సాయుధ బలగాల అటు మావోయిస్టుల మధ్య చిక్కుకుపోయారని అంటూ- తాను మొదటి నుంచి కిరాతకమైన సల్వాజుడుంకు వ్యతిరేకమన్నారు.

సల్వాజుడుంను ప్రజల మీదికి వదలడం వల్ల గిరిజనుల మధ్యే ఘర్షణ పెరిగి ఒకరికొకరు చంపుకోవడం వల్ల తీరా ప్రాణాలు కోల్పోతున్నది గిరిజనులే అని అన్నారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా కొన్ని మౌలికమైన అంశాలపై కూడా వ్యాఖ్యానించారు. తీవ్రవాదం ఒకరకంగా శాంతి భద్రతల సమస్యే అయినా, దీని మూలాలకు వెళ్లవలసి ఉంటుంద ని, మూలాలకు వెళ్లకుండా సమస్య పరిష్కారం కాదన్నారు. దీని మూలాలు ఖనిజాలలో ఉన్నాయని, ఈ ఖనిజ సంపదను బయటికితీసే క్రమంలో గిరిజనుల జీవితాలను క్రమక్షికమంగా విధ్వంసం చేస్తున్నాయని, పరిష్కారం గిరిజనులకు అడవిపై, అక్కడి భూమిపై హక్కులను పునరుద్ధరించి, ఖనిజాలను ఇతరులకు అప్పగించే ముందు గిరిజనులకు సంపదపై ఉండే హక్కులను గుర్తించాలని, లేకపోతే వాళ్లు నిరాక్షిశయులే కాక రాజ్యపరిధి నుంచి బయటికి నెట్టివేయబడతారని అన్నారు. అంతేకాక ఒక అభివృద్ధి చెందుతున్న దేశం తమ ఖనిజ సంపదను ఇతర దేశాలకు విచ్ఛలవిడిగా అప్పగించడం వల్ల మనదేశ అవసరాలకు ఖనిజాలు ఏవీ మిగలవని, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించడమే కాక వేలాది సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న గిరిజనులను కాదని మనం ఏంచేసినా అది వాళ్ల సహజ హక్కులను హరించడమవుతుందని అన్నారు.

ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత, సామ్రాజ్యవాద నీలినీడలు ఈ దేశంలో పరుచుకుంటున్న కాలంలో బహుశా అధికారంలో ఉన్న ఏ మంత్రి కాని, రాజకీ య నాయకుడు కాని ప్రతిపక్షపార్టీ కాని, కొత్తగా ఎదిగిన మాయావతి లాంటి నాయకురాలు కాని ఇంత స్పష్టంగా మాట్లాడడం నేను చూడలేదు. నిజానికి బస్తర్‌లో మావోయిస్టు పార్టీ చేస్తున్నదల్లా అక్కడి గిరిజనుల జీవన్మరణ పోరాటానికి మద్దతునిచ్చి వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతున్నది. ఈ ఒక్క అంశం తప్పించి ఆ ఉద్యమం మీద అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో మావోయిస్టు పార్టీ వైఫల్యం కూడా కొంత ఉంది. ఎంతసేపు మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సాయుధ పోరాటం గురించి, తమ సైన్యాన్ని గురించి మాట్లాడినంతగా తమ పార్టీకుండే మానవీయ కోణం గురించి చెప్పకపోవడం వల్ల బయట జరిగే ప్రచారానికి ఎక్కువ స్పందన వస్తున్నది.ఈ దేశసంపద ఈదేశ ప్రజలది. ఈ దేశ అట్టడుగు ప్రజలు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించి,ఒక సుందరమైన సమాజనిర్మాణం స్వప్నమని, మధ్య తరగతి అనుభవిస్తున్న సంక్షోభానికి, మానవ సంబంధాలు కూలిపోతున్న సందర్భానికి ప్రత్యామ్నాయ మానవీయ సమాజం సాధ్యమే అనే విశ్వాసం కలిగించగలగాలి. ఆ ఉద్యమం నిర్వహించవలసిన పాత్ర కూడా అదే. ఈ విషయాన్ని బస్తర్‌లో మావోయిస్టు పార్టీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది. బస్తర్ ‘మారణహోమం’ ఏ కారణం వల్లో ఒక లోతైన చర్చకు దారి తీయడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి చర్చే తెలంగాణ ఉద్యమంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది.

- ప్రొఫెసర్ జి.హరగోపాల్

http://prajakala.org/mag/2012/07/bastar#more-789
సౌజన్యం
నమస్తే తెలంగాణ దిన పత్రిక
చిత్రం హిందూ దిన పత్రిక

No comments:

Post a Comment