Saturday, 14 July 2012

అబూజ్‌మాడియాలకు ముప్పు!


మధ్యభారతంలో ప్రస్తుతం నెలకొనివున్న యుద్ధవాతావరణం అబూజ్‌మాడ్‌లో పెనుసంక్షోభాన్ని సృష్టించింది. ఇంతకాలం ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడు తూ స్వేచ్ఛగా, దర్జాగా బతికిన మాడియా గోండులు ఏ క్షణం ఏం జరుగుతుం దో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకురానుందో తెలియక భయంభయంగా బతుకుతున్నారు. ఉధృతంగా సాగుతున్న మావోయిస్టుల కార్యకలాపాలు, ఆ కార్యకలాపాల అణచివే త పేరిట కేంద్ర, రాష్ట్ర బలగాల ముప్పేట దాడులు కలిసి వారి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.శిక్షణ స్కూలు నెపంతో గుట్టల అంచున భారత సైన్యం పాగావేసింది. అనుని త్యం ఆకాశంలో హెలికాప్టర్లు,మానవరహిత విమానాలు ఎగురుతున్నాయి. సరుకుల కోసం సంతకు వెళ్లిన వ్యక్తులు అదృశ్యమవుతున్నారు. సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు తరచూ వేల సంఖ్యలో కదిలివచ్చి గ్రామాలపై దండెత్తి గుడిసెలను తగులబెడుతున్నాయి. దొరికిన వారందరినీ చితకబాదడం, పారిపో ప్రయత్నిస్తే విచక్షణారహితంగా కాల్చడం, ఆడవాళ్లపై అత్యాచారాలు సర్వసాధారణమయ్యాయి. ఇంకోవైపు, ఇటీవల బలగాలు నిర్వహించిన ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్‌ల అసలు లక్ష్యం మాడ్‌వాసులను భయపెట్టి గుట్టలపై నుంచి పారదోలడమేనంటున్నారు.

మరో రెండేళ్లలో ఈ ప్రాంతాన్ని నేరుగా సైన్యమే ఆక్రమించుకుని వామపక్ష తీవ్రవాదంపై భవిష్యత్తులో చేయబోయే అంతిమయుద్ధంలో హెడ్‌క్వార్టర్స్‌గా ఉపయోగించుకోనుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన తెగ గా గుర్తింపు పొంది న అబూజ్‌మాడియాల అస్తిత్వానికి ప్రమాదమేర్పడిందని పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మూలవాసులకు(ఇండియన్లకు) తెల్లజాతి చేసిన అకృత్యాలు, అన్యాయాలకు గాను బేషరతుగా అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్న కాలంలో భారత పాలకులు ద్రవిడులందరి పూర్వీకులుగా భావిస్తున్న మాడి యా తెగపై యుద్ధం ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

మావోయిస్టులపై నిర్ణయాత్మక యుద్ధం చేయాలని కేంద్రం నిశ్చయించడానికి బలమైన కారణాలున్నాయి. 1990ల తర్వాత ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో అనేక బహుళజాతి కంపెనీలు మధ్యభారతంలో తిష్ఠ వేశాయి. అక్కడ అపారంగా ఉన్న ఖనిజవనరులపై లెక్కలేనన్ని ఎంఓయూలను కుదుర్చుకున్నాయి. 2009 సెప్టెంబర్ నాటికి ఈ ఎంఓయూల విలువ 8లక్షల 73వేల 896 కోట్లకు చేరింది. 170 చట్టాన్ని అపహాస్యం చేస్తూ గనుల పేరిట, కర్మాగారాల పేరిట, విద్యుత్‌ప్లాంట్ల పేరిట జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో వేలాది ఎకరాల ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం మొదలైంది. అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతాల్లో ప్రాబల్యశక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది.పనులు మొదలైన ప్రతిచోటా ప్రతిఘటనా పోరాటాలు చేపట్టింది. కార్పొరేట్ ఆస్తులపై, సిబ్బందిపై దాడులు చేసింది. ఫలితంగా అనేక ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి.

ఈ పరిస్థితిని బేరీజు వేసుకున్న కంపెనీలు మావోయిస్టుల మూలంగా తమ పెట్టుబడులకు పొంచివున్న ప్రమాదం గురించి అగ్రరాజ్యం తో, ప్రపంచబ్యాంకుతో, భారతవూపభుత్వంతో మొరపెట్టుకున్నాయి. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించకుండా దేశ ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమని నానా యాగీ చేశాయి. దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు వామపక్ష తీవ్రవాదమేనని ప్రకటిస్తున్న ప్రధాని మన్మోహన్, హోంమంత్రి చిదంబరంల వ్యాఖ్యలను మనం ఈ నేపథ్యంలోనే చూడాలి. గ్రీన్‌హంట్ కార్యక్షేత్రం కూడా మధ్యభారతమే కావడం కూడా యాధృచ్ఛికం కాదు. మన ప్రధాని అమెరికా యాత్ర, ఆ తర్వాత మిలిటరీ నిపుణులతో కూడిన అమెరికా బృందం ఇక్కడికి వచ్చి ఢిల్లీ, రాయ్‌పూర్‌లలో మంతనాలు సాగించడం ఫలితంగానే గ్రీన్‌హంట్‌కు రూపకల్పన జరిగిందని మావోయిస్టు పార్టీ ఆరోపించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. మొన్నటి వరకు జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో, ఈశాన్యంలో వేర్పాటువాదులతో పోరాటంలో తీరిక లేకుండా ఉన్న సైనిక, పారామిలిటరీ బలగాలు ఇటీవల అక్కడ పాక్షికంగా ప్రశాంత పరిస్థితులు ఏర్పడి మరోచోట మోహరించడానికి సిద్ధంగా ఉండడం ఇందుకు అనుకూలించింది.

అలా 2009 సెప్టెంబర్‌లో గ్రీన్‌హంట్ మొదలైంది. జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో కూడా బలగాల మోహరింపు జరిగినపప్పటికీ ఈ ఆపరేషన్ ప్రధాన దిశ ను మాత్రం బస్తర్ వైపు, అదీ అబూజ్‌మాడ్ కొండలవైపు కేంద్రీకరించారు. ఈ ప్రాంతాన్ని సర్వే చేయించడంతో పాటు తొలిసారిగా మానవరహిత విమానాలను ప్రవేశపెట్టారు. వాయుసేన హెలికాప్టర్ల సహాయాన్ని తీసుకున్నారు. ఒక్క బస్తర్‌లోనే 60వేల పారామిలిటరీ, పోలీసు బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టుల ముద్రవేసి అమాయక గిరిజనులను డజన్ల కొలది బలితీసుకున్నారు. సల్వాజుడుం ముసుగులో బీభత్సకాండ సృష్టించారు. అయినప్పటికీ గ్రీన్‌హంట్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది.ఉద్యమం బలహీనపడకపోగా, ఏరియా, జిల్లా స్థాయిల్లో జనతన సర్కార్లు ఏర్పడి బస్తర్ సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను శాసించే స్థితికి ఎదిగాయి. గెరిల్లాల సంఖ్యతో పోల్చితే ప్రభుత్వ బలగాలకు చెందిన జవాన్లే అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ముఖ్యంగా, చింతల్నార్ తదితర ఘటనల్లో భారీ సంఖ్యలో జవాన్లను కోల్పోతుండడంతో కేంద్రం ఆలోచనలో పడి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. చిదంబరం లాంటివాళ్లు నేరుగా సైన్యాన్ని రంగంలోకి దింపాలని వాదించగా, ఆంటోనీ తదితరులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అంతా కలిసి మధ్యేమార్గాన్ని ఆమోదించారు. గ్రీన్‌హంట్ రెండవ దశను ప్రకటించారు.మూడేళ్లుగా గ్రీన్‌హంట్ నుంచి నేర్చిన పాఠాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం వారిని అబూజ్‌మాడ్‌పైన కేంద్రీకరించేలా చేశాయి. ఈ కొండలను స్వాధీనం చేసుకోవడం ద్వారా బస్తర్ ఉద్యమాన్ని రక్షణలో పడవేయాలని తీర్మానించారు. అయితే, భవిష్యత్తులో అనుసరించేందుకు సైన్యం ప్రధాన పాత్రగా పకడ్బందీ పథకాన్ని రూపొందించారు. బస్తర్ డివిజనల్ కేంద్రం జగ్దల్‌పూర్‌లో 15 వేల సైన్యంతో ఆర్మీ సబ్ ఏరియా కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ను, భిలాయ్ సమీపంలో వాయుసేన స్థావరాన్ని, బిలాస్‌పూర్‌లో బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌ను, అబూజ్‌మాడ్‌పై సైనిక శిక్షణ స్కూలును ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. 2011జూన్‌లో 3వేల మంది సైనికులు స్కూలు ఏర్పాటులో భాగం గా కొండగాంకు వచ్చి మకాం చేశారు. వీరు ఏర్పాటు చేసుకున్న శిబిరానికి అప్పటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్ సైతం వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలికాప్టర్ నుంచి మాడ్ టెర్రయిన్‌ను సైతం పరిశీలించారు.

దీన్ని చూస్తే సమీప భవిష్యత్తులో మావోయిస్టులపై సైన్యాన్ని ప్రయోగించే సూచనలు కనబడుతున్నాయని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. శిక్షణలో ఉన్న సైనికులు మావోయిస్టులపై ఎలాంటి చర్యలూ చేబట్టబోరని సైన్యాధికారులు పదే పదే స్పష్టం చేస్త్తున్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదని వారంటున్నారు. సుమారు 800 చ.కి.మీ.ల స్కూలు పరిధిలోని అడవుల్లో సంచరించే సైనికులకు మావోయిస్టులు తారసపడ్డా లేక శిక్షణార్థులు హద్దులను దాటి అవతలకు వెళ్లినా ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్పదని వివరిస్తున్నారు. కార్యకలాపాల నిబంధనావళి ప్రకారం ఆర్మీకైనా, వాయుసేనకైనా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపే వెసులుబాటు ఉంది. కనుక ఏం జరగనుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదంటున్నారు. అబూజ్‌మాడ్ కొండలను భూతలం నుంచి క్షుణ్ణంగా రెక్కీ చేయడం కోసమే ఈ స్కూలును ఏర్పాటు చేశారన్న వాదన కూడా ఉంది. ఈ పరిణామాల ను పరిశీలిస్తే మరో రెండు మూడేళ్లలో మాడ్‌లో పూర్తిస్థాయి సైనికచర్య జరగనుందని అంచనా వేయవచ్చు. అప్పుడు అబూజ్‌మాడియాల భవిష్యత్తు ఏమిటన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. స్కూలు పేరుతో వారి మాతృభూమిలో ఐదవ వంతు భూభాగా న్ని లాక్కోనున్న పాలకులు ఈ లోపే వారిని తమ ఊళ్ల నుంచి తరిమివేసేందుకు పథకాలు రూపొందిస్తున్నారు.

మాడ్ గోండుల అస్తిత్వానికి ముప్పు తెచ్చే పాలకుల కుట్రను ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలి. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు, ప్రజా వ్యతిరేకులని ప్రభుత్వా లు భావించి, వారిని నిర్మూలించడమే తమ విధానమని ప్రకటించినా ఆ కోపాన్ని అమాయక ఆదివాసులపై, ఓ అరుదైన ప్రాచీన తెగపై చూపించడం అన్యాయం. నక్సలైటు ఉద్యమం శాంతిభవూదతల సమస్య కాదని, సామాజిక, ఆర్థిక కారణాలే ప్రజలను, యువతీ యువకులను మావోయిజం వైపు నెడుతోందని పలు కమిటీలు ఇప్పటికే తేల్చాయి. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. మావోయిస్టు సమస్యకు శాంతిచర్చలే పరిష్కార మార్గమని స్వామి అగ్నివేశ్ లాంటివాళ్లు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయినప్పటికీ పాలకులు కన్ను తెరవకపోవడం దురదృష్టకరం. మావోయిస్టులకు ప్రజల మద్దతే లేకపోతే ఎన్ని వేల బలగాలను దించినా ఉద్యమం బలహీనపడకపోగా కొత్త ప్రాంతాలకు ఎందుకు విస్తరిస్తున్నదో పౌర సమాజం ఆలోచించాలి. అమాయక ఆదివాసీలపై బలగాల దమనకాండను ముక్తకం ఖండించాలి. బాసగూడెం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.

-డి. మార్కండేయ
dmknamaste@gmail.com

http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=127427


No comments:

Post a Comment