Sunday, 29 April 2012

నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు

శివసాగర్ కవిత్వం, కొండపల్లి సీతారామయ్య(కెఎస్) పై సంచలన వార్తలు, త్రిపురనేని మధుసూదనరావు (టీఎమ్మెస్) మాటలు, గద్దర్ పాటలు - మా యువతరాలను మండించిన కాలం ఒకటుంది. పై నాలుగింటిలో ఆఖరు మూడు ఇంధనాలు నేరుగా మాలో విప్లవావేశం రగిలిస్తే, శివసాగర్ కవిత్వం రోడ్ల పక్క జనసందోహం మధ్య గోడలమీద నుంచి నిలువెత్తు నినాదాలై భావావేశంలోకి లాక్కుపోయేది.

కసితో స్వార్థం శిరస్సు  గండ్రగొడ్డలితో నరకగల్గినవాడే
నేటి హీరో

ప్రజల గుండెల కొండల్లో మాటు కాసి
ట్రిగ్గర్ నొక్కగలిగిన వాడే  ద్రష్ట

ప్రజల్ని సాయుధం చేస్తున్న  రివల్యూషనరీ
నేడు కవి (' మైక్రోస్కోపిక్ 'నుంచి )

అలలు కనే కలలపైన నిఘా!  అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!

అలల నెవ్వరడ్డగలరు  కడలి నెవ్వడాపగలడు ('అలలు' నుంచి)

పులి గుహలోకి వెళ్ళ సాహసించిన వాడే
పులి పిల్లను పట్టి తెస్తాడు  వెయ్యి కత్తి వేట్లకు జంకని వాడే
రాజుని పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు (ఉద్యమం నెలబాలుడు నుంచి )

ఉరికంబం  మీద నిలిచి  ఊహాగానం  చేసెద

నా ఊహల  ఉయ్యాలలోన  మరో జగతి
ఊసులాడు (భూమయ్య కిష్టగౌడ్‌లకు ఉరిశిక్ష విధించినపుడు)

న్యాయమూర్తులంగారూ!  సూర్యోదయం కుట్ర కాదు
సూర్యుడు కుట్రదారుడు కాదు

శ్రీకాకుళం సూర్యోదయం కుట్ర కాదు
గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు
(పార్వతీపురం కుట్రకేసులో కోర్టు స్టేట్‌మెంట్)



ఈ కవితా నినాదాల ఆకర్షణ నుంచి బయటపడలేక, పడలేక, వాటిని మళ్లీ మా హాస్టల్ గోడలమీద, గదుల లోపలిగోడలమీద రాసుకునేవాళ్లం. వాటిని చూస్తూ చూస్తూ కాగి మసలుతుండేవాళ్లం. కానీ కేఎస్ గురించి తెలిసినంతగా, టీఎమ్మెస్ గురించి తెలిసినంతగా, గద్దర్ గురించి తెలిసినంతగా, శివసాగర్ గురించి తెలీదు. ఎందుకంటే ఆ నినాదాల కింద పీపుల్స్‌వార్ అనీ, రాడికల్ విద్యార్థి సంఘం అనీ రాసేవారు. మేము కూడా అలానే రాసుకుపోయేవాళ్లం. కవిత్వంలోని నిగూఢత లాగే, రహస్యోద్యమంలోని నిగూఢత లాగే, ఆ కవి కూడా పరమ నిగూఢంగా ఉండిపోయాడు

విద్యార్థి దశ దాటింది. ఈ లోగానే కొందరం కవులుగా, కొందరం విప్లవకారులుగా మార్పు చెందాము. కొంతకాలానికి... ఉద్యమం లోపలేదో గడబిడ . కేఎస్ పేరుతో పాటు, ఎస్ఎమ్ అని మరో పేరు వినిపించేది, అప్పటికీ ఎస్ఎం అంటే సత్యమూర్తి అనీ, సత్యమూర్తి అంటే శివసాగర్ అనీ ఎవరూ తెలపలేదు. మేమూ అడగలేదు. అది రహస్యోద్యమం కదా! ఉత్తేజం మాత్రమే ప్రవహిస్తుంది చేగువేరాలా.
ఇంతలో 'ఉదయం' దినపత్రికలో కేజీ సత్యమూర్తి ఇంటర్వ్యూ సీరియల్‌గా రాసాగింది. అప్పటికి గానీ మామూలు మనుషుల్ని విప్లవకారులుగా మార్చిన నినాదాలు శివసాగర్‌వనీ, ఆయనే కేజీ సత్యమూర్తి అనీ తెలిసిరాలేదు.

అజ్ఞాతం లోంచి...
హౖౖెదరాబాద్‌లోని అంబర్‌పేట రాణాప్రతాప్ హాలులో విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది సభలు. కేజీ సత్యమూర్తి అజ్ఞాతం వీడినట్లు రేడియో వార్తలు మాలో అల్లుకుంటుండగా, నేరుగా ఆయనే సభల ముఖద్వారం వద్ద ప్రత్యక్షమయ్యారు. అది తెలిసి లోపల్నుంచి పరుగులు తీశాం. ఆయనే.. శివసాగరే...శివసాగరే...శివసాగరే. ఉద్విగ్నులమయ్యాం. వివశులమయ్యాం. కావిలించుకునేంత పని చేశాం..

ఆ రోజు రాత్రి మొదలై, మరుసటి రోజు తెల్లవారేదాకా ఆయనపై జనరల్ బాడీ. దాదాపు సభ్యులందరూ ఆయనపై నోరు చేసుకున్నారు. తప్పులు ఎత్తి చూపారు. చివరకు తన వంతు బదులు చెప్పుకునే అవకాశం ఆయనకు వచ్చింది. అపుడు గంటల కొద్దీ ఆయన చేసిన ప్రసంగంలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏవీ నాకు ఇప్పుడు పెద్దగా గుర్తు లేవు. ఆరోపణలు, ప్రత్యారోపణలు అసలే గుర్తులేవు. కానీ ఆ ప్రసంగంలో 'ఆర్టిస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ పొయిట్రీ' గురించి ఆయన చెప్పిందే గుర్తుండిపోయింది. జీవితంలోని వివిధ సందర్భాలను కవిత్వంలోకి ఎలా తర్జుమా చేయాలనేది దాని సారం. అంతసేపూ ఆరోపణలు గుప్పించిన వారు కూడా మంత్రముగ్ధులై అది విన్నారు. విప్లవకారులు ప్రేమ గురించి ఎందుకు రాయరు, ఎన్నో చీకటి కోణాలను ఎందుకు పట్టించుకోరు అని ఆయన వేసిన ప్రశ్నలు మాకు చాలా ప్రయోజనం కలిగించాయి.

'ప్రమాద సంగీతం' అలా పుట్టిందే
ఆ ప్రశ్నలు వెంటాడాయి. విప్లవ కవిత్వంలో మొనాటనీ బ్రేక్ చేయవలసిన అవసరం తెలిసింది.

ప్రేమలు నిజమే, ప్రేమల పంచవన్నెల రామచిలక నిజమే
ప్రేమల ధృవాల మధ్య నగరాలు తగలబడిపోయే ఆకర్షణ నిజమే
రాజకీయాలు లేని ప్రేమలు నమ్మలేము- ('ప్రేమజెండా' నుంచి)

ఇలాంటి కవిత అనంతరకాలంలో రూపుదిద్దుకుంది. అప్పటిదాకా జీవితంలో విస్మరించిన అంశాలను కవిత్వం చేయసాగాము. కొత్తది ఏదైనా ఎక్కడినుంచో ఊడిపడదు. నా ప్రమాద సంగీతం కవిత్వం అలా రూపుదిద్దుకున్నదే, మరి కొందరి కవిత్వంలాగా.

ప్రతి ఒక్కరికీ ఒక అదృష్టం తలుపు తడుతుంది. అది నా తలుపూ తట్టింది. సోవియట్ రష్యా పతనం, తూర్పు యూరప్ పరిణామాలు, తాజాగా పీపుల్స్‌వార్‌పై నిషేధం, విప్లవపంథాలో చీలికలు. అష్టకష్టాలకాలం. అదే సందర్భంలో నా పుస్తకం 'ప్రమాద సంగీతం'గా వచ్చింది. గుంటూరులో విరసం సభలు. విప్లవ రాజకీయవివాదాల మధ్య శివసాగర్ విరసం వేదిక ఎక్కారు. నా కవిత్వం ఆవిష్కరించారు. ఆ వేదికకు ఆయన రావడం అదే ఆఖరు. ఇన్ని వివాదాల వల్ల.. ఆ ఆవిష్కరణే రాష్ట్ర వ్యాప్త వార్తలా వచ్చింది.

'హో' సభకు శివసాగర్
మన కాలం వీరుడు త్రిపురనేని శ్రీనివాస్ ప్రమాద మరణం తరువాత అతడి పుస్తకం హో తెచ్చాం. ఆ పుస్తకం ఒక సంచలనం, ఆ పుస్తక సభ మరో సంచలనం. సభికులకు ఎద్దు బిరియాని వడ్డిస్తున్నట్లు తిరుపతిలో కరపత్రాలు పంచాం. రాష్ట్రంలో ముఖ్యప్రాంతాలకు పంపిణీ చేశాం. ఆ సభలో శివసాగర్ 'దళిత సౌందర్యశాస్త్రం' ఉపన్యాసకుడు. దళిత సాహిత్యం కుప్పలుతెప్పలుగా వచ్చిన ఎంతో కాలానికి ఈ కింది కవితలు రాసినా, నవ యవ్వనుడిగా ఆ సాహిత్యానికి అంత వయసులోనూ నాయకత్వం వహించి, తెలుగుసాహిత్యంలో దళిత సౌందర్యశాస్త్రానికి తొలి గురువు అయ్యారు.
మండే మాదిగ డప్పులా  ఉదయిస్తోన్న సూరీడుపై
చిర్రా, చిటికెన పుల్లా తీసుకుని తొలకరి పాటకు దరువేస్తున్నాను
(మండుతోన్న మాదిగడప్పు నుంచి)

కాలం కసాయి కత్తిమీద నిలబడి  గర్జిస్తున్న ఛండాలుడు
ఆది శంకరునిపై నాలుగు వేట కుక్కల్ని  ఉసిగొల్పుతున్నాడు

ఓహో..!  ఇప్పుడు నడుస్తున్న చరిత్ర
పరమ ఛండాల చ రిత్ర (దళిత మేనిఫెస్టో నుంచి)

నల్ల నల్ల సూరీడు  నల్లాటి సూరీడు
నలుపు నలుపు సూరీడు
గెలుపుదారి సూరీడు
(నల్ల సూరీడు నుంచి)

కవితాయాత్రలో
2004 సెప్టెంబరులో శివసాగర్ కవిత్వం, ఒంటరి యుధ్ధమే-జీవితోత్సవం (నా రెండో పుస్తకం) ఒకేసారి రావడం అనుకోకుండా జరిగిన సాహిత్య ఘటన. అప్పటికి నేను కవితాయాత్రకు సిద్ధమయ్యాను. ఆయన ఎవరో తెలియకుండా ఏళ్లుగా, ఆయనను చూడాలని ఏళ్లుగా తపించిన నేను ఆయనతో కలిసి కవితాయాత్ర చేసే అవకాశం వచ్చింది. అన్నీ మరిచి కవిత్వం కోసమే సంచరించిన కాలమది. రెండు, మూడు నెలలపాటు ఇద్దరం యాత్ర చేశాం. నల్లగొండ నుంచి కరీంనగర్ మీదుగా గుంటూరులోని చుండూరు వరకు. ఆ అనుభవాలు మధురమైనవి, మరచిపోలేనివి. ఆయన నుంచి, కవిత్వం నుంచి నేను పొందిన అపురూపమైన బహుమతి అది. ఒక రకంగా నా పునరుత్థానం అది. ఫీనిక్స్ పక్షిలా మరో పుట్టుక అది.

ఆయన కోర్కెలు
ఆ నిరాడంబర జీవికి, అందం అంటే అడవి అంటే ప్రాణం అనుకునే అయనకు రెండు కోర్కెలు ఉన్నాయి. అవి నెరవేరకుండానే పోయాడాయన. ఒకటి- అరవిందుడి 'సావిత్రి' ప్రేరణతో మరో సావిత్రి రాయాలన్నది. రెండు-ఏ ఆదిలాబాద్ ఆదివాసుల కోసం పనిచేశాడో వారి దగ్గరే తన సమాధిని ఏర్పాటు చేయాలన్నది.

ముగింపు
ఈనెల 17న ఒక విప్లవ నేత, బహుజన నాయకుడు, రెవల్యూషనరీ రొమాంటిస్టు మరణించారు. ఆయన చుట్టూ చేరి ఎందరో ఆయనకు వీడ్కోలు పలికాము. ఇక ..షరా మామూలే. ఎవరిపనిలో వారు. శ్రీశ్రీ అన్నట్లు 'ఆకాశం పడిపోకుండానే ఉంది'



ఎన్ని అద్భుత ఘటనలు జరిగినా, ఎన్ని విషాద ఘటనలు జరిగినా. ఎన్ని వీరోచిత ఘటనలు జరిగినా ఆ క్షణంలోనే ఆవిరవుతున్నాయి. స్పందన లేమి ఈ యుగ లక్షణమైపోయింది.
అన్నీ దారి తప్పాయి. అన్ని వ్యవస్థలూ దారి తప్పాయి. నివాసయోగ్యమైన భూమిని 'నరక'ప్రాయం చేసుకున్నాము. 2099 నాటికి 6 డిగ్రీల సెంటీగ్రేడు భూఉష్ణోగ్రత పెంచాలని పరుగులు తీస్తున్నారు. ఈ విధ్వంసం ఆగదు. తప్పదు. కొత్తది మొలకెత్తక తప్పదు. నూత్న మానవుడు పుట్టక తప్పదు. మరో చేగువేరా కోసం, మరో శివసాగర్ కోసం, మరో బాలగోపాల్ కోసం, మరో సాహు కోసం, మరో జార్జి కోసం, మరో భ గత్సింగ్ కోసం కాలం కడుపుతో ఉన్నది.

సూర్యాస్తమయం వృథా కాదు
సూర్యోదయం జరిగితీరుతుంది
తల్లి ప్రసవ వేదన వృథా కాదు
నూతన శిశువు జనిస్తుంది

- యింద్రవెల్లి రమేష్
99854 40002

నివాళి
http://www.andhrajyothy.com/sundaypageshow.asp?qry=2012/apr/29/sunday/nivali&more=2012/apr/29/sunday/sundaymain

There will never be another man like him

You have to decide on your own how you wish to understand Satyamurthy, but he was a man who everyone should try to understand. If efforts to understand him are marked by sincerity, poets will understand him as a Mahakavi, (radical left) revolutionaries will understand him as a great revolutionary leader, thinkers and philosophers will understand him as a great thinker. To understand a man, it might be enough to read his writing, but to understand Satyamurthy, one needs to understand his life too.

Satyamurthy had little interest in the many comforts easily accessed by traditional upper caste, middle class revolutionary leaders and poets. It was not that he could not have earned them, but he chose to live by the ideals that informed his writing. There was no contradiction between his life and his writing. After he became a revolutionary, several decades ago, the last three years of his life were the only time he actually spent with his children, whom he had left long ago. Until 2009, he was constantly engaged in one kind of activism or another, constantly traveling, especially in Telangana where he still has a lot of admirers. There were many occasions on which he developed health related issues while traveling and had to face his daughter’s anger. His life itself was poetry; it was not a poet’s life. We cannot separate his life from his poetry. He lived by the politics he believed in, and lived among the poor and the people he trusted, all through his life. That is the main difference between Satyamurthy and other poets.

Anyone who has ever spent some time with him cannot ever forget those moments. His words, his perspective on things we think are problems were different. His views even on issues we consider minor or trivial were very clear and precise. But his sense of humour was as prominent a part of his personality as his seriousness.

Satyamurthy occasionally stayed at my home when he visited Hyderabad. Once, my wife brought some Sitaphal for us. He asked me ‘what are those’ ‘Sitaphal’, I told him. ‘Who brought them’, he asked again. I said ‘Vijaya’. He said ‘If Vijaya brought them, why do you call them Sitaphal They are Vijayaphal!’

Once, when I was the Co-Convener of DBSS (Dalita Bahujana Sangharshana Samiti), my associate Dappu Shivaraju (Secretary of DBSS, Medak district), called me up and conveyed the news that someone had desecrated an Ambedkar statue in Chegunta by placing a garland of slippers around its neck. Satyamurthy, who was beside me, inquired about what had happened. I told him ‘Someone has placed a garland of slippers around Ambedkar’s neck in Chegunta’. He corrected me saying ‘Not around Ambedkar’s neck son, but around the Ambedkar statue’s neck’.

Satyamurthy had to spend some time underground even in his 75th year. Life underground for him did not mean a life of comforts and conveniences in Bangalore or Hyderabad. Between 2000 and 2002, he lived for around six months in the jungles of Warangal and Khammam and inspired a lot of youngsters. It was possible only for Satyamurthy to think of living in a jungle at that age; no one else, of his age, would even think of stepping into any jungle. No matter how much revolutionary poetry they might write, or how much revolutionary politics they might spout, this is the age of revolutionary leaders who would not abandon their bungalows in Hyderabad or Bangalore at any cost.

On one occasion, when we were returning together from the Khammam jungles, I asked him out of curiosity ‘Sir, both of us have some money in our pockets now (I had around ten thousand rupees while he had around twenty thousands). How will you explain the money to the police if they stop us now I can say that I am a student and the money is meant for fees, living expenses etc. What will you do’ He said ‘I will tell them the money is mine. They can take it if they want it’.



Satyamurthy suffered from diabetes and blood pressure issues. When he used to visit me in Ram Nagar (in Hyderabad), I noticed he carefully adhered to his daily routine morning walks would be followed by breakfast, pills and the Hindu newspaper. He would say ‘Kalekuri Prasad (a young, fiery poet) is trying very hard to end his life as soon as possible, whereas I am trying to extend it as far as possible’.

The pundits have figured out Satyamurthy’s worth. They say he ranks next only to Sri Sri (renowned Telugu Marxist poet of the twentieth century). One wonders what is the yardstick to measure a poet’s worth. In reality, it is incorrect to compare Satyamurthy with any other poet. He was one of a kind. All the revolutionary poets have drawn inspiration from him. He was not only a poet but also a full time social revolutionary. He did not write only poetry, poetry was only a part of his revolutionary praxis. When one looks at him in that light, one would realize that it is unjust to compare Satyamurthy with other poets whose revolutionary zeal never extended beyond their poetry. Observe how other poets live, their lifestyles; comparisons with Satyamurthy are unnecessary. Whether you look at revolutionary poetry or Dalit poetry, at the revolutionary movement or the Dalit movement, you would find Satyamurthy at the forefront. Satyamurthy is Satyamurthy, by any standards of theory or practice.

Satyamurthy would consider people around him as precious wealth. There is much to learn from him. He was a very sensitive man who used to love people a lot. He reminisced about old friends and comrades all the time, talk about a lot of things, but never lie about anyone. He liked people and the poor a lot, and it was that love which made him a life long revolutionary.

The Dalit activists too have neglected Satyamurthy, like the revolutionary activists. His contributions to the revolutionary movement and the Dalit movement cannot be measured. The Dalit leaders, even though they understand Satyamurthy’s contribution, stay silent. Both the revolutionary movement and the Dalit movement need to overcome these inhibitions.

Satyamurthy sacrificed his life for the Dalit movement and the revolutionary movement. The poor, the Dalits and the oppressed will always remember Satyamurthy alias Sivasagar.

(Please note all references to revolutionary movementspoetry and underground life etc in this article indicate radical left, Marxist-Leninist movementspoetrypolitics etc.)

Karthik Navayan is a human rights activist.

http://karthiknavayan.wordpress.com/2012/04/25/there-will-never-be-another-man-like-him/  
Karthik Navayan

(We thank Karthik for this moving tribute to the great Telugu poet, Marxist-Leninist and Maoist ideologue, Dalit leader and social revolutionary K.G. Satyamurthy, who passed away on April 17, 2012– Round Table India)

విప్లవ 'సత్యం'

రెండు దశాబ్దాల క్రితం నాటి మాట. 1985లో రాజమండ్రిలో రైతు-కూలీ మహాసభల ప్రచారం కోసం ఆర్ఎస్‌యు, ఆర్‌వైఎల్ దళాలు పనిచేస్తున్న సందర్భం. నేను, ద్రోణవల్లి అనసూయమ్మగారు, కొండపల్లి మనుమరాలు చుక్కు(సుధ) మరికొంత మంది బృందాలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో 45 రోజులుంచారు. అపుడు నా వయసు 18 సంవత్సరాలు. నాకు ఏ రాజకీయాలు తెలియకుండానే ఆ టీంలో ఉన్నాను.

ప్రతీరోజు అనసూయమ్మ గారి రాజకీయ తరగతులు, చుక్కు పాటలు నేను బాగా జీర్ణించుకున్నాను. చుక్కు కేవలం కె.జి. సత్యమూర్తిగారి పాటలే పాడేది. నేనూ ఆ పాటలన్నిటినీ నేర్చుకున్నాను. ఆ తరువాత 1989లో నేను దళంలో ఉన్నపుడు ఆ పాటలు పాడేదాన్ని. దళం కదలికలకు ఆయన పాటలే స్ఫూర్తి. 'గాలిలోని వాలులా ఏటిలోని నీటిలా నీటిలోని చేపలా ప్రజల మధ్యన ఒకనిగా రైతు బిడ్డడు లేచెనోయ్ రైతు బిడ్డడు గెరిల్లాగా కదన శంఖం ఊదెనోయ్ ' ( 'తూర్పు పవనం వీచెనోయ్' నుంచి). ఈ పాట దళం కదలికలకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది.

1996లో హైదరాబాద్ నుండి విజయవాడ ట్రెయిన్‌లో వెళుతుండగా నేను కూర్చున్న బోగీలో చాలా సందడి కనిపించింది. వాళ్ల పాటలు మాటలు సుపరిచితమైనట్లు అనిపించాయి. వెళ్లి చూస్తే మా పాటల రచయిత అక్కడున్నారు. 'నమస్కారం సత్యమూర్తిగారు' అన్నాను. 'అమ్మా తమరెవరు' అని అడిగారు. ' నేను పీపుల్స్‌వార్‌లో 1985 నుండి 91 వరకు పనిచేశాను. నేను పార్టీలో దళాల్లో ఉండగా మీ పాటలే పాడేదాన్ని' అని ఆయన రాసిన పాటలు వరుసగా ఐదుపాటలు పాడాను. అది విని ఆయన నన్ను అక్కున చేర్చుకుని నుదుట ముద్దుపెట్టారు. నా అడ్రస్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చారు.

అంత ప్రేమగా ఆహ్వానించినా హైదరాబాద్‌లోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నేను ఆయన్ని కలవలేకపోయాను. నెల తిరక్కుండానే దిల్‌షుఖ్‌నగర్‌లో ఉంటున్న నన్ను ఆయనే వచ్చి కలిశారు. ' చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్ష రద్దు ఉద్యమం జరుగుతోంది. అందులో నీ గళం వినిపించాలి ' అని ఇంటికి వచ్చి మరీ చెప్పారు. నేను వెళ్ళటం, ఆ తర్వాత ఉద్యోగం మానేసి సత్యమూర్తిగారితోనే కలిసి పనిచేయడం జరిగింది. ఆ పార్టీ ఆఫీసులో ఉన్నపుడు 'శత్రు చేజిక్కితినని వెక్కిరించకు నన్ను -మిత్రద్రోహము చేత శత్రువు చేజిక్కితిని చందమామా' అనే పాట ఎక్కువగా పాడేదాన్ని. నిజంగా ఆ పాట పాడేటపుడు నా హృదయం ద్రవించేది.

ఆయనకు మిత్రుడెవరో శత్రువెవరో నిజంగానే తెలిసేది కాదు. అందర్నీ మిత్రులుగానే భావించేవారు. ఆ మిత్రులే తర్వాత చాపకింద నీరులా చేరి కొంపముంచుతారన్న వాస్తవం తెలిసేది కాదు. ఆయనకు తెలిసింది ఒక్కటే  సత్యం, సత్యం, సత్యం''. నిజంగా సత్యమూర్తి సార్థకనామధేయుడు. అతనికి కుట్రలు తెలీవు. కుట్రలు గమనించేవారు కాదు. మిత్రుల కుట్రలను గమనించలేక పోవడం వలన అతను ఎన్నో అవమానాలు చవిచూశాడు. దానివల్ల కేడర్‌కు కూడా కన్నీళ్ళు, ఆకలి మిగిల్చారు. నన్ను ఏకలవ్య కళామండలి రాష్ట్ర కన్వీనర్‌గా ఆయన నియమించినందుకు కొందరు 'మిత్రులనుకు'నేవాళ్లే అసూయతో మామీద బురదజల్లిన సంగతి నాకు ఇప్పటికీ గుర్తే. స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరక గల్గినవాడే నేటి హీరో అన్నమాట ఆయన చనిపోయే వరకు నిలబెట్టుకున్నారు.

వామపక్షాల్లోనూ కులతత్వం వుంది, ఇది కుల-వర్గ సమాజం అంటూ, అంబేద్కర్, మార్క్స్, మావో ఆలోచన- ఆచరణ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించినపుడు లెఫ్ట్ పార్టీల్లోని అణగారిన కులాలవారి కళ్ళు తెరుచుకున్నాయి. అణగారిన కులాలవారి మీద నాయకత్వం వహిస్తున్న అగ్రకుల నాయకులకు గుండెల్లో గుబులుపుట్టింది. అన్ని పార్టీల్లోనూ కుల నిర్మూలన సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు పెట్టారు, తమ కేడర్ జారిపోకుండా.

అనంతసాగరం లాంటి ఆయన సాహిత్యం చదివాను. ఆయన పాటలు పాడాను, ముఖ్యంగా నల్లనల్ల సూరీడు. ఆయన 1996లో ఆ పాట రాస్తే నేనే దానికి ట్యూన్ కట్టి పాడాను. అంతటి అదృష్టం నాకు దక్కింది. ఆచరణశీలియైన ఆ మహాకవి నెలవంకతో నన్ను పోల్చడం నా జన్మ సుకృతం. ఆయన కాలజ్ఞాని సూర్యుడు''- 'ప్రత్యేక తెలంగాణలో బహుజన రాజ్యం' అనే నినాదాన్ని ఆయన 1997లోనే తీసుకున్నారు. ఎంత ముందుచూపో చూడండి.

శివసాగర్ పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటికి వచ్చాక ఆయనకు ఎవరో మహానుభావుడు హైదరాబాద్ చింతల్‌బస్తీలో మూడుసెంట్లస్థలం గిఫ్ట్‌గా ఇచ్చారు. అపుడు బహుజన రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఆయన సహచరి పార్వతి, ఆ స్థలంలో పార్టీ ఫండ్‌తో ఇల్లు కట్టింది. ఇప్పుడది పరాధీనంలో ఉంది. ఆ ఇం టిని శివసాగర్ లైబ్రరీగా మార్చాలని శివసాగర్ అనుచరులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఒక విగ్రహం కట్టాలని కూడా కోరుతున్నారు. ఆయనకు మూడు సెంట్లు ఇచ్చిన దాతకు నమస్కారాలు.

సుఖం అంటే ఏమిటో, అలుపంటే ఏమిటో, స్వార్థం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. ఆయన ఆచరణ అంతా, జీవితమంతా ప్రజలకోసమే. 'సత్యమూర్తి'గా నెలవంకై మనవైపు ఎపుడూ దృష్టి ఉంచుతాడు. దళిత, విప్లవ ఉద్యమాల్లో తన అనుభవాల గురించి ఆయన స్వయంగా మాట్లాడింది, పాడింది నేను రికార్డు చేయడం నా అదృష్టం. అంతిమ యాత్రలో నన్ను గజ్టెకట్టి ఆడమని శివసాగర్ కోరారు. కాని పాడలేకపోయిన నా అశక్తతను, అనారోగ్యాన్నీ మన్నించు శివసాగర్...

- చంద్రశ్రీ
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/29/edit/29edit4&more=2012/apr/29/edit/editpagemain1&date=4/29/2012

శివసాగర్‌తో కాసేపు...

విప్లవ భావుకుడు, మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ గ్రూపును స్థాపించిన కెజి సత్యమూర్తి అలియాస్ శివసాగర్ మృతికి వన్ ఇండియా తెలుగు పోర్టల్ సంతాపం వ్యక్తం చేస్తూ... ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూను మీకోసం అందిస్తున్నాం. గతంలో దీనిని శివసాగర్‌తో కాసేపుగా అందించాం. అది యథాతథంగా అందిస్తున్నాం.

కవిగా, విప్లవకారుడిగా శివసాగర్‌ రోమాంటిక్‌. అంతటి రోమాంటిక్‌ పోయెట్‌ ఆధునిక తెలుగు కవిత్వంలో మరొకరు కనిపించరు. 'ఉద్యమం నెలబాలుడు' కవితా సంకలనంలో ఉన్న కవితలు, పాటలు ఆయన కవితాశక్తికి, ఆయన ఈస్తటిక్‌ సెన్స్‌కు ప్రతీకలు. అజ్ఞాతంలో ఉంటూ వివిధ పేర్ల మీద ఆయన రాసిన కవితలు చాలా కాలం క్రితమే 'ఉద్యమం నెలబాలుడు' పుస్తకంగా వచ్చింది. ఆయన పీపుల్స్‌వార్‌ నాయకత్వంతో విభేదించి అజ్ఞాతవాసం వీడి బయటకు వచ్చారు. ఆ తర్వాత దళిత కవిత్వం రాశారు. ఇందులోనూ అంతే. ఆయన రాసిన 'నల్లసూర్యుడు' కవిత దళిత కవిత్వానికి ప్రతీకగా నిలిచింది. రెండో సారి అజ్ఞాతం వీడి ఆయన బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కదిలించినప్పుడు- 'కవిత్వమే నాకు జీవితాన్ని ఇచ్చింది' అని ఆయన అన్నారు. ఇటీవల తాను రాసిన 'సద్దామ్‌కు ప్రేమలేఖ' కవిత గురించి చాలా సేపు మాట్లాడారు. 'దాంట్లో రొమాంటిసిజం ఉంది' అన్నారు. 'పోయెట్‌ అంటేనే అది కదా!' అన్నాడు. 'విప్లవ కవిత్వం రాసినప్పుడు కూడా అలాగే రాశాను' అని ఆయన అన్నారు.

పీపుల్స్‌వార్‌ నుంచి బయటకు వచ్చాక కె.జి. సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్‌ రాజకీయంగా అనేక ప్రయోగాలు చేశారు. కాన్షీరామ్‌ నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి)లో చేరి అక్కడ ఉక్కపోసి వెనక్కి వచ్చేశారు. దళితవాదం గురించి అనేక చర్చలు చేశారు. దళిత ఈస్తటిక్స్‌ గురించి మాట్లాడారు. ఆయనకు ఆయుధం ఒక అబ్సెషన్‌ కావచ్చు. విప్లవం తెస్తానంటూ రెండో సారి అడవి దారి పట్టారు. సిపిఐ (ఎంఎల్‌) ప్రతిఘటనలో చేరి వృద్ధవృకోదరమై గర్జించారు. రెండోసారి ఎందుకు అడవులకు వెళ్లారని అడిగితే- 'విప్లవం ఎలా చేయాలో పీపుల్స్‌వార్‌కు ఆచరణలో చూపిద్దామనుకున్నాను' అని అన్నారు. అక్కడా నిలువలేకపోయారు. తిరిగి వచ్చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే- 'ముసలితనం కదా!' అని అన్నారు.

ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. అంబేడ్కరిజాన్ని విమర్శిస్తూ 'అంబేడ్కర్‌ చాలడు- మార్క్స్‌ కావాలి' అని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ రాశారు. ఆయన అజ్ఞాతం వీడి బయటకు వస్తూనే- ఆ పుస్తకానికి జవాబు చెప్పే పనిలో పడ్డారు. రంగనాయకమ్మ రాసిన పుస్తకానికి జవాబిస్తూ ఆయన రాస్తున్న వ్యాసాలు ఒక దినపత్రికంలో వారంవారం వస్తున్నాయి. ఇటీవల ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ ఆయన కలబోసుకున్నారు. 'ఇక్కడే ఉంటారా' అని అడిగితే 'లేదు. విశాఖపట్నంలోనే ఉంటా' అని జవాబిచ్చారు. రెండోసారి అడవుల్లోకి వెళ్లే వరకు ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు.

'ఇప్పుడేం చేస్తారు' అని అడిగితే 'సాహిత్య రంగంపై దృష్టి పెడతా' అని చెప్పారు. తన రాజకీయానుభవాలను కూడా రాయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం ఆయన చాలాసార్లు చెప్పారు. కానీ ఆచరణలో పెట్టలేదు. మార్క్సిజంలోని లోపాలను గురించి ఆయన ప్రస్తావించారు. మార్క్సిజం పరిమితుల గురించి ఆయన చాలా సేపు మాట్లాడారు. ఆ పరిమితుల్లోంచే సాంస్కృతిక విప్లవం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థికాంశానికి తాము అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని ఏంగెల్స్‌ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. అయితేఅప్పట్లో ఏంగెల్స్‌ ఏమిటి అట్లా అనడమేమిటని అనుకున్నామని ఆయన చెప్పారు.

సాంస్కృతికోద్యమం బలంగా సాగాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి పని వారు చేసుకోవడమనే సంస్కృతి ఇందులో ఉన్నదని ఆయన చెప్పారు. విప్లవోద్యమం ఫలించినదేశాల్లోనూ ఇది అమలు కాలేదని ఆయన చెప్పారు. పైస్థాయిలో ఉన్నవారు దానికి బ్రేక్‌లు వేశారని ఆయన అన్నారు. సాంస్కృతికోద్యమం జరగకుండా జరిగే అభివృద్ధి ఏది కూడా గుణాత్మకం కాదనేది ఆయన అంచనా అని ఆయన మాటల ద్వారా నాకు అర్థమైంది.
http://telugu.oneindia.in/sahiti/essay/2012/revolutionary-movement-founder-satyamurthy-dies-aid0070.html

స్మరణకు విస్మరణకు నడుమ

నివురు గప్పిన చరిత్ర నిప్పులాంటి వార్తవుతున్నది
కలలునిండిన పార్ధివదేహం రేపటి వర్తమానానికి పురుడుపోస్తున్నది
టైమ్‌మిషీన్ సాంస్కృతిక పునరుజ్జీవనమ్ కోసం వెనుకకు తిరుగుతున్నది
మనువాదపు విలువలు విస్మరించిన విప్లవ గాయాలు
సలుపుల గేయాల దరువును విన్పిస్తున్నవి
మౌనపు ఆక్రందనల్లో మార్మోగిన పాట నిశబ్దపు కరతాల ధ్వనుల మధ్య
మూలవాసి అస్తిత్వపు విలువలు సృష్టించబోయే సునామీకై ఎదురుచూస్తున్నది
తలెత్తుకు బతికేందుకు తలనరుక్కున్న దేహాలు బహిరంగంగానే గొంతు పెకిలిస్తున్నవి
మూతికి ముంత ముడ్డికి ముండ్లకంపతో బంధించబడిన ప్రశ్నలు
అర్ధసత్యాల ముసుగు తొలగించేందుకు సమాధానపు కొడవండ్లకు సానబడుతున్నవి
కంచెమేసిన చేనులో పరిగలేరుకునే అవకాశవాదులను తరిమేందుకు కాసుకున్నది వడిసెల కబేలాలు బలిపశువులకు మద్దతుగా సభలు నిర్వహిస్తుంటే
వెలివేయబడిన గొంతులు తమను తామే ఆహ్వానించుకుంటున్నయి
పగిలిన నిప్పటికెను అతికించుకునేందుకు కుమ్మరిపురుగు సారెకై ఎతుకుతున్నది
త్రిశంకునికి విశ్వామివూతుడు సృష్టించిన స్వర్గంలోని గతితర్కం బోధపడుతున్నది
బరువుమోయలేని బానిసలు తమ కిరీటాలను వామనుడికి తాకట్టు పెడుతుంటే
తలకిందులుగా వేలాడుతున్న గబ్బిలానికి ఇప్పుడిప్పుడే మూడడుగుల నేల
మర్మం అర్థమవుతున్నది
వేటాడే సింహాలు అధికారం కోసం పచ్చిగడ్డి తింటుంటే
పెద్దకూర కోసం మేకలు ఆత్మగౌరవ యద్ధాలు చేస్తున్నవి
జ్ఞానం సత్యం కోసం స్వార్థపు శిరస్సు నరికేసుకున్న
సిద్ధార్థుడు నేడు శివసాగరుడై అర్ధాంతరంగా నిష్క్రమించాడు
స్మరణ విస్మరణ నడుమ బోధివృక్షం మరో బుద్ధుడి కోసం పరితపిస్తున్నది
--హజారి
(భారతీయ సాంస్కృతిక విప్లవపథాన్ని సంఘటితం చేయలేకపోతున్న ఎందరో
శివసాగరుల నిస్సహాయతకు నివాళిగా...)
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=98667

కవిత్వం లాంటి జీవితం

సత్యమూర్తిని నిజాయితీగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవిగా అర్థం అవుతాడు; విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడుగా అర్థం అవుతాడు. పేదలకు అతనొక మహా పేదవాడుగా అర్థం అవుతాడు. తత్వవేత్తలకు అతనొక గొప్ప తాత్వికుడు. ఒక రచయితను అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సత్యమూర్తిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలతో పాటు అతని బ్రతుకును కూడా అర్థం చేసుకోవాలి.

సాంప్రదాయ అగ్రకుల మధ్యతరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు సత్యమూర్తి దూరంగా ఉన్నాడు. అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు. అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు. సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మధ్య Contradiction లేదు. విప్లకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలంలో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు, తను వదిలి వెళ్ళిన పిల్లల దగ్గర గడిపాడు.

2009 వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఎవరో ఒకరితో తిరుగుతూనే ఉన్నాడు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చి తన కూతురుతో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరువేరుగా చూడలేము. అతను ఏ సిద్ధాంతాలు, ఏ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఏ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజల మధ్య, అదే పేదల మధ్య బ్రతికాడు. అదే ఇతర కవులకు, సత్యమూర్తికి ఉన్న తేడా.

సత్యమూర్తితో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే దృష్టి చాలా భిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి. మనం చిన్న చిన్న విషయాలు అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తికి చాలా స్పష్టమైన ఖచ్చితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంభీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు. సత్యమూర్తి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా రూమ్‌లో ఉండేవాడు. ఒకసారి నాకు కావాల్సిన భార్య మా కోసం సీతాఫల పండ్లు తీసుకొచ్చింది. సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పాను. ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. విజయ తీసుకొచ్చిందని చెప్పాను. విజయ తీసుకొస్తే సీతా ఫలములు అంటావేమిటి బాబు అవి విజయ ఫలాలు అన్నాడు.

సత్యమూర్తి తన 75 సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవితం గడిపాడు. అజ్ఞాత జీవితం అంటే హైదరాబాద్‌లోనో బెంగుళూరులోనో కాదు. ఖమ్మం, వరంగల్ జిల్లా అడవుల్లో 2000-2002 సంవత్సరాల మధ్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది. అది కేవలం సత్యమూర్తికే సాధ్యం.

ఒకసారి ఖమ్మం అడవి నుంచి సత్యమూర్తితో కలిసి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అప్పుడు నా దగ్గర పదివేల రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను. 'సర్ ఒక వేళ పోలీసులు మనల్ని పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను నా దగ్గర గుర్తింపు కార్డు ఉంది, వారు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకెళ్తున్నానని చెబుతాను. మరి మీరేమి చెపుతారు'. అపుడు సత్యమూర్తి 'ఒకవేళ పోలీసులు నా దగ్గరి డబ్బుల గురించి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను' వారికి కావాలంటే యిచ్చేస్తానని అన్నాడు.

సత్యమూర్తిని లెక్క కట్టేసారు, అతను శ్రీశ్రీ తర్వాత అని లెక్కేసారు. దానికి కొలమానము ఏమిటో నిజానికి సత్యమూర్తికి ఎవరితో పోలిక సరికాదు. అతను ఎవరి తరువాత కాదు. అతనికి అతనే సాటి. యిక్కడి విప్లవ కవులు అందరూ సత్యమూర్తి ద్వారా స్ఫూర్తి పొందినవారే. సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామాజిక విప్లవ నాయకుడు.

అతను కవిత్వం మాత్రమే రాయలేదు. కవిత్వం సత్యమూర్తికి తన విప్లవ ఆచరణలో భాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తిని ఏ మాత్రం ఆచరణ లేని ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చూడండి. అందుకని పోలికలు వద్దు. సత్యమూర్తి విప్లవ కవిత్వమైనా, దళిత కవిత్వమైనా, విప్లవోద్యమమైనా, దళితోద్యమమైనా అగ్రశ్రేణిలో ఉంటాడు. అది సైద్ధాంతికమైనా ఆచరణ రీత్యానైనా సత్యమూర్తి సత్యమూర్తే.

దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగా సత్యమూర్తిని నిర్లక్ష్యం చేసాయి. విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన... ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైనా సరే మౌనంగానే ఉన్నారు. ఈ పరిధుల నుంచి విప్లవోద్యమం, దళితోద్యమం బయటపడాల్సిన అవసరం ఉంది. విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి సత్యమూర్తి తన జీవితాన్ని అంకితం చేశాడు. పేదలు, దళితులు, పీడితులు, అణచబడిన జన గణాలు సత్యమూర్తి ఆలియాస్ శివసాగర్‌ని అనునిత్యం తలచుకుంటారు.

- కార్తీక్ నవయాన్
http://andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/apr/27/edit/27edit5&more=2012/apr/27/edit/editpagemain1&date=4/27/2012

శివుడు సాగరుడు చిరంజీవి

సాగరుడు
తిరిగివస్తాడు.. తిరిగి లేస్తాడు
గుండెల్లో దూకుతున్న జలపాతంలా
కొండల్లో మోగుతున్న జనంపాటలా
శివుడు.. తిరిగివస్తాడు.. తిరిగి లేస్తాడు
పాలక పక్షం కంటిలో ఇసుకరేణువులా
వరదయిన తొలకరి వానలా
నెత్తురుకు ధిక్కరణ నేర్పే పిల్లనగ్రోవిలా
ఆకాశంలోని కోట్ల నక్షత్రాలకు స్ఫూర్తినిచ్చే
అద్భుత నక్షత్రంలా
నాగేటి చాళ్ల మధ్య నవ్వే రైతులా
తిరుగబడిన గాలిలా
యుద్ధాన్ని నేర్పే మట్టి వాసనలా
అట్టడుగు జనం నుండి
తిరిగి వస్తాడు.. సాగరుడు తిరిగి వస్తాడు
గోధూళి వేళ ఎరుపెక్కిన పశ్చిమంలా
అరచేతిలో తిరుగబడిన గోరంటాకులా
తన కెరటాలతో ఆకాశాన్ని ముంచిన సముద్రంలా
దీపం నక్షత్రమయి ధిక్కార సంగీతాన్ని వినిపించిన వేళ
యుద్ధనౌక ఆయుధాలతో బయలుదేరే వేళ
తిరిగి వస్తాడు.. సాగరుడు తిరిగి వస్తాడు
చట్ల కొమ్మలు పక్షులకు ఆయుధాలనందించిన వేళ
రాలిన ఆకులు పోరాటమే
జీవిత సత్యమని విప్పి చెప్పే వేళ
తల్లి చనుబాలు గీతమయి సాహిత్యాన్ని వెలిగించే వేళ
అందరూ ఆయననే తలపోస్తున్న వేళ
తిరిగి వస్తాడు.. సాగరుడు తిరిగి వస్తాడు
ఆకాశం భూమిని ధిక్కరించే వేళ
పొన్న పూలు రాలి కూడా ఎగిరిపడుతున్న వేళ
వీధి దీపాలు దోపిడీపై తుపాకులయి మ్రోగే వేళ
కన్నీరు కార్చిచ్చుగా మారిన నేలమాశిక నుండి
తిరిగి వస్తాడు.. సాగరుడు.. తిరిగి లేస్తాడు
అరణ్యాలు సత్యాన్ని ఆవిష్కరించే వేళ
గోదారి సముద్రమయి విప్లవ సముద్రమయిన చోట
మరణ శాసనం దోపిడీకి చరమగీతం రాసే వేళ
తిరిగి వస్తాడు.. తిరిగి లేస్తాడు
సర్కారు కట్టుకథలు మట్టి కరిసి ఓడిపోయే వేళ
వీరుని సంస్మరణ దినోత్సవాలు
కౌటిల్యాన్ని ధిక్కరించే వేళ వస్తాడు
తిరిగి వస్తాడు.. సాగరుడు.. తిరిగి లేస్తాడు
ఇపుడు
వాడవాడలా శివసాగర్ గీతం వినబడుతుంది
ఆయన చనిపోలేదు
ఏ కట్టె ఆయనను కాల్చదు
తిరగబడిన జనం కన్నీళ్ల నుండి
ఆయన తిరిగి లేస్తాడు
సూర్యనేత్రం ఆయనకు ఊపిరిపోస్తుంది
పిల్లన గ్రోవికి ప్రాణ వాయువు ఆయనే
సంధ్యారాగంలో వాయులీనం సాగరుడే
సముద్రం హోరులో ఆయన పాట వినిపిస్తుంది
భువన భవనపు బావుటాగా ఆయన ఎగురుతాడు
ఆయన కొరకు ఎదిరి చూస్తాను
మృత్యుంజయం ఆయన కవిత్వం.. మహాప్రస్థానం ఆయన యుద్ధం
తిరిగి వస్తాడు.. సాగరుడు.. తిరిగి లేస్తాడు
--సి.హెచ్. మధు
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=98672

శివసాగర్ కవిత్వం సంపాదకత్వం గుర్రం సీతారాములు

శివసాగర్ కవిత్వం సంపాదకత్వం గుర్రం సీతారాములు
http://gurramseetaramulu.blogspot.in/2008/08/blog-post_8186.html

Sivasagar Kavitvam
(1968 – 2008)
by Sivasagar
Edited by Gurram Seetaramulu
© Author
First Edition September, 2004
Reprint  February, 2008
Cover Painting  Kalla
Price Rs.100-
Published by
P. Annapurna
Dubagunta (V), Via Vinjamur
Athmakur (M), Nellore Dist.

For Copies
Telugu Book House
Kachiguda, Hyderabad.
Navodaya Book House
Kachiguda, Hyderabad.
Gurram Seetaramulu
Thallampadu, Khammam Dist.

e-mail seetaramulu@gmail.com
Printed at
Vipla Computer Services
(Designers & Multi Colour Offset Printers)
Nallakunta, Hyderabad - 500 044
Ph 27654003, 27676910, 27677078

Posted by Gurram Seetaramulu at 1634 

శివసముద్రం

నేలరాలిన కవన నక్షవూతమా!
తొలిసారి నిన్ను చూసింది
రాణావూపతాప్ హాల్ బయటనే!
అప్పటినుంచే నీ ఆత్మతో
పాటు దేహాన్ని కూడా ప్రేమించాను
మొదట్నుంచి నా ఫెవరేట్ కవన హీరోవి నువ్వే కదా!
తొలకరి వానకు
నేల తన సుగంధాన్ని వెదజల్లినట్లు
ఎన్ని మార్లు నీ కవన గానాలకు
నా మనసు పరిమళించిందో
ప్రవహించిందో ఉప్పొంగి నాట్యమే చేసిందో
లెక్కలేసి చెప్పలేను గాక చెప్పలేను
ఎలా చెప్పను శివసాగర్!
నీ కవిత్వం తాగి ఊగిపోయిన వాన్ని కదా!
ఎలా చెప్పను చెప్పు
కంభం జ్ఞాన సత్యమూర్తీ!
నీ కవిత్వం నన్నో కవన వెర్రోన్ని చేసింది కదా!
సినిమా పిచ్చోడు ఆడినన్ని రోజులు చూసినట్లు
కవిత్వం రాయాలన్న కాంక్ష
నీ కవిత్వంపై వాలిపోయిన తర్వాత
ఎన్ని రాత్రులు నీ కవన స్మరణలో
ఉన్నానో ఎలా చెప్పగలను.
ఖాదర్ బాయ్ ఖాదర్ బాయ్
నా ఫెవరేట్ సాంగ్ తోటా రాముడి పాటను
సత్యమూర్తి సంతాప సభలోనైనా
చివరిసారిగా పాడవూ!
అజ్ఞాత వీరుల
ఆనందాక్షిశువుల జడివానలో
తడవడానికేగా నువ్వీ జన్మనెత్తింది!
నీవు నా ‘వాడ’ వేలే!
విప్లవ దళాలకూ దళితబలాలకూ
ఆయుధ కవన కర్మాగారం నీవేనని తెగేసి చెప్పగలను
శివ సమువూదమా!
నా కవన కలల సమువూదానివి నీవే!
చీకటి చిరుత పులిని
జీవితమంతా వేటాడిన విల్లంబులు ఈ నీ కవనాలేకదా!
ఎన్నెన్ని ‘ఎదురీత’ లీదావో
కళ్లున్న వాళ్లకీ కన్నీళ్లున్న వాళ్లకీ
ఎలా తెలియకుండా ఉంటుంది!
చిరుగాలి నా ఇంట్లోకి ఎప్పుడొచ్చినా
నీ సితారా సంగీతాన్ని వినిపించకుండా వెళ్లదు
దొరలు కూలి పోవాలనే గదా!
బతుకునంతా చిందరవందర చేసుకున్నావ్
ఎంత సాహసం నీకు దాచుకున్న నీ కవన విల్లంబుల్ని
నీ కిస్తా తమ్ముడా! నీ కిస్తా తమ్ముడా అంటూ
వరవరరావు ఇంట్లోనే వదిలి వెళ్లావని నేననుకోవడంలేదు!
పంచినంత కాలం ఆదివాసులకు పంచావ్
నీకు తోచిన దారిలో
దళితులకూ బహుజనులకూ పంచుతూ పంచుతూ నిష్క్రమించావ్
ఏదైతేనేమ్ విప్లవ కవిగానే దళితోద్యమ కవిగానే
వెళ్లావు గానీ అడుగు వెనక్కు వేయలేదు కదా!
అర్థమైన వారికి అర్థమైనంత అర్థమైందిలే!
ఐనా శ్రీశ్రీ తర్వాత
మా నిలు కవన విగ్రహం నీ కవిత్వమే
మునిగిపోయిన పడవలో
హాయిగా నువ్వు నిద్రపోతున్నందుకు బాధగానే ఉంది
నీ సమాధి పక్కన
నవ్వుతూ వెలిసే సమాధులు ఎన్ని వెలిసినా
మళ్లీ నువ్వు నెలబాలుడిగా జన్మిస్తావ్
కవన సంభాషణ మొదలు పెడతావని
నీ ఆత్మకథ చెబుతూనే ఉంది
ఇరాక్ ఇసుక రేణువుల్ని
ప్రేమించిన నీ ప్రేమను ప్రేమించకుండా
ఉండలేక పోతున్నాను
నీకు నువ్వు చూసుకున్నావోలేదో
నడచిన నీ పాదమువూదల్లో
అమరులు మినుగురు
పురుగుల్లా అగపడుతూనే ఉన్నారు
నా కింకా నమ్మకమే
నీ నల్లాని సూర్యుడు అజ్ఞాత
సూర్యుడితో కలిసి నడవగలడని.
తల్లీ నన్ను కన్నందుకు అని అన్నావు గానీ
మా తెలంగాణ తల్లులు కొప్పులో ముడుచుకుని నిన్ను దాచుకుంటారులే!
ప్రజల ఇంటిముందు చల్లే కల్లాపిలోనే కాదు
ఆకాశంలో వెలిసే
ఇంద్రధనుస్సుల్లోనూ నువ్వు తప్పక అగపడతావు
అడవిలో పండించిన వెన్నెలవు కదా!
నిన్నెలా మరువగలం!
విప్లవం యాడుందిరా అంటే
నీ చెల్లి చెంద్రమ్మలు
రాంజీ గోండ్ దగ్గరికి తోలుకు పోయి చూపుతారిప్పుడు
శివసాగర్! శివసాగర్!
నువ్వు నేల కొరిగావని
ఎన్నెన్ని సచివాలయాలు అనకుంటే అనుకోనీ
నువ్వు నడిచిన దారి మూసుకు పోదు!
అది మరింత వెడల్పయి చరివూతను లిఖించగలదు.
-నాళేశ్వరం శంకరం
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=98677

విప్లవ, దళిత కవిత్వాలకు నిలు మొగురం

శివసాగర్ భావుకుడైన ఉద్యమ కవి, గెరిల్లా యోధుడు. విప్లవ పార్టీల్లో, దళిత బహుజన పార్టీల్లో గొప్ప వ్యూహకర్త. నడిచిన, నడుస్తున్న చరివూతకు నిలు పత్రిబింబం. గిడసబారిన సంప్రదాయవాదుల కళ్లపైకి లేచిన ఒక ఇసుక తుపా ను. అతని కవిత్వాక్షరాలు అగ్నిని కురిపిస్తాయి, ఎగజిమ్ముతాయి.

‘పట్టపగలు నడివీధిలో బేఫికర్‌గా
హత్యచేయవలసిన కుష్ఠుసంఘంతో
నడిరాత్రి కక్కుర్తి రతి జరిపే వీళ్లు
ఆయుధాలు పట్టలేరు, బారికేడ్లు కట్టలేరు
గ్రెనేడ్లు విసరలేరు, గీతంలో జ్వలించలేరు’

1970లో శివసాగర్ రాసిన విప్లవ కవిత్వమిది. ఏ మాత్రం రాజీపడని యోధుడే ఇలాంటి కవిత్వం రాయగలడు. శివసాగర్ లాంటి విప్లవకవి ఏ తాత్విక నేపథ్యంలోంచి పుట్టుకురాగలడు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసిన నాటి పరిస్థితులేవి నవ యవ్వనంలో శివసాగర్‌ను కదిపి కుదిపిన ఆ మహాశక్తులేవి

శ్రీకాకుళ కుగ్రామాల్లో వెంపటావు సత్యం వెలిగించిన చైతన్యదీప్తుల భావోత్తేజం, చారుమజుందార్‌తో గుత్తికొండ బిలంలో జరిగిన రహస్య సమావేశం శివసాగర్ అనబడే విప్లవ కాగడాగా వెలిగింది. ఆ వెలుగుల్లోంచే శివసాగర్ ప్రజాకవిత్వం రాశాడు. విప్లవ కవిత్వంలో ని మొనాటనిని చావుదెబ్బతీసి, ప్రజల హృదయాలకు చేరువయ్యే దేశీ కవిత్వం రాశా డు. 1970-5ల మధ్య ఆంధ్రవూపదేశ్‌లో ని నక్సల్బరీ పోరాట చరివూతను సూక్ష్మదృష్టితో రికార్డ్ చేసిన ఘనత శివసాగర్ పాటలకే దక్కుతుంది.

‘గార్ల రైలు దాడిలోన-గుంజుకున్న బల్ రైఫిల్ నీకిస్త తమ్ము డా! నీకిస్తా తమ్ముడా’

పాటలోని పాదాల గూర్చి చెబుతూ... ‘ఖమ్మం, హైదరాబా ద్ మధ్య గల ‘గార్ల’ రైల్వేస్టేషన్ వద్ద పీపుల్స్‌వార్ దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లింది. సికింవూదాబాద్ కుట్ర కేసులో కె.జి. సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య కలిసి ‘గార్ల’వద్ద జరిగిన దాడిలో పాల్గొన్న దళానికి నాయకత్వం వహించారని రుజువు చేయడానికి ఈ పాటను కుట్రకేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌గా ప్రాసిక్యూషన్ కోర్టులో దాఖలు చేసిందని, శివసాగర్ ‘ఈనాటి ఏకలవ్వ’ పత్రికా ఆఫీసులో తన్మయంగా నాతో చెప్పారు. ఈ విషయాలన్నీ ‘శివసాగర్ కవి త్వం (1968-2008)’ పుస్తకంలో వాస్తవికంగా రికార్డ్ చేశా రు.

శివసాగర్ కవిత్వం, ఆయన రాసిన మహోన్నతమైన పాటల నేపథ్యం తెలుసుకోవాలంటే, ఆయనతో సాన్నిహిత్యం ఉండాల్సిందే. 1990ల తర్వాత వచ్చిన దళిత సాహిత్యోద్య మం శివసాగర్‌తో మాకు సాన్నిహిత్యాన్ని పెంచింది.

1990ల తర్వాత దళిత సాహిత్యోద్యమ తొలి రోజుల్లో మా తరానికి శివసాగర్ ఎవర్‌క్షిగీన్ హీరో. 1995లో వెలువడిన ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవిత్వ సంకలనంలో నా కవిత కు పేరు రావడంతో శివసాగర్‌తో నాకు పరిచయం పెరిగింది. రాంనగర్‌లోని ఒక ఇంట్లో ‘ఈనాటి ఏకలవ్య’ పత్రిక నడుపుతూ, బహుజన పార్టీలో పనిచేస్తూ, దళిత ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు శివసాగర్. అంబటి సురేంవూదరాజు, గోరటి వెంకన్న, జె. గౌతమ్, లెల్లే సురేష్, గుడిపాటి, కె. శ్రీనివాస్, సుంకిడ్డి నారాయణడ్డి, ఒమ్మి రమేష్‌బాబు, పైడి తైరేష్‌బాబు, మద్దూరి, మద్దెల శాంతయ్య, సిద్ధార్థ, నేను-ఇంకా చాలామంది మిత్రులం పాటలతో, కవిత్వంతో ఎన్నో రాత్రులను శివసాగర్ ఇంట్లో వెలిగించాం. మాసాహిత్య ప్రస్థానం లో ఆ ఆనవాళ్లు కనిపిస్తాయి.

విప్లవ పార్టీలో కె.జి. సత్యమూర్తిగా, నక్సల్బరీ అజ్ఞాత జీవితంలోంచి ఎదిగొచ్చిన విప్లవకవి శివసాగర్‌గా- రెండు రూపాల్లోనూ ఆయనవ్యక్తిత్వం మహోన్నతంగా వికసించింది. ఆయ న కవిత్వం,పాట తెలంగాణనేలలో అల్లుకుపోయింది. ఉత్తరాంధ్ర అటవీప్రాంతాలలో తుడుమై మోగింది.

‘బపూక చెట్టు కింద నరుడో భాస్కరుడా!బందూకు పడితివయ్య నరుడో భాస్కరుడా!’ అని చాగంటి భాస్కర్‌ను ఉద్దేశించి ఆయన రాసిన పాట నాటి విప్లవోద్యమాన్ని గంగ శ్రీశ్రీ, రావిశాస్త్రి, చలసాని ప్రసాద్, వరవరరావు, ఎన్.కె. మొదలైన విప్లవ సాహితీమూర్తులంతా ఆ పాట పాడుకుంటూ విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో కార్యాచరణకు దిగారు. తెలుగునాట విప్లవోద్యమ సాహిత్యాన్ని వికసింప జేశారు. వియత్నాం పోరాటకవి హోచిమన్‌తో పోల్చదగిన ఉద్యమకవి శివసాగర్. ఒకచేత పెన్ను, మరోచేత గన్ పట్టిన యోధుడు.

‘నేను నిప్పును, నీరును
రణరంగంలో పోరాడే లక్షలాది సైనికుల్లో
నేనొక సైనికుణ్ణి!
సైనికుణ్ణి నేనే! ర్రణ ర్రంగాన్నీ నేనే!’
అంటూ, తత్వవేత్త హెగల్‌ను తలచుకుంటూ, వేడినెత్తుటి ధారలు ప్రవహింపజేసే కవిత్వం రాయడం శివసాగర్‌కే సాధ్యం.

విప్లవోద్యమం లోంచి, విరసంలోంచి బయటికొచ్చాక శివసాగర్, విప్లవ సాహితీ సంస్థలపై విరుచుకుపడ్డాడు. 1996 జనవరిలో జరిగిన విరసం ఇరవై ఐదేళ్ల మహాసభలకు ముందు-‘విరసం మరణించిం ది, దానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలి’ అని సంచలనాత్మక స్టేట్‌మెంట్‌నిచ్చాడు. దాన్ని విరసం జీర్ణించుకోలేకపోయింది.

విరసం వ్యవస్థాప సభ్యుడు కె.వి. రమణాడ్డి ‘శివసాగర్ అన్నట్టుగా విరసం మరణించలేదని విప్లవకారుడిగా శివసాగరే మరణించాడని’ (1996 జనవరి 13, విరసం సభలకు పంపిన సందేశం) అన్నారు. కాని నాటి, నేటి చరివూతను పరిశీలిస్తే, విప్లవకారుడిగా, విప్లవకవిగా, దళిత ఉద్యమ నాయకుడిగా, దళిత కవిగా శివసాగర్ ప్రజల మనస్సులో ఎప్పు డూ సజీవంగా ఉన్నాడు.

విప్లవ, దళిత కవిత్వాలకు శివసాగర్ నిలు మొగురం. ఆ సాహిత్య మొగురం నేడు భౌతికంగా కూలిపోయినా, ఆయనిచ్చిన స్ఫూర్తి గుండెల్లో ఎర్రజెండాలా, ఆ తర్వాత నీలిజెండాలా రెపపలాడుతూనే ఉంటుంది.

‘చెప్పులు పారేసుకొని
నెత్తుటి మడుగు దాటుతోన్న కాలానికి
కత్తి, ఆరె తీసుకుని
కన్నీళ్ళతో చెప్పులు కుట్టిన’
దళిత తాత్విక మహాకవి శివసాగర్. శ్రీశ్రీలను, దిగంబరులను, వచనకవులను దాటి ఎదిగిన తాత్విక అవగాహన శివసాగర్‌ది. అట్టడుగు కులం నుంచి, అంతర్జాతీయ విప్లవోద్య మ అవగాహనాశీలిగా ఎదగడం శివసాగర్ ప్రత్యేకత. చివరిదాకా ఆలోచనలలో, ఆచరణలో ప్రజలవైపు నిలబడ్డాడు. శివసాగర్. అందుకే అన్ని శిబిరాల్లోని కవులకు శివసాగర్ అంటే అభిమానం.

పాట రాసినా, కవిత్వం రాసినా శివసాగర్ శైలి ప్రత్యేకమైం ది. ఆయన ముద్ర పడిన కవిత్వం ప్రజల గుండెల్లోకి సూటిగా దిగాల్సిందే!

‘నడిరేతిరి పత్తికాయ
పగిలిన ధ్వని వినిపించినావు
కొండలలో చెలరేగిన
సుడిగాలిని చూపినావు’
అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు
అనే శక్తివంతమైన కవిత్వం శివసాగర్ తప్ప ఎవరు రాయగలరు

దళిత ఉద్యమపు తొలి రోజుల్లో ‘నడుస్తున్న చరిత్ర’ కవితలో మనువాదం మీద, అగ్రకులాల దొంగ విలువల మీద విరుచుకు పడ్డాడు శివసాగర్.

‘శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్డలితో నరుకుతున్నాడు’
అంటూ, తిరగబడ్డ చరిత్ర రూపాన్ని చిత్రిక పట్టాడు శివసాగర్.

ఎంత వయసొచ్చినా పసి మనస్తత్వం శివసాగర్‌ది. మనిషిని అమాంతం ఆలింగనం చేసుకొని తప్ప మాట్లాడేవాడు కాదు. ఉద్యమం నెలబాలుడైన శివసాగర్ మా తరానికి ఒక గొప్ప లెజెండ్.

శివసాగర్ మరణించాడన్న వార్త జీర్ణం చేసుకోలేనిది. ఆయన కవిత్వానికి, భావాలకు మరణం లేదు. విప్లవ, దళిత ఉద్యమాల నిలు నిలువుటద్దం పలిగిపోయింది. తెలంగా ణ ఉద్యమం నమ్మదగ్గ ఒక పోరాట యోధుని, కోల్పోయిం ది. శివసాగర్ ఆలపించిన గీతం రమణీయంగా ఎందరో పోరాటవాదుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఆయన పాట అమరత్వం పొందింది.

శివసాగర్ మాటల్లోనే చెప్పాలంటే...,
‘అమరత్వం రమణీయమైంది
ఆది కాలాన్ని కౌగిలించుకొని,
మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది’

‘శివసాగర్ కవిత్వం (1968-2008 ) పుస్తకాన్ని గుడిపాటి అచ్చువేసినప్పుడు, నేను అందులో పాలుపంచుకున్నా ను. బషీర్‌బాగ్ ప్రెస్‌కబ్ల్‌లో ఈ పుస్తకం రిలీజ్ ఫంక్షన్‌లో నేను తీసిన ఫోటోలు తీపి జ్ఞాపకాలు. 77 ఏండ్ల నిత్య యవ్వనున్ని అని చెప్పుకునే శివసాగర్ మాతో కలిసినడిచారు. నేటి తెలంగాణ దళిత, బీసీ, మైనారిటీ ఉద్యమాలలో శివసాగర్ ఇచ్చిన స్ఫూర్తి అంతర్లయలాగా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఉద్యమంలోనూ రెపపలాడే జెండాల్లో ఆయన వికసిత మోము మాకు స్ఫూర్తిదాయకంగా ముందు నడుస్తుంది.
అమరుడైన శివసాగర్ అనే పోరాట వీరుడికి తలవంచి శాల్యూట్ చేయడంతోపాటు, ఆ స్ఫూర్తిని మిగిలించుకొని ముందుకు సాగడమే నేటి తరాలు ఆయనకిచ్చే నివాళి.

విశ్రాంత యోధుడు
అడవి వెన్నెలకు నెరిసిన శిరస్సు
తుపాకీ మెరుపులాంటి చిరునవ్వు
చూపులోంచి విచ్చుకున్న గరిక పువ్వు
నిలిచిపోయిన అలలా నిర్మలమైన మనస్సు
మట్టిలో పుట్టి చెట్లలో పెరిగి
కడలితో కరచాలనం చేసి
స్వప్న సంకల్పం కోసం
యుద్ధ ఖడ్గాన్ని ముద్దాడిన వాడా
వణుకుతున్న వయస్సులోనూ
విప్లవాన్ని కలగంటున్న స్వాప్నికుడా
గాయాల నెత్తురు స్రవిస్తున్న పథికుడా
ఉద్యమాల నెలబాల్యం నుంచి నెలవంక దాకా
ఉరికంబం మీంచి మరో జగత్ వీక్షించి
ఊహల ఉయ్యాలలో ఊసులాడి
నర్రెంగ కింది బందూక్ అందుకున్న భాస్కరా
చిరుగాలి సితారా సంగీతాన్ని మీటిన వాడా!
స్వప్నం కోసం అలలు అలలుగా కలగన్నావు
ఘనీభవించిన అ కలల హోరును
తిరిగి తిరిగి ఆవిష్కరిస్తున్న విశ్రాంత యోధుడవు
(2004లో శివసాగర్‌ను కల్సినంక)
-అన్నవరం దేవేందర్

- డాక్టర్ పగడాల నాగేందర్
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?Category=1&subCategory=7&ContentId=98676

నేను నిప్పును, నీరును సైనికుణ్ణి నేనే.. రణరంగాన్నీ నేనే

అవును. శివసాగర్ ఎప్పుడూ రెండు యుద్ధాలను చేశాడు. ఎప్పుడూ యుద్ధాలు చేస్తూనే పోయాడు.
యుద్ధరంగం నుండి-యుద్ధం చేస్తూనే మరో యుద్ధ బరిలోకి తరిమివేయబడ్డాడు. కాదు.కాదు. ఆయనే శత్రువులతో తలపడడానికి తరలి వచ్చాడు.

విజేతలా వచ్చాడు. విజయోత్సాహంతో వచ్చాడు. తాను ఎక్కుపెట్టిన తాత్విక ప్రశ్నలను గురిపెట్టి వచ్చాడు. ఇంకా అవి లక్షలాది మెదళ్ళలో యుద్ధారావాలై, విస్ఫోటిస్తూనే ఉన్నాయి. వర్గంలో కులం దాగి ఉందన్నాడు. ప్రగతిశీల శక్తులు కులాన్ని పక్కన పెడితే ప్రజాయుద్ధానికి దారి లభించదని చెప్పడమే ఒక విప్లవం ఆనాడు!

బలహీనతలతోనో, యుద్ధం చేయజాలకనో యుద్ధరంగం నుండి రాలేదు. యుద్ధానికి పరుగులు నేర్పాలన్నాడు. శ్రమజీవులంతా యుద్ధ వారసులని ప్రకటించాడు. యుద్ధం నుండే కాదు ఈ లోకం నుండి ఆయన వెళ్ళిపోయినా అతని యుద్ధ తాత్వికత వెలుగు ప్రసరిస్తూనే ఉంది దశాబ్దాలు గడిచినా అతని ప్రశ్నలకు ఇంకా పరిపుష్టమైన, జవాబులు ఇవ్వని కారణంగా జరిగిన నష్టాన్ని పూరించుకోవలసి ఉంది.

విప్లవ కవిత్వానికి ‘నరుడో నరుడా’ గేయం గొప్ప ఊపునిచ్చినట్లే ‘నల్లా నల్లాటి సూరీడు’ గేయం దళిత విప్లవానికి, కొత్త భావ విప్లవానికి ఊపునిచ్చింది.

శివసాగర్ మరణం ఇప్పుడు విమర్శకులకు పెద్ద పరీక్ష పెట్టింది. తెలుగు కవిత్వాభిమానులకు మీరేవైపు అన్న ప్రశ్నను సంధించింది. జవాబుకోసం చూడాల్సిందే.

శ్రీశ్రీ ముందూ శ్రీశ్రీ తదుపరి ఎవరు మహాకవి అన్న ఆ మార్క్సిస్టు భావనకు వత్తాసుగా శ్రీశ్రీనే నిలపడానికి అగ్రవర్ణాల ప్రగతిశీలురు చేయని ప్రయత్నం లేదు. చివరకు వ్యక్తి పూజకు కూడా బరితెగించారు. మార్క్సిజానికి సమాధి తోడారు.

మహాకవులను నిలిపే ప్రయత్నంలో శివసాగర్ వాళ్ళకి కనబడలేదు. అవును. వాళ్ళు అంధ సాహిత్య సామ్రాజ్యవాదులు. కుహనా అభ్యుదయ ఛాందసులు. విప్లవ కవిత్వానికి కొత్త వనె్నలు అద్దిన శివసాగర్ వారికి సరిగ్గా కనబడడం లేదు. నవ్య వ్యక్తీకరణ, కవిత్వ సౌందర్య భావనలని సమన్వయించి తాజాదనపు పరిమళాలు అద్దిన శివసాగర్ కనుపించకపోవడం తెలుగుజాతి చేసుకున్న దౌర్భాగ్యం. ఆంగ్ల, ఫ్రెంచి కవిత్వాలను అనువదించిన వాళ్ళు మహాకవులయ్యారు. రష్యన్ ఉద్యమాల ప్రేరణని ఇతివృత్తంగా మలిచినందుకు అవార్డులు పొందారు. సినీ రొంపిలో బతుకంతా గడిపి వందలాదిగా పాటలు రాస్తే దాంట్లో ప్రగతి వాసనలను పీల్చారు.

వీటన్నింటికి దూరంగా గంగలు దాటి, అడవులు దాటి కొండలు దాటి కోనల్లోని సోదరులతో కలిసి యుద్ధం చేసిన శివసాగరుడు దూరపువాడయ్యాడు. విచిత్రం ఏమంటే ఆ యుద్ధాన్ని అభిలషించే వాళ్ళకు కూడా దూరపువాడు కావడానికి కారణం కేవలం అతని మహోజ్వల కవిత్వమే. అతని ఛాయల స్థాయిని కూడా అందుకోనివారు కవులు అయ్యారు. అతని కవిత్వాన్ని కాపీ కొట్టి సాహిత్య అకాడమీ తదితర అవార్డులు సైతం కొందరు పొందారు.

శివసాగర్ కవిత్వం చదివి సాహిత్యలోకం ఎంతో ప్రభావితమైంది. కాని అతడికి తమ కృతజ్ఞతలు తెలుపుకోలేదెవరూ. శివసాగర్, గద్దర్‌ల కవిత్వం లేకపోతే విప్లవ కవిత్వం నినాద కవిత్వం అన్న విమర్శకుల మాట నిజమయ్యేది!
ఒక చేత ఆయుధంతో యుద్ధం, మరో చేత కలంతో యుద్ధం. వర్గపోరాటం చేస్తూ, భావ విప్లవరంగంలో పోరాడుతూ ఒక ప్రజాకవి ఎంతటి అత్యున్నత శిఖరాలు అందుకోగలడో శివసాగరే ఉదాహరణగా నిలుస్తాడు. ఆనాటి పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటకు వచ్చాక ఎంతోమందితో కలిసి పనిచేశాడు. చాలామంది శివసాగర్‌ని ఆసరా చేసుకున్నారు. కానీ శివుడు మాత్రం తొణకలేదు, బెణకలేదు. ఎవరితో ఎంతవరకో అంతే. అంతేకాని ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భావ సంఘర్షణకి లోనయ్యాడన్నది మాత్రం నిజం.

అడుగు వర్గాల ప్రజల చైతన్యానికి అతనొక సంకేతం. వాళ్ళ గుర్తింపుకోసం అహర్నిశలూ తపించాడు. ఎక్కడా ఏనాడూ తన కలాన్ని తప్పుగా వాడలేదు. మనుమలు, మనుమరాళ్ళ మీద కవిత్వాలు రాయలేదు. అవకాశవాదంలోపడి నర్సుల మీద కవితలు రాయలేదు. రాజ్యంతో చెట్టాపట్టాలు వేయలేదు. ఇతరుల్లాగా ద్వంద్వ నీతులు పలికే నాలుకను, కలాన్ని వాడుకోలేదు. రాజ్యంతో చెట్టాపట్టాలు వేస్తూ తాను మాత్రం విప్లవ హీరో కావాలనుకోలేదు.

పార్టీ స్థాపకులు కొందరు తరువాతి కాలంలో మితవాద పక్షం ఆవహించి, బయటికొచ్చాక కులీనులు కొందరు వాళ్ళ పాదాక్రాంతం అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాని శివసాగరుడు ఒక అస్పృశ్యుడు! అందుకే కొందరు పెద్దలు సాహిత్యంలో అతని ఆచూకీని మలపాలనుకున్నారు. అతడి మీద నిందలు వేశారు. రాజకీయంగా హత్య చేయాలని చూశారు. కానీ ప్రజలు అతడి పక్షం నిలిచారు. అతని కవిత్వ అభిమానులు ఆరు పుస్తకాలు కలిపి శివసాగర్ కవిత్వం (1956-2008) అనే సమగ్ర కవిత్వ సంకలనం తెచ్చారు. గుర్రం సీతారం, గుడిపాటి, కీర్తిశేషులు డాక్టర్ హరీష్‌ల శ్రమకు గుర్తుగా ఆ సంకలనంలో శివుడు సజీవుడు.

శివుడు విప్లవ దళిత కవిత్వ సౌందర్య శాస్త్ర నిర్మాత. అతని కవిత్వ బీజాలు నిండిన తెలుగునేల ఒక గొప్ప సాంస్కృతిక విప్లవానికోసం ఎదురు చూస్తున్నది. విప్లవం మనుషులకోసం. మానవతా సాగరంలో కవిత్వ నావలను సిద్ధం చేసి ఉంచాడు. తాను మాత్రం తిరిగిరాని లోకాలకెళ్ళినా, తన అక్షరాలను సామాన్య ప్రజల తరపున ఆయుధాలుగా విల్లు రాసి పోయాడు. అతని కవితలు ఒక నవ్య చైతన్య కేతనాలు.

శివసాగర్‌కి అవార్డులు లేవు. శివుడి పేర కవులకి అవార్డులు ఇచ్చేవారు లేరు. అతని సాహిత్యంపై పుంఖాను పుంఖాలుగా రచనలు చేయలేదెవరూ. కాని అతని పేరు ఒక్కటి చాలు. తెలుగు కవిత్వానికి వేల వెలుగు దివ్వెలుగా ప్రకాశింపచేస్తుంది.

ఆ శివసాగరుడికి కన్నీళ్ళ జేజేలు!
వినమ్రంగా తలవంచిన సెల్యూట్

-జయధీర్ తిరుమలరావు 18042012
http://www.andhrabhoomi.net/content/tribute

-- సత్యమూర్తికి నివాళి --

విప్లవ స్వాప్నికుడు.. శివసాగరుడు

శివసాగర్ ఒక స్వాప్నికుడు. భావనా ప్రపంచంలోనే కాదు, కార్యరంగంలోనూ ఆయన స్వాప్నికుడే. కవిగా, విప్లవకారుడిగా శివసాగర్ ఓ రొమాంటిక్. ఆయన కవిత్వానికన్నా కార్యరంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పవచ్చు. కవిత్వాన్ని ఆయన తన కార్యరంగానికి ఉత్ప్రేరకంగా వాడుకున్నారని అనిపిస్తుంది. తనకు తాను సర్దిచెప్పుకోవడానికి తాను కలలు కనే సమాజం ఏర్పడి తీరుతుందని గుండె దిటవు చేసుకోవడానికి ఓ కలల ప్రపంచాన్ని నిర్మించుకున్నట్లు అనిపించేవాడు. అందుకే ఆయన రాజకీయ క్షేత్రంలో ప్రయోగాలు చేస్తూ వెళ్లారు. మూడు దశాబ్దాలపాటు తాను కలలు కన్న సమాజాన్ని సృష్టించడానికి విప్లవోద్యమంలో పనిచేశాడు. అక్కడినుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన రాజకీయాలను వదులుకోలేదు. రాజకీయాలతో ప్రయోగాలు చేస్తూ వెళ్లాడు. విప్లవోద్యమ ఆచరణను, మార్క్సిజం పరిమితులను కూడా ఆయన ప్రశ్నించారు. అందుకే ఎదుటివాళ్లకు సమాధానం చెప్పాలని అనుకున్నారో, తనను తాను సంతృప్తిపరుచుకోవడానికి ప్రయత్నించారో గానీ రాజకీయాలు మాత్రం వదిలిపెట్టలేదు. అయితే, విప్లవోద్యమం నుంచి వచ్చిన తర్వాత చేసిన రాజకీయ ప్రయోగాలన్నింటిలోనూ ఒక ఏకసూత్రత ఉంది. అది దళితోద్యమానికి సంబంధించిన ఏక సూత్రత.

బయటకువచ్చిన తర్వాత కాన్షీరాం నాయకత్వంలోని బిఎస్పీలో చేరారు. ఇంకా మరికొన్ని పార్టీల్లోనూ చేరారు. ఆయన ఆలోచనా పరిధికి, ఆచరణ పరిధికి అవి సరిపోలేదు. దాంతో ఎక్కడా ఉండలేకపోయారు. కానీ ఒక మహా విప్లవం తేవాలని మాత్రం ఆయన కలలుకన్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆయన ఎంత రాజకీయ కార్యకర్తనో అంతగా కవి కూడా. కవిగా చెప్పాల్సి వస్తే అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీని నాయకుడిగా నిలబెడితే, విప్లవ కవిత్వానికి శివసాగర్‌ను నాయకుడిగా నిలబెట్టాల్సి వస్తుంది. రాజకీయాలను ఓ భుజాన, కవిత్వాన్ని మరో భుజాన మోస్తూ వచ్చాడు. ఉద్యమం నెలబాలుడు కవిత్వం ఆయన రాజకీయ విప్లవ కవిత్వానికి మార్గదర్శనం చేస్తుంది.
 
ప్రత్యామ్నాయ రాజకీయాలను కళాత్మకంగా శివసాగర్ కన్నా బలంగా వ్యక్తీకరించిన కవి తెలుగులో లేడు. బహుశా ఉండకపోవచ్చు కూడా. అయితే, ఆయన పాయ మాత్రం ఒకటి సాగుతూనే ఉన్నది. ఆ పాయ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో నిబద్ధతకు కాకుండా నిమగ్నతకు సంబంధించింది. ఆ రకంగా ఆయన విప్లవ కవిత్వానికి నాయకుడు.
తాను నిరాశలో ఉన్నప్పుడు కవిత్వం రాశానని ఆయన ఓసారి నాతో అన్నాడు. శ్రీకాకుళోద్యమం వెనుకంజ వేసిన తర్వాతనే తాను ఉద్యమం నెలబాలుడు కవిత్వాన్ని రాశానని చెప్పుకున్నాడు. అంటే, పోరాటంలో ఉన్న వ్యక్తి వైఫల్యంలో ఉన్నప్పుడు కావాల్సిన ఉత్సాహాన్ని ప్రోది చేసుకోవాలి. అలా ప్రోది చేసుకోవడానికి ఆయన కవిత్వం రాశారని చెప్పవచ్చేమో. కానీ, రాజకీయాలను అత్యంత కవితాత్మంగా చెప్పే పని కూడా ఆయన చేశారు. అది కూడా అలాంటి స్థితిలోనే చేశారేమో కూడా. ఆయన రాసిన కవితా పంక్తులు ప్రత్యామ్నాయ రాజకీయాలను నడుపుతున్న వారికి నినాదాలుగా మారాయి.

 శివసాగర్‌కు విప్లవ కవుల్లో బాగా నచ్చినవారు చెరబండరాజు, గద్దర్. వీరిద్దరి కవిత్వం కూడా అంతే. గొప్ప కాల్పనికతతో నినాద స్థాయికి ఎదిగిన కవిత్వం వీరి విషయంలోనూ చూస్తాం. తెలంగాణ జిల్లాల్లోని జానపద బాణీలను స్వీకరించి ఆ బాణీలను విప్లవీకరించారు. కార్యాచరణకు పురికొల్పే కవిత్వం రాశారు. దళిత వాదాన్ని అక్కున చేర్చుకున్న తర్వాత కూడా అదే నిమగ్నతతో కవిత్వం రాశాడు. నల్లసూర్యుడు కవిత దళిత కవిత్వానికి ఒక నమూనా. శివసాగర్ రివల్యూషనరీ రొమాంటిక్. ఇది ఆయన విప్లవకారుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు. దళిత కార్యకర్తగా ఉన్నప్పటి కాలానికి కూడా వర్తిస్తుంది. తన కవిత్వం ప్రధానంగా తనకు సంబంధించిన రివల్యూషనరీ సైకాలజీ కళాత్మక పరిశోధన అని ఆయన చెప్పుకున్నాడు.

రివల్యూషనరీ పర్సెప్షన్‌లో మార్పు వచ్చిందనే విషయాన్ని ఆయన అంగీకరించలేదు. తన కవిత్వం విప్లవ ప్రస్థానమని, అది దానంతటదే విప్లవంతో పెనవేసుకుపోయిందని, తన అభిప్రాయంలో నిజమైన విప్లవం జీవితంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన అన్ని పార్శ్వాల తలుపులు తడుతుందని, విప్లవం గానీ విప్లవ కవిత్వం గానీ రాజకీయ రంగం ఒక్కదానికే పరిమితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి విప్లవ కార్యాచరణ నుంచి దళిత విప్లవ కార్యాచరణకు వచ్చానని ఆయన స్పష్టంగానే అనుకున్నారని చెప్పవచ్చు. విప్లవ కార్యాచరణ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావడానికి ఆ కార్యాచరణ తాను నమ్మినట్లు అన్ని పార్శ్వాల తలుపులు తట్టకపోవడమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికాంశాలను ప్రధానంగా చేసుకుని సాగుతున్న రాజకీయ ఉద్యమానికి సరిజోడుగా సాంస్కృతికోద్యమం సాగాలని కూడా ఆయన నమ్మినట్లు చెప్పవచ్చు. ఎవరి పని వారు చేసుకోవడమనేది సంస్కృతిలో ఇమిడి ఉందని ఆయన అనుకునేవారు. విప్లవోద్యమం ఫలించిన దేశాల్లో కూడా అది అమలుకాలేదని ఆయన భావించారు. సాంస్కృతికోద్యమం జరగకుండా జరిగే అభివృద్ధి ఏదీ గుణాత్మకం కాదని ఆయన విశ్వసించాడు.

ఆ కారణంగానే ఆయన దళిత ఉద్యమాన్ని అక్కున చేర్చుకున్నాడని, కేవలం పుట్టుకతో దళితుడైనంత మాత్రాన కాదని మనం అర్థం చేసుకోవడానికి తగిన భూమిక శివసాగర్ వద్ద ఉండేది. దళిత వాదం ఆధిపత్య సంస్కృతిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చింది. స్థిరీకృత విలువలు ఆధిపత్య సంస్కృతికి సంబంధించినవి. నిటారుగా కనిపిస్తున్న విలువలు ఆధిపత్య భావజాలానికి సంబంధించినవి, వాటిని తలకిందులు చేయడమే దళితవాదం చేయాల్సిన పని. దానికి వాహికగానే దళితవాద సాహిత్యం ముందుకు వచ్చింది. ఈ దళితవాద సాహిత్యంలో ఆయన దళిత ఈస్తటిక్స్‌కు అర్థం చెప్పే పనిచేశాడు. నల్లసూరీడు కవిత అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది.

శివసాగర్ ఆచరణను, కవిత్వాన్ని వేరుచేయడానికి కుదరదు. ఆయన ఆచరించింది, ఆచరించాలని అనుకున్నది మాత్రమే ఆయన కవితా వస్తువు అయింది. అది కేవల వచనం కాదు. కళాత్మక అభివ్యక్తి. రాజకీయ కార్యకర్తగా కెజి సత్యమూర్తి విఫలమయ్యాడో, కొంత మేరకైనా సఫలమయ్యాడో చెప్పలేం గానీ కవిగా ఆయన మరెవరూ అందుకోని స్థాయికి చేరుకున్నాడు. పురాణ ప్రతీకలకు ఆయన కొత్త అర్థం చెప్పాడు. శంభూకుని చేతిలో రాముడ్ని వధింపజేశాడు. ఇలా పురాణాల్లో విజయం సాధించిన నాయకులను పరాజితులుగా, పరాజితులను విజేతలుగా చూపించాడు. అంటే, సమాజంలోని విశ్వాసాలపై కవిత్వం వేటు వేశాడు. అంటే, విజేతలు కావాల్సిన వారు పరాజితులుగా మిగిలిపోకూడదని ఆయన భావించాడు. ఆధిపత్య సంస్కృతిని దళిత సంస్కృతి, లేదంటే ద్రావిడ సంస్కృతి ఓడించాలని ఆయన కలలుకన్నాడు. అందుకు అనుగుణంగానే దళిత కవిత్వాన్ని రాశాడు.

ఉద్యమం నెలబాలుడు నుంచి నడుస్తున్న చరిత్ర దాకా వచ్చిన కవిత్వం ఆయనలోని విప్లవ దళితుడిని, దళిత విప్లవకారుడిని చూపిస్తుంది. విప్లవ దళితవాదం హేతువాదాన్ని ఆశ్రయించింది. ఆ హేతువాదం వల్ల దళితుల పీడన అప్పుడు ఆ స్థాయిలోనే వ్యక్తమైంది. గుడిలోకి రావద్దన్నావు, నువ్వు రానీయకపోవడమే మంచిదైంది (ఇవే చరణాలు కావు) అని సలంద్ర కవిత్వం చెప్పాడు. అంటే, ఆధిపత్య సంస్కృతితో విప్లవాచరణలోని దళితవాదం ఘర్షణను నివారించింది. రెండు విరుద్ధశక్తుల మధ్య హేతువాదం ఘర్షణను నివారించింది. అదే సమయంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని నిలబెట్టలేకపోయింది.

దళితవాదం ఘర్షణకు మార్గం వేసింది. ఇది సాంస్కృతిక రంగంలో జరగాల్సిన ఆచరణకు దారి తీసింది. ఈ విషయం శివసాగర్‌కు బాగా తెలుసు. అందుకే తన కవిత్వంలో పురాణ ప్రతీకలను తిరగేసి చెప్పాడు. దళిత విప్లవకారుడిగా ఆయన ఆ పని చేశాడు. ఆ క్రమంలోనే ఆయన దళిత కవుల్లో పైడి తైరేష్‌బాబును, మద్దూరి నగేష్‌బాబును ఇష్టపడ్డాడు. నల్లగొండ దళిత కవులను ప్రేమించాడు. మొత్తంగా రాజకీయ కార్యాచరణకు సంబంధించిన అనివార్యత ఆయన కవిని చేసింది.


దళిత ఈస్తటిక్స్ అంటే ఏమిటో, దళిత కార్యాచరణ ఎలా ఉండాలో నిర్దేశించాల్సిన సమయంలో ఆయన లేకుండా పోయారు. అతను ఈ కాలపు హీరో. ఆయనకు నివాళులు సరిపోవు. (చిత్రం) సత్యమూర్తి ఉరఫ్ శివసాగర్

- కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
23042012
http://www.andhrabhoomi.net/content/siva-sagar

విప్లవ దళిత కవితాయోధుడు శివసాగర్‌

ఆంధ్రదేశాన్ని ఈ అర్ధశతాబ్దిలో మలుపు తిప్పిన కవుల్లో, ఉద్యమకారుల్లో, పోరాట వీరుల్లో అగ్రగామిగా నిలబడినవారు కె.జి.సత్యమూర్తి. ఆయన పోరాట యోధుడు.  కవిగా శివసాగర్‌. కవి అంటే సామాన్య మైన కవి కాదు ఆకాశాన్ని భూమికి దించగలిగిన కవి. పదాల్ని ఈటెలుగా, ఆయుధాలుగా మార్చగలిగిన కవి. సూర్యుణ్ని రాత్రులు ఉదయింపచేయగలిగిన కవి. విప్లవ కవిత్వం అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చెప్పిన కవి. సత్యమూర్తి సమాజపు అట్టడుగు లోయల్లో జన్మించారు. సమాజాన్ని తాత్వికంగా అర్ధం చేసుకున్నారు. ఆయనది నిశితమైన దృష్టి, తీక్షణమైన అధ్యయనం. ఆయనది యుద్ధ ప్రయాణం. ఆయన గీతం సమరగీతం. ఆయన శత్రువుని గుర్తించిన యోధుడు. ఏ సందర్భంలోను శత్రువుతో రాజీపడని నాయకుడు. అంతర్గత శత్రువుని కూడా గుర్తించిన మేధావి.

ఆయన యుద్ధం సామ్రాజ్య వాదం పైన, పెట్టుబడిదారీ వ్యవస్థపైన, బ్రాహ్మణవాదం పైన, నిరంకుశ పాలనపైన ఆయుధాన్ని, కలాన్ని అంత పదునుగా వాడినవాడు తెలుగు నేలపైన మరొకరు లేరు. ఆయన ప్రభావం నుండి తప్పుకోవడం తెలుగు నేలలో ఏ విప్లవ రచయితకు సాధ్యం కాలేదు. ఆయన ముద్ర బలమైంది. ఆయన ప్రేమికుడు. విశ్వ ప్రేమికుడు. విశ్వాంతరాళలో ఉండే జీవన సౌందర్యాలని ఆయన సూక్ష్మ చక్షువుతో చూశాడు. ఆయన విప్లవ సాహిత్యాన్ని నరుడో భాస్కరుడో కవితతో జానపద బాణీలోకి ఇమిడ్చాడు. జానపద సంస్కృతిలో ఉన్న కాల్పనిక భావాన్ని విప్లవవెలుగులో తీర్చి దిద్దాడు. ఆయన శ్రీశ్రీ కవిత్వానికి స్ఫూర్తి పొందిన హో-చ్‌-మెన్‌ కవిత్వంతో మమేకమయ్యాడు. అప్పటి వరకు విప్లవ కవిత్వంలో వస్తున్న ఆవేశానికి ప్రకృతిని పలుకుబడిని, కాల్పనికతని, సౌందర్యాన్ని సమన్వయించిన మహాకవి.

గురజాడ అప్పారావు పూర్ణమ్మ కథతో స్ఫూర్తి పొందిన చెల్లీ చెంద్రమ్మని ఒక పోరాట యోధురాలుగా తీర్చిదిద్ది చెరిగిపోని చిత్రాన్ని గీసిన మహాశిల్పి. నిజానికి చెల్లీ చెంద్రమ్మా అనే పాట తెలుగు సాహిత్యానికి మకుటగీతం. గురజాడ అప్పారావు పూర్ణమ్మ కథ ఆత్మహత్యతో ముగిస్తే చెల్లీ చెంద్రమ్మ కథ విప్లవ విజయంతో ముగుస్తుంది. అయితే గురజాడ అప్పారావు పాటకు వచ్చినంత ప్రచారం దీనికి రాలేదు. దానితోపాటు మల్లెపూవ్వు వంటి నా చెల్లీ చెంద్రమ్మా అనే ప్రయోగంతో తెలుగు సాహిత్యంలోనే అలంకార శాస్త్రాన్ని తిప్పి రాశాడు. పాత్ర చిత్రీకరణ ఒక్క పది పదాలతోనే మనకు బొమ్మ కట్టించాడు. ఒక కావ్యానికి ఉన్న లక్షణాలన్ని ఒక్క పాటలోనే తీసుకొచ్చాడు. ఒక పాటని ఒక కావ్యంగా తీర్చిదిద్దిన మహాకవి శివసాగర్‌.

తెలుగు నుడికారంతోనే నాటకీయ ఫక్కీలో దృశ్యీకరిస్తు న్నారు. వాడిని పసిరిగ పాముతో పోల్చడంతో మొత్తం కవి తన చాతుర్యాన్ని చాటుకున్నాడు. కవి సామర్ధ్యం ఇక్కడే ఉంది. పదాలు చిన్నవి దృశ్యం పెద్దది. దృశ్యంలో మళ్ళా నాటకీయత అందుకే శివసాగర్‌ యుగ కవి అయ్యాడు.

శ్రామికుల్ని చుక్కలుగా పోల్చడంలో కవి మహోన్నత వ్యక్తిత్వం మనకుకనిపిస్తుంది. ఒక యుగ కవిత్వానికి నాయకత్వం వహించగల శక్తి శివసాగర్‌కు ఇక్కడే వచ్చింది. నాజర్‌ బుర్రకథలోని బీభత్సరస సంఘటనలు ఇక్కడ మన కళ్లకు కట్టనట్లు కనిపిస్తాయి. శివసాగర్‌ చెప్పిన కవిత్వం తెలుగు సాహిత్యానికే మకుటా యమానం.

నరుడో! భాస్కరుడా! విప్లవ సాహిత్యానికి మాతృగీతం

నిజానికి జానపద సాహిత్యం అది పౌరాణికంగా హిందూ సంస్కృతి ప్రభావంతో ఎన్నో మార్పులకు గురైంది. బ్రాహ్మణవాద ప్రభావం జానపద సాహత్యంపైన పడింది. కానీ శివసాగర్‌ ప్రత్యామ్నాయ విప్లవ సంస్కృతికి జానపద బాణీని, సాహిత్యాన్ని మలిచారు. ఈ కంట్రీబ్యూషన్‌వైపు పరిశోధన జరగవలసి ఉంది. జానపద సాహిత్యంలో ఆయన ఎన్నో విలువైన అంశాలని స్వీకరించారు.

తెలంగాణలో మెదక్‌ జిల్లాలో రహస్య జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు గ్రామ ప్రజలు 'నరుడో నారపరెడ్డి అనే పాట పాడుతూ 'ధూల ఆడటం చూసిన నేను ఆ జానపద గీతంలోని రూపాన్ని సొంతం చేసుకొని ఈ గీతం రాశాను. ఈ గీతంలోని భాస్కరుడు డాక్టర్‌ చాగంటి భాస్కరరావు. గుంటూరు జిల్లా నుండి శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొనటానికి వచ్చి అమరుడైనాడు. దీన్ని శ్రీశ్రీ టైటిల్‌సాంగ్‌ అన్నాడు. దీన్ని రావిశాస్త్రి ఆల్కహాలిక్‌ హైమ్‌ అన్నాడు. (విరసం ఇది విప్లవ సాహిత్యానికి దిశానిర్దేశం చేసింది అన్నది).

విప్లవ కవిత్వానికి ఈ కవిత మాతృగీతం. జననాట్యమండలి నిర్వహణ కర్త గద్దరు పైన ఈ పాట ప్రభావం బలంగా ఉంది. గోరంటి వెంకన్న వంటి జానపద బాణీలో పాటలు, కవిత్వాలు రాస్తున్న వారంతా ఈ పాట నుండి స్ఫూర్తి పొందినవారే.

తాత్విక కవి
శివసాగర్‌ మార్క్స్‌ను, లెనిన్‌ని, మావోను చదివాడు, హో-చి-మెన్‌ని ఆవహనం చేసుకొన్నాడు, గోధేని అధ్యయనం చేశాడు. తెలుగు సాహిత్యాన్ని చదివాడు. ఈ క్రమంలో నరుడో భాస్కరుడా విలువాడ వంటి పాటల్ని విశ్లేషిస్తే ఒక గ్రంథమే అవుతుంది. ఇంకా శివసాగర్‌ పాటల మీద రావాల్సినంత సామాజిక, సాహిత్య విశ్లేషణ రాలేదు. ఒక చోట లెనిన్‌ అన్నట్టు ''తిరుగుబాటును కళగా చూస్తే తప్ప మార్క్సిజంకు విధేయంగా నిలిచి ఉండటం, విప్లవానికి విధేయంగా నిలిచి ఉండడం అసాధ్యం (వి.ఐ.లెనిన్‌ యేరిన రచనలు మూడవభాగం, పేజి నెం.19). యుద్ధంలోకి పోయినవాడు 'నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని ఆక్రందిస్తే అది యుద్ధ నీతికి భిన్నమౌతుంది. శివసాగర్‌ యుద్ధాన్ని యుద్ధంగానే ప్రకటించాడు. యుద్ధ యోధుడిగానే జీవించాడు. ఆయనకు తిరుగుబాటు తప్ప అభ్యర్థన ఆక్రందన తెలియదు. అందుకే ఆయన కవిత్వంలోని పాత్రలు సజీవమయ్యాయి.

ఆయన అధ్యయనం నుంచే కాకుండా జీవితం నుంచి మాట్లాడుతున్నాడు. లిఖిత సాహిత్యంతోపాటు మౌఖిక జీవన వ్యవస్థల్ని అధ్యయనం చేసిన కవి ఆయన. గురజాడ, శ్రీశ్రీ లిఖిత సాంప్రదాయానికి చెందిన కవులే అవుతారు. కానీ శివసాగర్‌ లిఖిత మౌఖిక సంస్కృతుల సమ్మేళనం నుండి ఆవిర్భవించిన యుగకవి. ఆయన తాత్వికుడు. తత్వశాస్త్రం రానివాడు యుగ కవిత్వానికి నేతృత్వం వహించలేడు. అందుకే ఆయన గురించి మాట్లాడటానికి చాలామందికి శక్తి చాలటం లేదు. కారణం ప్రజల్లో జీవించి వారి దుఃఖాల నుండి వారి ఆవేశాల నుండి మాట్లాడటం అందరికీ సాధ్యంకాదు. తెలుగులో ఎక్కువ మంది కవులు తమ గురించే మాట్లాడుకుంటారు. అందుకే వారి కవిత్వం తమతోపాటే ముగుస్తుంది. గుర్రం జాషువాలో ఉన్న కరుణ రసార్థ్రత శివసాగర్‌లో కనిపిస్తుంది. రాసిన పద్ధతి వేరు కావచ్చు. పోరాట పంథా వేరు కావచ్చు. సిద్ధాంత అవగాహన కూడా వేరుగావచ్చు. అర్థ్రత మాత్రం ఇద్దరిదీ ఒకటే. కారణం వారిద్దరూ దళితవాడలో పుట్టడమే.

కవిగా సూర్యుడు
ఇక పాట నుండి కవిత్వానికి వస్తే ఆయన కవిత్వం ఒక పాలపుంతకు ఉన్నత విస్తృతి కలిగింది. ప్రపంచ సామ్రాజ్యవాద దిశ నుండి ఆయన కవిత్వం మాట్లాడుతుంది. ఆయన కవిత్వంలో చిక్కదనం ఎక్కువ. ప్రతీకలను సందర్భోచితంగా వాడటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ కవికి చంద్రుడు అంటే ఇష్టం. వెన్నెలంటే మరీ ఇష్టం. చంద్రుణ్ని, వెన్నెల్ని మనం చూసినట్టు చూడడు.

దళిత కవిత్వంలో పెద్ద మలుపు
ఆయన దళిత కవిత్వంలోకి రావడం పెద్ద మలుపుకు దారితీసింది. ఒక సూర్యుడు దళిత సాహిత్యంలో ఉదయించినట్ల యింది. ఆయన అంబేడ్కర్‌ని అధ్యయనం చేయడం, అంబేద్కర్‌ సూర్యుడు రాయడం ఆయన మహాత్మాఫూలేని అధ్యయనం చేయడం ఇవన్నీ తెలుగు నేలలో దళిత ఉద్యమ ఉధృతికి కారణమయ్యాయి. ఒక ఉద్యమాన్ని పటిష్టమైన కవి చూసే పద్ధతి వేరు. శివసాగర్‌ ఇప్పటి వరకు రాస్తున్న దళిత కవిత్వానికి పదును పెట్టాడు. విప్లవ సాహిత్యంలో ఆయన చేసిన అనేక ప్రయోగాలని దళిత సాహిత్యానికి కూడా అన్వయించాడు.
ఈ పాట మొత్తం దళిత సాహిత్యంలో ఒక కుదుపు తెచ్చింది. ఒక పరిణామానికి దోహదం చేసింది. దళిత సామాజిక ఆధునిక ఉద్యమం కారంచేడు పోరాటంతో ప్రారంభమైంది.

తెలుగు జాతి వైతాళికుడు
ఆంధ్రదేశంలో రెండు ప్రధానమైన ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒకటి మార్క్స్‌ సిద్ధాంతాలను అనుసరించింది. రెండు అంబేడ్కర్‌ సిద్ధాంతాలను అనుసరించేవి. ప్రతి కవిత్వం తత్వశాస్త్రం నుంచి ఆవిర్భవించాల్సిందే. ఈ రెండు ఉద్యమాలు పరస్పర సంబంధితాలు. సమసమాజాన్ని ఆకాంక్షిస్తున్నవి అందుకోసం కృషి చేస్తున్నవి. ఈ రెండు ఉద్యమాల్లో కీలకమైన భాగస్వామ్యం సత్యమూర్తికి ఉంది. ఆర్థిక సామాజిక వాదం రెండవది సామాజిక ఆర్థికవాదం ఈ రెండు ఉద్యమాలను సమన్వయం ఒక చారిత్రక అవసరం. ఈ చారిత్రక బాధ్యతను నిర్వర్తించగలిగినవాడు కూడా సత్యమూర్తే. సమాజాన్ని మార్చి తత్వశాస్త్రం తప్పకుండా సమకాలీనం కావాలి. స్థల, కాల, నిర్దేశితలు కలిగి అది వర్తించాలి.

కవి ఎంత శక్తివంతుడైనా తత్వశాస్త్రానికి అనుచరుడే. మిత్ర వైరుధ్యం కలిగిన తత్వ శాస్త్రాల్ని సమకాలీనంగా అన్వయించడంలోనే తత్వవేత్త ప్రధాన బాధ్యత ఇమిడి ఉంది. డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ తత్వశాస్త్రం ఈనాడు ప్రపంచవేత్తలందరిని తనలో ఇముడ్చుకోగలిగిన సామర్ధ్యం ఉంది. బౌద్ధాన్ని ఒక సాంస్కృతిక విప్లవంగా ఈనాడు కమ్యూనిస్టులు స్వీకరించాల్సిన బాధ్యత ఉంది. ఈ తాత్విక పోరాటాల్ని రెండు శిబిరాలతోటి సమమైన ప్రాతనిధ్యం కలిగిన శివసాగర్‌ చేస్తూనే ఉన్నారు. ఆయన తెలుగు జాతికి ఒక వైతాళికుడు. శివసాగర్‌ కవిత్వంలోని తెలుగు పదాలు నిఘంటువుగా రూపొందించి కవిత్వ శిల్పం మీద అలంకార శాస్త్రాన్ని రచించినట్లయితే ఇంకా వేలాది మంది కవులు ఆవిర్భవించే అవకాశం ఉంది. ఈ పనిని తెలుగుజాతి ఎంత త్వరగా చేసుకోగలిగితే తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకి, పోరాటానికి అంత త్వరగా సజీవ చేకూరుతుంది. ఆయనది తిరుగులేని ప్రయాణం. అది ఆగదు.
 
డా. కత్తి పద్మారావు
బుధవారం , ఏప్రిల్ 18 ,2012
http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=2363&cid=1033

యిటు వంటి మనిషి ఇక దొరకడు

సత్యమూర్తి ని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికీ వారు తేల్చుకోవాల్సిందే కానీ తప్పకుండా అందరు అర్థం చేసుకోవాల్సిన మనిషి అతను. నిజాయితిగా అర్థం చేసుకోగలిగితే అతను కవులకు మహాకవి గ అర్థం అవుతాడు, విప్లవకారులకు గొప్ప విప్లవ నాయకుడు గా అర్థం అవుతాడు. పేదలకు అతనొక్క మహా పేదవాడుగ అర్థం అవుతాడు. తత్వవేతలకు అతనొక్క గొప్ప తాత్వికుడు, ఒకమనిషిని అర్థం చేసుకోవాలంటే అతని రచనలను అర్థం చేసుకుంటే సరిపోతుంది కావచు కానీ, సత్యమూర్తి ని అర్థం చేసుకోవాలంటే అతని రచనల తో పాటు అతని బ్రతుకుని అర్థం చేసుకోవాలి

సాంప్రదాయ అగ్రకుల మద్య తరగతి విప్లవ నాయకులకు, విప్లవ కవులకు ఉన్నటువంటి అనేకానేక సౌకర్యాలకు  సత్యమూర్తి దూరంగా ఉన్నాడు, అతను వాటిని పొందలేక కాదు, కల్పించుకోలేక కాదు.అతను దేనికోసం రాసాడో దానికోసమే బ్రతికాడు సత్యమూర్తి కవిత్వానికి బ్రతుకుకు మద్య contradiction లేదు. విప్లవకారుడిగా మారిన తర్వాత అతని జీవిత కాలం లో కేవలం గత మూడు సంవత్సరాలే అంటే తన చివరి రోజులు . తను వదిలి వెళ్ళిన తన పిల్లలు దగ్గర గడిపాడు. 2009 వరకు ఏదో ఒక కార్యక్రమం లో ఎవరో ఒకరి తో తిరుగుతూనే ఉన్నాడు 

ప్రదానంగా తెలంగాణ ప్రాంతం లో ఇప్పటికి  ఉన్న తన అభిమానుల వెంటనే ఉండేందుకు ఆసక్తి చూపించేవాడు. ఇక్కడికి వచ్చిన సమయంలో ఆరోగ్య సంబందమైన సమస్యలు వచ్చి తన కూతురు తో తిట్లు తింటూ కూడా ఇక్కడే గడిపిన సందర్బాలు అన్దేకం ఉన్నాయ్.  అతనిది కవిలాంటి జీవితం కాదు కవిత్వం లాంటి జీవితం. అతని కవిత్వాన్ని జీవితాన్ని వేరు వేరు గ చూడలేము. అతను ఎ సిద్ధాంతాలు, ఎ రాజకీయాలు నమ్ముకున్నాడో వాటితోనే కాదు అతను ఎ ప్రజలను నమ్ముకున్నాడో జీవితాంతం అదే ప్రజలమధ్య, అదే పేదల మద్య బ్రతికాడు అదే ఇతర కవులకు, సత్యముర్తికి ఉన్న తేడా

సత్యమూర్తి తో కలిసి గడిపిన వారు ఎవరైనా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేరు. అతని మాటలు, మనం సమస్యలనుకునే వాటిని అతను చూసే ద్రిష్టి చాల బిన్నంగా ప్రత్యేకంగా ఉండేవి మనం చిన్న చిన్న విషయాలు  అనుకునే విషయాల పట్ల కూడా సత్యమూర్తి కి చాల స్పష్టమైన ఖచితమైన అభిప్రాయాలూ ఉండేవి. ఎంత గంబీరమైన వ్యక్తో అంత హాస్యంగా కూడా ఉండేవాడు

సత్యమూర్తి మా హైదరాబాద్ లో ఉన్నపుడు అపుడపుడు న రూం లో ఉండేవాడు. ఒకసారి సత్యమూర్తి నా రూం లో ఉన్నపుడే నాకు కావాల్సిన బార్య మా కోసం సీతపల పండ్లు తీసుకోచింది.  సత్యమూర్తి ఏంటి బాబు అవి అని అడిగాడు, సీతాఫల పండ్లు అని చెప్పను, ఎవరు తీసుకోచారు అని అడిగాడు, విజయ తీసుకోచిందని చెప్పను, విజయ తీసుకొస్తే సీత పలములు అంటావేమిటి  బాబు అవి విజయ పలములు అన్నాడు

నేను ది బి ఎస్ ఎస్ కో కన్వినర్ గ ఉన్నపుడు మెదక్ జిల్లా ది బి ఎస్ ఎస్  కార్యదర్శి డప్పు శివరాజు ఫోన్ చేసి “చేగుంట లో అంబేద్కర్ మేడలో చెప్పు దండ వేసారని” వెంటనే నిరసన కార్యక్రమాలు చేయడానికి రావాలని ఫోన్ చేసాడు. అపుడు సత్యమూర్తి న ప్రక్కనే ఉన్నాడు. ఏమి జరిగింది బాబు అని అడిగాడు “చేగుంట లో అంబేద్కర్ మేడలో చెప్పు దండ వేసారని” చెప్పను. ” అంబేద్కర్ మేడలో కాదు బాబు అంబేద్కర్ విగ్రహం మేడలో వేసారు” అన్నాడు

సత్యమూర్తి తన డెబ్బయి ఐదు సంవత్సరాల వయస్సులో కూడా అజ్ఞాత జీవిత గడిపాడు, అజ్ఞాత జీవిత అంటే హైదరాబాద్ లోనో బెంగళూరు లోనో కాదు. ఖమ్మం వరంగల్ జిల్లా అడవుల్లో 2000 – 2002  సంవత్సరాల మద్య దాదాపు ఆరు నెలల కాలం అడవిలోనే గడిపాడు చాల మంది యువకులకు స్పూర్తినిచాడు. అసలు ఆ వయసులో అడవిలోనికి వెళ్ళాలనే ఆలోచనే ఎవరి ఆలోచనలకు అందనిది అది కేవలం సత్యమూర్తి కే సాద్యం. ఎన్ని విప్లవ కవిత్వాలు రాసిన, ఎన్ని విప్లవ రాజకీయాలు మాట్లాడిన హైదరాబాద్ లేదా బెంగళూరు బంగ్లాలు వదలని వారె ఇపుడు పేరు మోసిన విప్లవ కారులు.

ఒకసారి ఖమ్మం అడవిలోనుంది సత్యమూర్తి తో కల్సి వస్తుండగా ఒక ప్రశ్న అడగాలనిపించి అడిగాను. అపుడు న దగ్గర పదివేలు రూపాయలు సత్యమూర్తి దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నేను ఇలా అడిగాను, సర్ ఒక వేల పోలీసులు మనలను పట్టుకుంటే నేను స్టూడెంట్ నని చెపుతాను న దగ్గర గుర్తింపు కార్డు ఉండి, వారు న దగ్గరి డబ్బుల గురించి అడిగితే నేను స్టూడెంట్ కాబట్టి ఫీజులు అవి ఖర్చులు ఉంటాయని తీసుకేల్తున్నానని చెపుతాను, మరి నీవేమి చెపుతావని అడిగాను. అపుడు సత్యమూర్తి ” ఒక వేల పోలీసులు న దగ్గరి డబ్బుల గురుంచి అడిగితే ఈ డబ్బులు నావే మీకు కావాలా అని అడుగుతాను బాబు” అన్నాడు వారికీ కావాలంటే యిచేస్తాను అన్నాడు

సత్యముర్హ్తి  షుగరు బిపి కి మందులు వాడుతుండేవాడు, రాంనగర్ లో ఉంటున్న కాలం లో పొద్దున్నే వాకింగ్ కు వెళ్ళేవాడు హిందూ పేపర్ , ఇడ్లీ తేచుకునేవాడు తప్పకుండ మందులు వేసుకునే వాడు సందర్బం వచ్చి   కలేకూరి ప్రసాద్ గురించి మాట్లాడుతూ అతను వీలైనంత  తొందరగా చనిపోవాలని కృషి చేస్తున్నాడు బాబు, నేను జీవితాన్ని వీలైనంత పొడగించాలని చూస్తున్నాను అన్నాడు

సత్యమూర్తి ని లెక్క కట్టేసారు,  అతను శ్రీ శ్రీ తర్వాత అని లేక్కేసారు, దానికి కొలమానము ఏమిటో నిజానికి సత్యమూర్తి కి ఎవరితో పోలిక సరికాదు అతను ఎవరి తరవాత కాదు అతనికి అతనే సాటి. యిక్కడి  విప్లవ కవులు అందరు సత్యమూర్తి ద్వారా స్పూర్తి పొందిన వారె.  సత్యమూర్తి కేవలం కవి మాత్రమే కాదు అతను పూర్తి కాలం సామజిక విప్లవ నాయకుడు. అతను కవిత్వం మాత్రమే రాయలేదు కవిత్వం సత్యమూర్తి కి తన విప్లవ ఆచరనో లో బాగమే ఆ విధంగా చూసినపుడు సత్యమూర్తి ని ఎ మాత్రం ఆచరణ లేని  ఇతర కవులతో పోల్చడం అన్యాయం. కేవలం కవిత్వం మాత్రమే కాదు సత్యమూర్తి బ్రతుకుని గురించి మాట్లాడండి. ఇతర కవుల బ్రతుకులు ఏమిటో ఎలా బ్రతుకుతున్నారో చుడండి. అందుకని పోలికలు వద్దు.  సత్యమూర్తి విప్లవ కవిత్వమైన దళిత కవిత్వమైన, విప్లవోద్యమమైన దళితోద్యమమైన అగ్రశ్రేణిలో ఉంటాడు అది సైద్దంతికమైన ఆచరణ రిత్యనైన సత్యమూర్తి సత్యముర్తే

తన చుట్టూ ఉన్న మనుషులను నర సంపదగా బావించే తత్వం సత్య మూర్తి ది, సత్యమూర్తి నుండి నేర్చుకొనే వి చాల ఉన్నాయి. చాల బావోద్వేగామైన వ్యక్తి మనుషులను అమితంగా ప్రేమించేవాడు పాత మిత్రులను గుర్తుచేసుకొనే వాడు అనేక విషయాలు చెప్పేవాడు, ఎవరి గురించి అబద్దాలు చెప్పేవాడు కాదు మనుషులంటే, పేదలంటే అతనికి అమితమైన ప్రేమ. ఆ ప్రేమనే అతనిని జీవితాంతం విప్లవకారుడిగా నిలబెట్టింది

దళిత శ్రేణులు కూడా విప్లవ శ్రేణుల లాగ  సత్యమూర్తి ని నిర్లక్ష్యం చేసాయి, విప్లవోద్యమానికి దళితోద్యమానికి సత్యమూర్తి చేసిన సేవలు కొలమానం లేనివి, సత్యమూర్తి దళిత ఉద్యమానికి చేసిన contribution ప్రస్తుత దళిత నాయకులకు అర్థమైన సరే  మౌనంగానే  ఉన్నారు. ఈ పరిదుల నుండి విప్లవోద్యమము. దళితోద్యమము బయటపడడం అవసరంఉంది

విప్లవోద్యమానికి తర్వాత దళితోద్యమానికి తన జీవితమంతా దార పోసాడు సత్యమూర్తి. పేదలు , దళితులు , పీడితులు, అణచబడిన జన గణాలు  సత్యమూర్తి అలియాస్ శివసాగర్ ని అను నిత్యం తలచుకుంటారు

- కార్తీక్ నవయన్
http://karthiknavayan.wordpress.com/2012/04/23/%E0%B0%AF%E0%B0%BF%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BF-%E0%B0%87%E0%B0%95-%E0%B0%A6%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B0%A1%E0%B1%81/  

ఎర్రపొద్దు వాలింది

ఏకశిల నగరిలో ఎర్రపూ లు పూయించిన శివసాగర్ కృష్ణాతీరంలో తుదిశ్వాస విడిచాడు. అక్షర సాయుధుడిగా విప్లవసాహిత్యాన్ని పండించిన కేజీ సత్యమూర్తి మరణించాడన్న వార్త ఓరుగల్లు ఖిల్లాను శోకసంవూదంలోకి నెట్టింది. ఉద్యమ నెలబాలుడిగా కీర్తిని సొంతం చేసుకుని తోటరాముడిగా పాటలల్లిన విలుకాడు నేలకొరిగాడు. పీపుల్స్ వార్ ఉద్యమ నిర్మాణంలో కొండపల్లి సీతారామయ్యతో కలిసి నడిచిన కాజీపేట నేల చిన్నబోయింది. కేజీ సత్యమూర్తి పుట్టిం ది ఆంధ్రాలో, మరణిచింది ఆంధ్రాలోనే అయినా ఆయన జీవి తం తెలంగాణతో ముడిపడింది. ఓరుగల్లును పోరుగల్లుగా మా ర్చడంలో ఆయనది ప్రత్యేకమైన ప్రస్థానం.

కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో సీపీఎం సభ్యుడిగా జిల్లాలో కాలుమోపి పీపుల్స్‌వార్ పంథాను ఎంచుకున్న తొలితరం విప్లవ యోధుల్లో కేజీ సత్యమూర్తి ఒకరు. ఆయనకు జిల్లాతో విడదీయరాని అనుబం ధం ఉంది. 1960వ దశకంలో కాజీపేట సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్‌లో హిందీ మాస్టారుగా పాఠాలు నేర్పుతున్న కాలంలో తెలంగాణలో నెలకొన్న భూస్వామ్యపెత్తందారి శత్రువుతో పోరాడేందుకు తెలంగాణ సమాజ స్థితిగతులు పీపుల్స్‌పార్టీ నిర్మాణానికి దోహదం చేసిందంటారు. కొండపల్లి సీతారామయ్యది సి ద్ధాంత వ్యూహాత్మక పాత్ర అయితే, తన కలం ద్వారా భావోద్వేగాలను రగిలించడంలో సత్యమూర్తిది అందెవేసిన చేయి. కేజీ సత్యమూర్తి అసలుపేరు కంభంపాటి జ్ఞాన సత్యమూర్తి. శివసాగర్, అజ్ఞాత సూర్యుడు, నల్లసూర్యుడు లాంటి మారు పేర్లతో ఈ ప్రాంతంలో కేజీ సత్యమూర్తిని పిలుచేవాళ్లు. 1970వ దశకం ప్రారంభంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటం నుంచి వ చ్చిన విద్యార్థి యువకిషోరాలను విప్లవమార్గంలో నడపడంలో ఆయనది మరువలేని పాత్ర.

ఉద్యమకారుడిగా ఆయన రాటుతేలడానికి ఆయనకు అప్పటి ఆర్‌ఈసీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థి యువకిషోరాలకు ఎంత సహాయకారిగా ఉన్నారో ఆనాడు నెలకొన్న సమాజ పరిస్థితులు భట్టుప ల్లి, తరాలపల్లి, దేశాయిపేట, పైడిపెల్లి లాంటి గ్రామాల్లో చేతికొచ్చిన ఉడుకు నెత్తురును ఉద్యమానికి ఆయుధంగా మలచుకున్నారని అంటారు. జన్నుచిన్నాలు లాంటివాళ్లు నిర్వహించిన సభల్లో కేజీ సత్యమూర్తి భావోద్వేగ ప్రసంగాలకు ఆకర్షితులై ఎంతోమంది ఈ ప్రాంతానికి చెందిన యువత విప్లవకారులుగా మారారని చెబుతారు. ప్రజాసంఘాల నిర్మాణం, గ్రామాలకు తరలండీ అన్న నినాదాలతోపాటు నూతన ప్రజాస్వామిక విప్ల వం లాంటి మార్గాలను ఈ ప్రాంత యువత ఎంచుకునేందుకు కేజీ సత్యమూర్తి మహావూపేరణగా నిలిచారు.


అక్షరాల విలుకాడు...
తెలంగాణ సమాజ స్థితిగతులను ప్రధాన ఆయువుగా వాడుకుని, అక్షరాలను విల్లంబులగా మలచుకుని ఎంతోమంది యు వకిషోరాలను సాయుధులుగా మలచుకున్నాడు. ఆయన మరణంతో ఒక్కసారిగా జిల్లా ఆనాటి ఎర్రదారుల్లో పూసిన మోదుగుపూల వనాన్ని గుర్తుచేసుకుంటున్నారు. పీపుల్స్‌వార్ ఉద్యమంలో పనిచేసిన కాలంలోనూ, ఆయన పీపుల్స్‌వార్ నుంచి బయటికి వచ్చిన (ఆయనను పీపుల్స్‌వార్ బహిష్కరించింది అ నే వాదనా ఉంది) తరువాత ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వి ప్లవమార్గంలో నడిపించాలని చూశాడు.

విప్లవ మార్గం అంటే సాయుధపోరాట పంథాలో కాదనీ ఆయన అప్పట్లో సూత్రీకరించాడు. బహుజన్ సమాజ్ పార్టీలో (కాన్షిరాం)లో కొంతకా లం పనిచేసి తరువాత అక్కడా ఇమడలేక బహుజన్ రిపబ్లికన్ పార్టీని పెట్టి దాని ద్వారా కొంతకాలం దళిత బహుజనులతో రా జ్యాధికారం కోసం పనిచేశారు. ఆయన ఆయుధాన్ని ఏస్థాయి లో గురిపెట్టగలడో అంతకంటే పదునైన భావావేశంతో అక్షరాలును మలిచేవాడని ఆయన సాహిత్యం చెబుతోంది.

శివసాగర్‌గా సాహితీకారులకు చిరపరిచితుడైన ఆయన గెరిల్లా విప్లవగీతాలు, జనం ఊపిరితో, పది వసంతాలు, నెలవంక, నడుస్తున్న చరిత్ర (196-2004) లాంటి అనేక రచనలు చేశారు. వాటన్నింటినీ ఏర్చికూర్చి ‘శివసాగర్ కవిత్వం’గా స్వేచ్ఛ పబ్లికేషన్ 2004లో తీసుకొచ్చింది. ఉద్యమాన్ని నెలబాలుడిగా ఊహించడంలోనే శివసాగర్ కాల్పనిక ధోరణి వ్యక్తమవుతోంది. అలలపై కలగంటాడు. అలలపై నుంచి వచ్చే చిరుగాలి సితారా ధ్వనులకు పరవశిస్తాడు అంటాడు చేరా (చేకూరి రామారావు). ‘జననంలో మరణం!మరణంలో జననం! నా చిరునవ్వుల కన్నీళ్లతో కనిపించని అక్షరాల్లోకలకాలం నిలిచేలా ఇలా రాస్తాను  కామ్రేడ్ డాక్టర్ సమాధి మీద’ అంటూ 197లో రాస్తాడు శివసాగర్ డాక్టర్ రామనాథం హత్యకు నిరసనగా (డాక్టర్ రామనాథం ఈ జిల్లా వాసి).


సమాజ దార్శనికుడు..
మొదట ఉద్యమాలకు ఆయుధాలు అందించి ఆ తరువాత మనుషులు సాయుధులుగా మారాల్సిన అవసరం లేదని బలం గా ప్రచారం చేశాడు. ‘దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు. అంబేద్కరూ చాలడూ మార్క్స్ కావాలి’ అంటూ రంగనాయకమ్మ సంచలనాత్మక రచనకు సమాధానంగా ఆయన ‘అంబేద్కర్ సూర్యుడు’ అన్న గ్రంథాన్ని రాశాడు. అదీ ఒక సం చలనమే. మాదిగ జాతి ఆత్మగౌరవం ఉద్యమాన్ని నిర్మించిన, నడిపిస్తున్న ఈ జిల్లా వాసీ మంద కృష్ణ మాదిగకు ఆ పేరుపెట్టిం దీ (అంతకు ముందు ఆయనను కిషన్ అనేవారు) కేజీ సత్యమూర్తే.

కేజీ సత్యమూర్తి ఉపాధ్యాయుడిగా ఈ జిల్లాలో ప్రవేశిం చి విప్లవోద్యమానికి తన భావోద్వేగాన్ని జోడించి జన్ను చిన్నాలు లాంటి వాళ్లను ఎంతోమందిని విప్లవకారులుగా మార్చడం లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్తారు. మొత్తంగా జిల్లాలో కేజీ సత్యమూర్తి మరణించారని తెలిసి ఈ పోరుఖిల్లా ఓరుగల్లు నాలుగు కన్నీటి చుక్కల్ని ఆయనకు నివాళిగా అర్పించాయి. మొ త్తంగా పీపుల్స్‌వారు (ఇప్పటి మావోయిస్టు) కేంద్ర కమిటీ కా ర్యదర్శిగా కేజీ సత్యమూర్తి ఎదిగినా ఏకశిలా నగరంపై ఆయన ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారని ఆయన సాహిత్యం స్పష్టం చేసింది.

‘గార్ల రైలు దాడిలోన గుంజుకున్న బల్ రైఫిల్ నీకి స్తా తమ్ముడా.. నీకిస్తా చెల్లెలా’ అంటూ ఆయన రాసిన పా అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పీపుల్స్‌వార్ ఉద్యమం నుంచి వైదొలిగిన తరువాత ఆయన చేపట్టిన, నిర్మించిన అనేక ప్రజాఉద్యమాలు, సాగించిన పోరాటాలు అన్నింటిలోనూ వరంగల్‌ను ఆయన ఎప్పటికీ మరచిపోలేదని ఆయన జిల్లా పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.


పుట్టుక ఆంధ్ర.. చావు ఆంధ్ర..
జీవితమంతా తెలంగాణ

ములుగు, ఏప్రిల్17 టీన్యూస్  ఇప్పపువ్వుల సిగల నడుమ దాచిన విల్లంబులన్ని నీకిస్త తమ్ముడా...! నీకిస్త్త తమ్ముడా...! శ్రీరాములయ్య సినిమాలోని ఈ పాట తెలియని వారు ఉండరేమో. ఈ పాటకు అక్షరం రూపం ఇచ్చింది శివసాగరే ఆయనే కేజీ సత్యమూర్తి. అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ కార్యదర్శి, భారత విప్లవోద్యమంలో తమదైన ముద్ర వేసుకున్న సత్యమూర్తి మలివిడత ఉద్యమ పంథాలో తొలిసారి ఏటూరునాగారం అడవుల్లోని కొండపర్తి వద్ద తొలిపాదం మోపి సీపీఐఎంఎల్ ప్రజావూపతిఘటన రాష్ట్ర కార్యదర్శిగా ఐదు సంవత్సరాల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రాంత వాసులతో ముఖ్యంగా ఆదివాసీలతో అడవిలోని సాయుధ సహచరులతో పెనవేసుకున్న అనుబంధాన్ని ఆయన అల్లుకున్నారు.

ఒక సందర్భంలో మహాకవి కాళోజీ అన్నట్లు పుట్టుక నీది... చావు నీది... జీవితమంతా దేశానిది.. అన్న మాటలు శివసాగర్ జీవితంలో అక్షర సత్యం అవుతాయి. పు ట్టుక ఆంధ్ర, చావు ఆంధ్ర, జీవితమంతా తెలంగాణలో మమేకమ య్యారు. ఆదివాసీ, దళి త బహుజన పీడిత వర్గాల విముక్తి కోసం పరితపించాడు. అడవిలో ఆదివాసీలకు ఆయుధాలు పట్టించడంతో పాటు అట్టడువర్గాల్లో సామాజిక చైతన్యం రగిలించి అడవుల్లో చైతన్యదారులను నిర్మించాడనే పేరును ఆయన సార్థకం చేసుకున్నారు. గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో ఆయన చెట్టూ, పుట్టకు సుపరిచితుడేనని అందరూ చెబుతుంటున్నారు.


అడవిలోకి ఆయన ..
195లో పీపుల్స్‌వార్ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ పార్టీలో కేఎస్(కొండపెల్లి సీతారామయ్య)తో విభేదించి బయటకు వచ్చారు సత్యమూర్తి. అనంతరం ఆయన బహుజన సమాజ్‌వాది పార్టీలో చేరారు. కొంతకాలం పనిచేశాక ఆ పార్టీ అధినేత కాన్షీరామ్ విధానాలతో విభేదించి బహుజన రిపబ్లికన్ పార్టీని స్థాపిం చారు. చివరకు అందులోనూ విభేదాలు, చీలికలు రావడంతో మరోసారి ఆయన సాయుధ పో రాట బాటపట్టారు. అందుకు అంకురార్పణ ములుగు సబ్‌డివిజన్ అడవుల్లోనే జరిగింది. సీపీ గ్రూపుల నుంచి విడిపోయిన ఒక పాయ సీపీఐఎంఎల్ ప్రజా ప్రతిఘటన అప్పటికే న్యాయకత్వలేమితో తీవ్రమైన ఎదురుదెబ్బలతో ముఖ్యమైన న్యాయకత్వాన్ని కోల్పోయింది.

ఆ సంక్షోభంలోనే సత్యమూర్తి అడవిలోకి అడుగుపెట్టారని, ప్రజావూపతిఘటన సాయుధ దళాలకు రాజకీయ దశ దిశను అందించారని ఆయన సహచరులుగా పనిచేసిన మా జీలు చెబుతున్నారు. 199లో అడవిలోకి అడుగుపెట్టిన సత్యమూర్తి వరంగల్, ఖమ్మం జిల్లాలలోని అటవీ ప్రాంతంలో జరిగిన మూడు ఎన్‌కౌంటర్ సంఘటనల నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఆయన 199లో పీపీజీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి రాజకీయ జీవం పోశారు. సాయుధ దళాలకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించి ప్రత్యే క తెలంగాణ ఆవశ్యకత, భారతదేశంలో కులం సమస్యకు మార్క్సిస్టు కోణంలో పరిష్కారం లాంటి కీలకమైన సైద్ధాంతిక తాత్విక భూమికను ఆ పార్టీకి నిర్దేశించారని పీపీజీ రాష్ట్రకార్యదర్శిగా పనిచేసిన కీలక నాయకుడు ఒకరు ’టీన్యూస్’కు తెలిపారు.


ఏఎల్‌టీ సిద్ధాంతకర్తగా..
తర్వాతకాలంలో ఆదివాసీల విముక్తి కోసం ప్రత్యేక పోరాటాల అవసరాన్ని గుర్తించి సత్యమూర్తి జనశక్తి సీపీయూఎస్‌ఐల నుంచి బయటకు వచ్చిన ఆదివాసీ నాయకుడు కుంజ కొమ్మాలు అలియాస్ రాము నాయకత్వంలో స్థాపించిన ఏఎల్‌టీ(ఆదివాసీ లీబరేషన్ టైగర్స్) అనే సంస్థకు సిద్ధాంతకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దండకారణ్యాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ప్రారంభించిన ఏఎల్‌టీ ఆ దిశలో విల్లంబులతో పోరాటాలకు సిద్ధమవుతున్న క్రమంలోనే 2005 ప్రాంతంలో ఏఎల్‌టీ వ్యవస్థాపక కార్యదర్శి రాము ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో ఆ పార్టీ కనుమరుగైంది. ఏది ఏమై నా సత్యమూర్తి మరణం తెలంగాణకు, విప్లవోద్యమానికి తీరని లోటని భావిస్తున్నారు.


కంటతడి పెట్టిన ఉద్యమనేస్తాలు..
సత్యమూర్తి కృష్ణా జిల్లా వాస్తవ్యుడైనప్పటికీ జిల్లాతోనే ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నారు. జిల్లాలోని అడవిలోకి అడుగుపెట్టి ప్రజావూపతిఘటన సాయుధ దళాలకు ఆయన విప్లవపాఠాలు నూరిపోశారు. దీనికి తోడు ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అలాంటి విప్లవకారుడు మంగళవారం తన సొంత గడ్డ కృష్ణా జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందడం ఇక్కడి ఆదివాసీలు, తనతో పని చేసినవారితోపాటు అతన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. ఆయన విప్లవ భావాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. సత్యమూర్తి మరణం ఇటు తెలంగాణ ప్రజలకు, విప్లవోద్యమానికి తీరని లోటుగా ఆవేదన వ్యక్తం చేశారు.

(టీన్యూస్ ప్రతినిధి-వరంగల్)  
http://www.namasthetelangaana.com/Districts/Warangal/ZoneNews.asp?category=25&subCategory=12&ContentId=96294

ఉద్యమ సవ్యసాచి శివసాగర్

హైదరాబాద్, ఏప్రిల్ 17
ఒకానొక సమయంలో గన్‌తోనూ.. ఇంకొంతకాలం పెన్‌తో ఉద్యమాన్ని కొనసాగించిన బహుముఖ ఉద్యమనేత కెజి సత్యమూర్తి. నక్సలైట్ల ఉద్యమానికి ఒక రూపం ఇచ్చిన వారిలో కీలక వ్యక్తిగా.. సమాజంలో దళితులకు జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు ఉద్యమించిన హక్కుల నేతగా... రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలిపేందుకు ప్రయత్నించిన ఒక రచయితగా సత్యమూర్తి బహుముఖ పాత్ర పోషించారు. నల్ల సూరీడుగా, శివసాగర్‌గా ప్రఖ్యాతిగాంచిన సత్యమూర్తి పత్రికా రంగానికి కూడా సేవలు అందించడమేకాకుండా కొద్దికాలం ఉపాధ్యాయ వృత్తిలో కూడా విద్యార్ధులకు బోధనలు చేశారు. తొమ్మిది పదుల వయసు ఉన్నప్పటికీ సత్యమూర్తి అంటే ఒక సంచలనంగానే జీవనాన్ని కొనసాగించడం ఆయనకే చెల్లింది.

రాష్ట్రంలో అణగారిన ప్రజల కోసం ఉద్యమం సాగుతున్న తరుణంలో... శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న సమయంలో సత్యమూర్తి కూడా తాను తుపాకీపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నక్సలైట్ నేత కొండపల్లి సీతారామయ్యతో కలిసి సత్యమూర్తి విప్లవ సంఘాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి 1980లో పీపుల్స్‌వార్ గ్రూప్ పేరుతో నక్సలైట్ పార్టీకి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు వరంగల్‌లోని ఫాతిమా స్కూలులో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సత్యమూర్తి, సహచర హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కొండపల్లి సీతారామయ్యలు కలిసి తమ వృత్తిని సైతం విడిచిపెట్టి సాయుధ పోరాటానికి తెరతీశారు.

ఈ కాలంలోనే వీరిద్దరూ కలిసి స్థానిక ఆర్‌ఇసిలో చదివే విద్యార్థులతో రహస్యంగా ఉద్యమకర్తలను తీర్చిదిద్దారు. అలాంటివారిలో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అజాద్ ఒకరు. ఈ ఇద్దరి నేతృత్వంలో పీపుల్స్ వార్ ఉద్యమం బలపడింది. ఆనాటి నుంచి అప్పటి నుంచి ఊపందుకున్న నక్సలైట్ల ఉద్యమం నేడు మావోయిస్టు పార్టీగా మారి దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిందంటే ఏనభయ్యవ దశకంలో సత్యమూర్తి, కొండపల్లి సాగించిన పోరాటాలేనంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత కాలంలో పార్టీ సిద్ధాంతాలతో విబేధించిన సత్యమూర్తి తరువాత పార్టీకి గుడ్‌బై చెప్పారు. సత్యమూర్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పీపుల్స్‌వార్ ప్రకటించగా, తానే పార్టీని బహిష్కరిస్తున్నానని ధైర్యంగా చెప్పిన సత్యమూర్తి తరువాత కాలంలో విప్లవ రచయితగా, దళిత హక్కులకోసం పోరాడే నేతగా రూపాంతరం చెందారు.

తన పదునైన వాక్కులతోపాటు, అక్షరాలను కూడా ఆయుధంగా మార్చుకుని రచనలు, కవితలతో దళితుల కోసం పోరు సాగించారు. అనేక పార్టీల నుంచి రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానం అందినప్పటికీ దళిత ఉద్ధరణకే ఆయన మొగ్గు చూపించారు. నలుపు, ఎదురీత వంటి పత్రికలను కొంతకాలం నడిపిన ఆయన తన వ్యాసాలు, రచనలతో ఒక ఊపు తీసుకువచ్చారు. ఆయన నెలబాలుడు రచన విప్లవ సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విరసం ఏర్పాటులో కూడా సత్యమూర్తి పాత్ర కీలకంగా మారింది.

దళితుల హక్కుల పరిరక్షణ కోసం ప్రధానంగా చుండూరులో జరిగిన దళితుల ఊచకోత సమయంలో పోరాటాలు సాగించారు. 1999లో బిఎస్‌పి టిక్కెట్ నాశించి భంగపడి కృష్ణాజిల్లా ముదినేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. నక్సలైట్ చాగంటి భాస్కరరావు ఎన్‌కౌంటర్‌లో మరణించి నప్పుడు ‘నరుడో... భాస్కరుడో’ అంటూ తొలిసారి జానపద బాణిలో విప్లవ రాజకీయాలను జొప్పిస్తూ కొత్త పంథాకి శ్రీకారం చుట్టారు.

శ్రీరాములయ్య సినిమాలో ‘నీకిస్తా తమ్ముడా.. నీకిస్తా తమ్ముడా.. అంటూ సత్యమూర్తి రాసిన గేయం కూడా జనాదరణ పొందింది. నక్సల్స్ ఉద్యమంలో సత్యమూర్తి రచనలు ప్రభావితం చేశాయి. శివసాగర్ కలం పేరుతో శివసాగర్ కవిత్వం, అంబేద్కర్ సూర్యుడు అనే రెండు రచనలు చేశారు. (చిత్రం) కుటుంబ సభ్యులతో కెజి సత్యమూర్తి

18042012
http://www.andhrabhoomi.net/node/20118

Tuesday, 24 April 2012

శివసాగర్‌కు మరణం లేదు_వరవరరావు పూర్తి కథనం

"కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో
నరకగలిగినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుగాసి
ట్రిగర్ నొక్కగలిగినవాడే స్రష్ట
ప్రజను సాయుధం చేస్తున్న
రెవల్యూషనరీ నేడు కవి"

ఈ ఆఖరి చరణమే వరంగల్‌నుంచి పెండ్యాలకిషన్‌రావు సంపాదకత్వంలో వెలువడిన ‘విప్లవకవులు’ కవితాసంకలనం ‘మార్చ్‌’కు మకుటం. ఈ కవిత్వంలో మనకు కనిపించే కొంచెం దిగంబరకవుల వాసన, స్పష్టమైన విప్లవ అవగాహన, కవితా ‘ప్రభంజనం’, తిరుగబడు కవులు కలిసి జులై 4, 1970న ఏర్పడిందే విప్లవ రచయితల సంఘం. ఆనాటినుంచి ఈనాటి వరకు సాహిత్య, సాంస్కృతికరంగాల్లో విరసం ఆశయం, లక్ష్యాలకు ఇదే మార్గనిర్దేశం.

‘ఆకులందున అణగిమణగి కవితకోకిల పలకవలెనోయ్‌’ అన్నాడు గురజాడ. ‘కదిలేది కదిలించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు నడిపించేది కావాలోయ్‌ నవకవనానికి’ అన్నాడు శ్రీశ్రీ. కాని నక్సల్బరి, శ్రీకాకుళోద్యమ దశకు విప్లవోద్యమ దశకు ఎటువంటి కవిత్వం కావాలో దిశానిర్దేశం చేసినవాడు మాత్రం పాణిగ్రాహి అడుగుజాడల్లో వచ్చిన శివుడు, శివసాగర్‌.

1974లో నా ‘ఊరేగింపు’ కవితాసంకలనాన్ని మార్క్సిస్టు లెనినిస్టు నాయకులు కామ్రేడ్‌ కెజి.సత్యమూర్తికి అంకితం చేసాను.

‘To find heroes in the grand manner
we must look rather in the present’

అని మావోసేటుంగ్‌ను ఉదహరిస్తూ ఈ పై కవితా చరణాలను నేను ఉటంకించాను. అంతకుముందు 68లో నా మొదటి కవితాసంకలనం ‘చలినెగళ్లు’ గుడిపాటి వెంకటచలానికి అంకితమిచ్చాను. దీన్నిబట్టే నాపై చలం తర్వాత అప్పటికి శివసాగర్‌ ప్రభావం ఎంత ప్రగాఢమైందో ఎవరైనా ఊహించుకోవచ్చును.

1966లో ‘ఆధునిక సాహిత్య వేదిక’గా ప్రగతిశీల భావాలు, శాస్త్రీయదృక్పథం, ప్రయోగం కొరకు ప్రారంభమైన సృజన 67 నాటికి ‘‘రక్తచలన సంగీతశృతి’’ని వ్యక్తావ్యక్తంగా వినడం, విని హృదయంలోకి ఇంకించుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ గాలుల ప్రభావం అని అర్థమవుతుంది. ఆ రోజుల్లో నేను జడ్చర్లలో పనిచేస్తున్నాను. కాని 1966-68 మధ్యన వరంగల్‌ మిత్రమండలి సమావేశాల్లో కవిమిత్రుడు లోచన్‌తో కవిత్వం వింటున్నాం, మంచిచెడ్డలు మాట్లాడుకుంటున్నాం కాని దిశానిర్దేశం చేయలేకపోతున్నాం అని మధనపడుతుండేవాళ్లం. గాబ్రియెల్‌స్కూళ్లో కెజి.సత్యమూర్తి అనే టీచర్‌ ఉన్నాడని, ఆయన అయ్యర్‌గారి టీచర్స్‌గిల్డ్‌లో పనిచేస్తున్నాడని, ఆయన నాటకాలు రాసి ప్రదర్శింపచేస్తున్నాడని, ఆయనకు తీవ్రమైన అభ్యుదయభావాలున్నాయని తన ఇంప్రెషన్‌గా లోచన్‌ చెప్పేవాడు. ఒకసారి మిత్రమండలిలో విల్సన్‌ అనే కవిమిత్రుడ్ని సత్యమూర్తిగారు మీ కొలీగా అని అడిగాను. ఆయన ఉలికిపడి ‘‘ఆయనా, ఆయన స్టాలినండీ’’ అన్నాడు. బహుశా అప్పటికే ఆయన బ్రహ్మానందరెడ్డి కాలం లోని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల సమ్మెలో పాల్గొని, స్కూళ్లో ఉపాధ్యాయసంఘ నిర్మాణం చేయబోయి సస్పెండయి ఉన్నాడు.

కాని, నేను ప్రత్యక్షంగా సత్యమూర్తిని కలిసింది మాత్రం హైదరాబాద్‌ రెడ్డి మహిళాకళాశాల ఎదురుగా సందులో ఒక చిన్న ఇంట్లో ఉంటున్న సృజన సాహితీమిత్రుడు శ్రీపతి ఇంట్లో. తెల్లటి ధోవతి, మీద జుబ్బా, ఉంగరాల జుట్టు, కళ్లలో వెలుగు, చిరునవ్వు. అచ్చం కవికుమారుడి లాగా ఉన్నాడు. శ్రీపతి పరిచయం చేసాడు. సృజన ద్వారా నేనూ ఆయనకు పరోక్ష పరిచయమే. ఆయన రాజకీయ విశ్వాసాల గురించి విని ఉన్నాను. బహుశా అప్పటికే ఆయన ముందస్తు నిర్బంధంలో భాగంగా జైలుకు కూడా వెళ్లివచ్చి పూర్తికాలపు రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన చేతిలో ‘లెనిన్‌ నా లెనిన్‌’ అని రాసిన ఆయన దీర్ఘకవిత కాగితాలున్నాయి. అది లెనిన్‌ శతజయంతి జరుగుతున్న సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా రివిజనిస్టులు మొదలు విప్లవకారుల వరకు ఏమొచ్చే బూర్జువా ప్రభుత్వాలు కూడా లెనిన్‌ శతజయంతి జరుపుకుంటున్నాయి. శివసాగర్‌ మాటల్లోనే చెప్పాలంటే ఆయననొక బాబాను చేసి, ఆయన కాళ్లకు మేజోళ్లు తొడిగి, ఆయననొక విగ్రహాన్ని చేసి ఆరాధనా ఉత్సవాలు జరుపుతున్నారు. లెనిన్‌ విప్లవాచరణలో ఉన్నాడని తీవ్రమైన ఉత్తేజంతో రాసిన కవిత అది. ‘‘ఈ సాయంత్రం కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో లెనిన్‌ శతజయంతి సందర్భంగా ఒక కవిసమ్మేళనం ఉందట. అక్కడ ఈ కవిత చదివించాలి’’ అని ప్రతిపాదించాడు. ఆ ఏర్పాటు ఏదో చేసినట్టున్నాం. ఎట్లాగూ ఒక సంచలనం ప్రారంభమైంది. లెనిన్‌ పుట్టినరోజయిన 69 ఏప్రిల్‌ 22న ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. నక్సల్బరీ, శ్రీకాకుళోద్యమాల వెలుగులో ఆ ఉద్యమాలకు ఒక నిర్మాణరూపం ఇవ్వడానికి మనదేశంలో కూడా చారుమజుందార్‌ కార్యదర్శిగా మార్క్సిస్టు లెనినిస్టుపార్టీ ఏర్పడింది. మేడే రోజు కలకత్తా షహీద్‌మినార్‌ మైదాన్‌లో కానూసన్యాల్‌ ఆ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసాడు. ఆ తర్వాత గుంటూరులో నక్సల్బరీ సంఘీభావ కమిటీని ఏర్పాటు చేసిన డాక్టర్‌ చాగంటి భాస్కరరావు, శ్రీకాకుళోద్యమ జిల్లా నాయకుడు పంచాది కృష్ణమూర్తి మొదలయినవారు చారుమజుందార్‌ను తెలుగునేలకు తీసుకొనివచ్చి గుత్తికొండబిలంలో రాష్ట్ర పార్టీని ఏర్పాటుచేసారు. ఆ సమావేశానికి కొండపల్లి సీతారామయ్య వెళ్లలేకపోయాడు కాని, కెజి.సత్యమూర్తి, కొండపల్లి చంద్రశేఖరరెడ్డి వెళ్లారు. తెలంగాణ ప్రాంతం నుంచి కొండపల్లి సీతారామయ్య, కెజి.సత్యమూర్తిలను రాష్ట్రకమిటీలోకి తీసుకున్నారు.

అయితే 1969 నుంచి 85 దాకా కెజి.సత్యమూర్తితో సృజనకైనా, విరసంకైనా గాఢమైన అనుబంధం ‘శివసాగర్‌’తోనే. కెజి.సత్యమూర్తిగా లేదా ఆయన అజ్ఞాతజీవితం లోని పార్టీపేర్లతో ఆయన పార్టీలో నిర్వహించిన పాత్ర గురించి సాధికారికంగా చెప్పగలిగేది ఆ పార్టీ నిర్మాణమే. లెనిన్‌ కవిత మొదలుకొని 85 దాకా అంటే సృజన నిర్వహించబడినంత కాలం ఆయన ఏ కవిత రాసినా సిరా తడి ఆరకముందే అది సృజనకే పంపించేవాడు. అచ్చయి వచ్చేలోగా మళ్లీ ఎన్నిసార్లు ఆ కవితకు ఆయన నుంచి సవరణలు వచ్చేవో. ఆయనంతటి కవితాశిల్పి. ఆయన అక్షరాల వలె కవిత్వాన్ని చెక్కేవాడు. అది పూర్తి సంతృప్తినిచ్చేదాకా బహుశా ఆయనకు నిద్రపట్టేది కాదు. కవిత్వంలో ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. కవిత్వంలో కవిత్వం కానిది పలకడాన్ని ఆయన సహించేవాడు కాదు. అట్లే ఆయన ఎన్నో పాటలు రాసాడు. ఆ పాటలన్నీ సృజనలోనే వచ్చినవి. 69 నుంచి 79 దాకా అజ్ఞాత జీవితంలోనే, జైళ్లలోనో ఉన్నందువల్ల ఆ పాటలకు స్వరకల్పన (ట్యూన్‌) ఎన్‌కె (రామారావు) చేసేవాడు, చెయ్యాలని ఎస్ఎమ్ కోరుకునేవాడు కూడా. ‘చెల్లీ చెంద్రమ్మా’, ‘తోటా రాముడు’, ‘జాలరన్న’ వంటి పాటలన్నీ ఎన్‌కె ట్యూన్‌ కట్టి పాడినవే విస్తృత ప్రచారాన్ని పొందినవి. ఆ తర్వాత కాలంలో తోటరాముడు పాటను ‘మాభూమి’ సంధ్య, ‘అమ్మా మము కన్నందుకు విప్లవాభివందనాలు’ అరుణోదయ రామారావు, ‘నల్లా సూర్యుడు’ పాటను చంద్రశ్రీ విస్తృత ప్రచారం చేసారని నేను అనుకుంటాను. 79లో బెయిల్‌మీద విడుదలయి వరంగల్‌కు వచ్చినపుడు ఆయనను ఆయన పాటలు తాను రాసినపుడు ఎట్లా స్వరకల్పన చేసుకునేవాడో పాడి విన్పించమని అడిగాం. ఆశ్చర్యంగా ఆయన మందస్వరంలో భానుమతి ప్రభావంతో పాడినట్లు అనిపించింది.

పాట అన్నప్పుడు ముఖ్యంగా చెప్పవలసింది ఆయన ‘నరుడో భాస్కరుడా’. డాక్టర్‌ చాగంటి భాస్కరరావును ఎన్‌కౌంటర్లో చంపివేసిన తర్వాత భాస్కరుడు నామవాచకం కాదు, అనే చిన్న వివరణతో తెలంగాణ ప్రాంతంలో పీరీలు నీళ్లల్లో పడినతర్వాత మొహర్రం ఆఖరి రోజున తిరిగివస్తూ పాడుకునే జానపద గీతం శైలిలో ఆయన నరుడో భాస్కరుడా పాట రాసాడు. ఈ పాటయే విరసం పాట, మౌఖిక కళారూపాల ద్వారానే విప్లవభావ ప్రచారం చేయాలనే దానికి ప్రాతిపదిక అయింది. ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహినగర్‌లో జరిగిన విరసం ప్రథమ మహాసభలకు విరసం ప్రథమ కవితాసంకలనం ‘ఝంఝ’ను స్వయంగా అచ్చువేయించుకొని వచ్చిన శ్రీశ్రీ ఈ పాట పాడుతూనే ట్రెయిన్‌ దిగాడని సభలు జరిగిన రెండ్రోజులూ ఈ పాట పాడుతూనే ఉన్నాడని, ఈ పాట రాసిన శివుడెవరో అప్పటికి ఆయనకు తెలియదని మనం ఎన్నోసార్లు గతంలో చెప్పుకున్నాం. నగ్నముని తన ‘తూర్పుగాలి’ కవితాసంకలనాన్ని ఈ నరుడూ భాస్కరుడికే అంకితం చేసాడు. ఈ పాటతో పాటు ఝంఝలో 70 జులై 10న ఎన్‌కౌంటర్లో అమరులయిన వెంపటాపుసత్యం, ఆదిభట్ల కైలాసంల స్మృతిలో రాసిన ‘సత్యం చావదు’ (డు) అనే కవిత కూడా అచ్చయింది. ‘మార్చ్‌’ కవితాసంకలనంలో ప్రారంభంలో పేర్కొన్న కవితతో పాటు లెనిన్‌పై రాసిన దీర్ఘకవిత కూడా ఉంది. ఇతర కవితలతో పాటు ఈ నాలుగు కవితల గురించి కూడా మార్చ్‌, ఝంఝలు నిషేధానికి గురయినవి. ఈ నాలుగు కవితలను విడిగా ఒకచోట అచ్చువేసిన బుక్‌లెట్‌ను నిషేధానికి వెరవకుండా గుంటూరు విరసం మహాసభల్లో పంచిన ధూళిపాళ మోహన్‌ (ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో చేరి, జైల్లో మొలీనా పేరుతో అరుదయిన, అద్భుతమైన కవిత్వం రాసి అమరుడయిన యువకుడు) ఇప్పటికీ నాకు కళ్లల్లో ఆడుతున్నాడు. ఈ నాలుగు కవితలు ఎస్ఎమ్ శివుడు అనే పేరుతోనే రాసాడు. ఆ తర్వాత ఆయన సృజనకు రాసిన ప్రతి కవితకూ కవితా వస్తువును బట్టి ఎక్కువగా సాహితీమిత్రులే శివసంబంధమైన పేర్లు పెట్టేవాళ్లు. శివసాగర్‌, నటరాజ్‌ (ఉద్యమం నెలబాలుడు), పార్వతి (మాతృఘోష) ఇట్లా. ప్రపంచకార్మికులంతా ఒకేతల్లి బిడ్డలురా, ప్రపంచశ్రామికులంతా ఒకే కొమ్మ పువ్వులురా అని రాసిన పాటకు మాత్రం ఆజాద్‌ అని పేరు పెట్టాం. సృజన ప్రచురణగా వెలువడిన గెరిల్లా విప్లవగీతాలకు ముందుమాటలో అందుకే ఇందులో వివిధ కవుల కవితలు ఉన్నాయి గాని వీటన్నింటిలో విప్లవ సత్యమూర్తిత్వం ఆవిష్కరింపబడింది అని ప్రస్తావించడం జరిగింది. కవిత్వంలో, కవిత్వం ద్వారా ఆయన ఇవ్వాటి కవికి నిర్వచనాన్ని, కవితారూపాన్ని నిర్దేశించినట్లుగానే విప్లవ కాల్పనికవాదాన్ని, విప్లవ ఆశావాదాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కవిత్వంపై ఏకకాలంలో గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావాన్ని చూడవచ్చు. వీటితోపాటు తనదైన కవి సమయాలను, కవితా రూపాలను, శిల్పాన్ని, వినూత్న ప్రయోగాలను కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సమకాలీన విప్లవపరిభాషతో, కవితా వస్తువులతో, కవిసమయాలతో కవిత్వాన్ని సుసంపన్న చేసాడు. తెలుగు వచన కవితపై, ముఖ్యంగా విప్లవ కవిత్వంపై శ్రీశ్రీ తర్వాత బలమైన ముద్ర శివసాగర్‌. మరొక ప్రత్యేకత ఏమంటే నరుడో భాస్కరుడా పాట నుంచి గంగదాటెలిపోకే చెల్లెమ్మా దాకా ఆయన ప్రతి పాటా, కవితా ద్వారా శ్రీకాకుళోద్యమం మొదలు జగిత్యాల జైత్రయాత్ర దాకా విప్లవోద్యమ చరిత్ర నిర్మాణం చేసి చూపవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళోద్యమ చరిత్రను, ఆయన కవిత్వంతో రక్తమాంసాలతో కూడిన చరిత్రగా పునర్లిఖించవచ్చు. ఆయన కవిత్వంలో చెరబండరాజు కవిత్వంలో వలెనే పోలమికల్‌ అంశాలు కూడా చాలా ఉంటాయి. ఏ కవితా సందర్భం లేకుండా అనిర్దిష్టంగా ఉండదు. ‘లెనిన్‌’ గ్రేట్‌డిబేట్‌ ముగిసి మార్క్సిస్టు లెనినిస్టు విప్లవాలు పెల్లుబికిన కాలం. ‘నరుడో భాస్కరుడా’ ఎన్‌కౌంటర్‌ హత్యలు ప్రారంభమైన కాలం. అంతేకాదు, నీ బాటనే నడుస్తాం అని విప్లవభాస్కరునికి హామీపడిన సందర్భం. జాలరన్న పాట సత్యం, కైలాసాల అమరత్వం సందర్భంగా తెలంగాణలో మాత్రమే నాయకత్వం మిగిలినపుడు కెఎస్‌ను ఉద్దేశించి రాసిన కవిత్వం. తెరచాప చిరిగినా, పడవ మునకేసినా, కొందరప్పటికే దిగజారి తెడ్డు నదిలో విసిరేసినా చుక్కాని దిక్సూచిగా పనిచేసినంత కాలం ఈ ఎదురీత కొనసాగుతుందని చెప్పిన పాట. ఉద్యమం నెలబాలుడు శ్రీకాకుళోద్యమ నాయకత్వమే రివిజనిస్టు మార్గాన్ని జైల్లో ఉండి ప్రతిపాదించినపుడు ఆగ్రహంతో రాసిన గీతం. ఇట్లా ఉద్యమం నెలబాలుడు సంపుటిలోని ప్రతి కవితకు ఒక నిర్దిష్టమైన సందర్భాన్ని చెప్పవచ్చు.

ఎస్ఎమ్ 73లో ఖమ్మం అరెస్టయ్యాడు. ఒక ద్రోహి కారణంగానే అరెస్టయ్యానని హోచిమిన్‌ వలెనే చందమామను ఉద్దేశిస్తూ జైలు నుంచి కవిత రాసి పంపాడు. మిత్రద్రోహంతోనే బందీనయ్యానని. శత్రుచేతిలో చిక్కానని. ఖైదీగీతం పేరుతో 74 జనవరిలో అది చిన్నకవితాసంకలనంగా వెలువడింది. గెరిల్లా విప్లవ గీతాలు, ఖైదీగీతం ఆ తర్వాత రాసిన కవితలు అన్నీ కలిపి అప్పటికి ఒక సమగ్ర సంపుటంగా ఆ తర్వాత కాలంలో ఉద్యమం నెలబాలుడు వెలువడింది.

ఈ కాలమంతా ఆయన కొండపల్లి సీతారామయ్యతో కలిసి పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటూనే ఉన్నాడు. ఆదిలాబాదు, వరంగల్‌, భోనగిరి, హైదరాబాదు మొదలైన ప్రాంతాల్లో పనిచేస్తూనే ఉన్నాడు. రాష్ట్రకమిటీ నాయకత్వంలో ఉండి విరసంతోగాని, ఇతర ప్రజాసంఘాలతో గాని సంబంధాల్లోనే ఉన్నాడు. ఈ క్రమమంతా ఆయన దృష్టి ప్రధానంగా సాహిత్య సాంస్కృతిక భాషా రంగాలమీద ఉండేది, ఆయన ప్రభావమూ ఈ రంగాలమీద ఉండేది. ఆదిలాబాదు అడవుల్లో తిరిగినపుడు వెంటఉన్న నర్సిరెడ్డి అనే సహచరుడితో ఆ అడవిలోని చెట్ల పేర్లు, పిట్టల పేర్లు అడిగి తెలుసుకొని రాసుకొని ఆ తర్వాత కాలంలో వాటిని తోటరాముడు పాటలో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఆ తోటరాముడు భూమయ్య కిష్టాగౌడ్‌ లోని కిష్టాగౌడ్‌. సత్యమూర్తి ఎమర్జెన్సీలో జైల్లో ఆ ఇద్దరి పక్కన గంజ్‌లో ఉన్నాడు. వాళ్లకు సన్నిహితుడయ్యాడు. కిష్టాగౌడ్‌ తొడలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో దూరిన బుల్లెట్‌ను చూసి ఆయన ‘తోటారాముని తొడకు కాటా తగిలిందాట’ అని పాట రాసాడు. భూమయ్య కిష్టాగౌడ్‌ ఉరిశిక్షల మీదనే ‘ఉరిపాట’ రాసాడు. ఉరికంబం మీద నిలిచి ఉజ్వలగీతం పాడెద అని సృజనలో రాసాడు. అది నిషేధానికి గురయింది. 1972లో తరచుగా సృజన సంచికలు నిషేధానికి గురయినాయి. ఎక్కువగా శివసాగర్‌ కవితల కోసమే. ఇంటెలిజెన్స్‌ వాళ్లు (మూడు ఎమ్ఏలు చేసిన గోపాల్‌రావనే ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ రోజుల్లో నిషేధింపబడ్డ కవిత్వాన్ని అనువాదం చేసేవాడు) చేసే ఆ ఇంగ్లీష్‌ అనువాదాలు నిషేధపు ఉత్తర్వులు ప్రచురించే సాకుతో సృజనలో అచ్చేసేవాళ్లం. సృజన సంచికల నిషేధం గురించి విని ఆవేదనతో శివసాగర్‌ ‘అలలు’ కవిత రాసాడు. అలల పైన నిఘా. అలలు కనే కలల పైన నిఘా అనే అద్భుతమైన కవిత అది. సృజనతో ఆయనకున్న అనుబంధం అటువంటిది. 1974 చరిత్రాత్మకమైన రైల్వే సమ్మె అప్పుడు ఆయన రాసిన ‘రెడ్‌సిగ్నల్‌’ కవిత నిర్మాణం, భాష, పదబంధాలు, కవిసమయాలు మొదలయిన మొత్తం నిర్మాణరూపం వల్ల గద్దర్‌ గ్యాంగోళ్లమండీ, వంగపండు యంత్రమెట్లా నడుస్తున్నదంటే పాటలతో పోల్చదగిన వచనకవిత.

అజ్ఞాత జీవితంలోనూ జైల్లోనూ కలిపి మొత్తం ఆయన 69 నుంచి 79 దాకా బహిరంగజీవితంలో లేడు. పార్వతీపురం , సికింద్రాబాద్‌ కుట్రకేసుల్లో ముద్దాయిగా అదే క్రమంలో ఎమర్జెన్సీలో కూడా 73 నుంచి జైల్లో ఉన్నాడు. 78లో బెయిల్‌ మీద విడుదలయి 79 జనవరిలో వరంగల్‌లో జరిగిన విరసం సాహిత్యపాఠశాలకొచ్చాడు. అయితే నిజానికి 72లో గుంటూరు విరసం మహాసభల్లోనే ఆయనకు విరసం గౌరవ సభ్యత్వమిచ్చింది. బహుశా అటువంటి అరుదయిన గౌరవం ముందూ వెనుకా ఎవరికీలేదు. 79లో ఆయన మహాసభల్లో పాల్గొన్న తర్వాతనే ఆయన సాధారణ సభ్యుడుగా కొనసాగాడు. బహుశా 92 గుంటూరు విరసం మహాసభలకు ఆయన ఆఖరిసారిగా వచ్చాడు. విషాదం ఏమంటే 86లో సిపిఐఎమ్ఎల్‌ పీపుల్స్‌వార్‌ ప్లీనంలో సస్పెన్షన్‌కు, ఆ తర్వాత బహిష్కరణకు గురైన తర్వాత 90లో ఆయన హైదరాబాద్‌లో జరిగిన 20 ఏళ్ల విరసం సభలకు వచ్చి, ఆ సభ ఆవరణలోనే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి పార్టీతో తన విభేదాల గురించి చెప్పాలని ప్రయత్నించాడు. మేం అంగీకరించలేదు. అయినా ఆ తర్వాత మండల్‌ కమిషన్‌కు అనుకూలంగా, రిజర్వేషన్‌కు అనుకూలంగా వెలువరించిన కవితాసంకలనం సందర్భంగా గాని, గద్దర్‌ మీద హత్యాప్రయత్నం జరిగినప్పుడు కాని విరసం ఆయనతో కలిసి పనిచేసింది. గద్దర్‌ మీద హత్యాప్రయత్నం సందర్భంలోనైతే ఆయన నాయకత్వంలో పనిచేసింది.

80లో సిపిఐఎమ్ఎల్‌ పీపుల్స్‌వార్‌ ఏర్పడిన తర్వాత ఆయన విరసంను గైడ్‌చేయడం నాకు జ్ఞాపకం ఉన్నది. ముఖ్యంగా మాచర్ల విరసం మహాసభలకు ముందు ఆయన శ్రీశ్రీ గురించి ప్రస్తావిస్తూ ఆయన విప్లవ శిబిరంలో చనిపోవాలని, ఆయనకు ఎర్రజెండా కప్పాలని, విప్లవం విజయవంతమయిన తర్వాత ఆయన విగ్రహాన్ని విశాఖ సముద్రతీరాన యేరాడకొండపై పెట్టాలని మాముందు ఒక స్వప్నాన్ని ఆవిష్కరించాడు. అది 1982. అయితే, 1979 నుంచి 82 దాకా కొంత బహిరంగజీవితంలోనూ, కొంత అజ్ఞాతంలోనూ ఆయన తరచూ కలుస్తుండేవాడు. విరసం మిత్రులతో మాట్లాడుతుండేవాడు. రాజకీయ నిర్దేశకత్వంకన్నా ఎక్కువగా సాహిత్యం గురించి, కవిత్వం గురించి మాట్లాడుతుండేవాడు.

రాజకీయ నిర్మాణానికి సంబంధించినంతవరకు బహుశా ఆయన పరిమితులు గుడివాడ పరిచయం దగ్గరినుంచి మరెవరికన్నా ఎక్కువగా కొండపల్లి సీతారామయ్యకే తెలియాలి. గంజి రామారావుగారు, సత్యమూర్తి కుటుంబం గుడివాడలో ఇరుగూ పొరుగూ. ఈ ఇద్దరూ కెఎస్‌ అనుయాయులే. సత్యమూర్తి గుడివాడలో రామకోటిశాస్త్రి విద్యార్థిగా చలసాని ప్రసాద్‌, త్రిపురనేని మధుసూదనరావులకు సహాధ్యాయి. అప్పటినుంచే కన్యాశుల్కం నాటకంలోనూ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి ఉద్యమంలోనూ పాల్గొనేవాడు. అది ఆంధ్రా యూనివర్సిటీలో కూడా కొనసాగింది. ఆ తర్వాత విశాలాంధ్ర పత్రికలో చేరాడు. 1960లలో కెఎస్‌ తెలంగాణకు వచ్చి కాజీపేటలో స్థిరపడి ఎస్ఎమ్ను కూడా రమ్మన్నాడు. కెఎస్‌ ఫాతిమాలో హిందీపండిట్‌గానూ, ఎస్ఎమ్ గాబ్రియెల్‌లో సోషల్‌సైన్స్‌ టీచర్‌గానూ పనిచేసారు. కనుక ఆయన మొదటినుంచీ కెఎస్‌ అనుయాయి, మేమంతా వాళ్లు ఒకళ్లకొకళ్లు కాంప్లిమెంట్‌ అనుకునేవాళ్లం. చాలా రొమాంటిక్‌గా వాళ్లను మార్క్స్‌ ఎంగెల్స్‌గా, సూర్యచంద్రులుగా చెప్పుకునేవాళ్లం.

1972లో మొదటిసారి కామ్రేడ్‌ కెఎస్‌ కెవిఆర్‌ (అప్పటికి కెవి.రమణారెడ్డి), చెరబండరాజు, నాకు రాజకీయ తరగతులు చెప్పాడు. రాజకీయ ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రం మొదలయినవి. అప్పుడు మీకు ఎస్ఎమ్ పట్ల ఆరాధనాభావం ఉన్నది, వరంగల్‌లో విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణం అంతా ఆయన చేసాడని భావిస్తున్నారు, చాలాచోట్ల రాసారు కూడా. మీరు చెప్పుకునే పోలికలు కూడా కర్ణాకర్ణిగా మా చెవిలో పడినవి. మార్క్సిస్టులకు ఈ ఆరాధనాభావం సరైంది కాదు అని చెప్తూ, అప్పుడు రీజనల్‌ ఇంజనీరింగు కాలెజి, కాకతీయ మెడికల్‌ కాలెజి విప్లవ విద్యార్థి నిర్మాణంలో ఉన్న వాళ్లెవరో చెప్తూ ముఖ్యంగా అమరులు మువ్వా రవీంద్రనాథ్‌, కొండపల్లి చంద్రశేఖర్‌, మెడికల్‌ కాలెజిలో రమేశ్‌, నాగేశ్వరరావు, ఆర్‌ఇసిలో బాబూరావు, ముక్కు సుబ్బారెడ్డి మొదలయినవాళ్ల పేర్లు పేర్కొని, అయితే ఆదిలాబాదు జిల్లా జన్నారం ప్రాంతంలో విప్లవ ప్రచారానికి నాటకాలు వీరకుంకుమ వంటివి ప్రదర్శించిన సందర్భంగా ఆ నాటకాల్లో ఆయన ఇప్పటికి అనుగుణంగా పాటలు రాసిచ్చేవాడని, రైతు బిడ్డడు గెరిల్లాగా గండ్రగొడ్డలి లేపెనోయ్‌ అనేవి అటువంటివేనని చెప్పాడు.

బహుశా 78 జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 79లో కెఎస్‌ అరెస్టయిన దగ్గరినుంచి పార్టీ నిర్మాణాన్ని, రాజకీయ ఆచరణను ముందుకు తీసుకపోవడంలో శ్రేణులతో సమస్య వచ్చినట్లున్నది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పోరాటాలు మునుముందుకు సాగుతూ నిర్బంధం, అణచివేత, ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నప్పుడు ఎటువంటి ఎత్తుగడలు అనుసరించాలె అని ఆయా జిల్లాల నాయకత్వం ఆయనను తీసుకవెళ్లి శ్రేణులతో చర్చలను పెట్టినప్పుడు ఆయన కవితాత్మకంగా మహావృక్షాలు కూలినా, గాలివీచడం మానదు, కత్తుల కోలాటం ఆగదు, విప్లవానికి కోటికొకడున్నా చాలునురా వంటి మాటలు చెప్పేవాడని, నేలస్థాయిలో రాజకీయ సమస్యల పరిష్కారానికి ఈ కవితా ప్రేరణ సరిపోయేది కాదని ఆ శ్రేణులు భావించినట్లు నాకెందరో చెప్పారు. 1982లో మళ్లీ కెఎస్‌ అరెస్టయిన తర్వాత అప్పటికి నాలుగురాష్ట్రాలు కలిపి ఏర్పడిన సిపిఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌కు ఆయన కెఎస్‌ స్థానంలో కేంద్రకమిటీ కార్యదర్శిగా నియమింపబడ్డాడు. ముఖ్యంగా తమిళనాడు పార్టీ, మహారాష్ట్ర పార్టీ ఆయన వెనుక నిలిచాయి. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని విమర్శ ప్రారంభమయింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ అంతా విస్తరించిన విప్లవోద్యమానికి మాత్రం కేంద్రకమిటీ నుంచి సరైన మార్గదర్శకత్వం లభించలేదని అసంతృప్తి ప్రబలింది. ఆ దశలో అనివార్యంగా 1984లో కెఎస్‌ను జైలునుంచి తప్పించుకొని తీసుకవెళ్లింది పీపుల్స్‌వార్‌ నాయకత్వం. కెఎస్‌ విడుదల తర్వాత కూడా ఎస్‌ఎంను కార్యదర్శిగా కొనసాగించాలని తమిళనాడు నాయకత్వంలో ఉన్న కోదండరామన్‌ ప్రయత్నించాడు. మొదటిరోజుల్లో మహారాష్ట్ర పార్టీ కూడా పార్టీలో ప్రజాస్వామ్యం లేదని భావించింది. కాని, ఏపీ, కర్నాటక కమిటీలు ఇంకెంతమాత్రం ఎస్‌ఎం నాయకత్వాన్ని అందించలేడని భావించారు. 85 నాటికి కెఎస్‌, ఎస్‌ఎంల విభేదాలు నలుగురి చెవుల్లో పడడం ప్రారంభమయింది. సహజంగానే వాళ్లిద్దరినీ ఉద్యమానికి సూర్యచంద్రులుగా భావిస్తున్న మా విరసం నాయకత్వానికి అదొక షాక్‌ అయింది. కెవిఆర్‌, సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, టిఎమ్ఎస్‌, చలసాని, నేను ఇరువైపులా వీళ్లిద్దరినీ కలిపి ఉంచడానికి తీవ్ర ప్రయత్నాలు చేసాం. ఇవి నాయకత్వ సమస్యలనుకున్నాం. ఒక దశలో ఐవి.సాంబశివరావు కెఎస్‌కు సన్నిహితుడై ఎస్ఎమ్ను దూరం చేస్తున్నాడని నిష్ఠూరంగా ఆరోపణ కూడా చేసాం. కాని, ఇది నాయకత్వ సమస్య కాదని, వైయక్తికం కాదని తమిళనాడు కోదండరామన్‌ ప్రోద్బలంతో ఎస్‌ఎం పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని కెఎస్‌ మాత్రమే కాదు, నల్లా ఆదిరెడ్డి మొదలు పులి అంజయ్య వరకు అన్ని జిల్లాపార్టీల నాయకత్వం మాకు ముక్తకంఠంతో చెప్పింది. అందుకే చిత్తూరుజిల్లా పత్తిచేనులో జరిగిన ప్లీనంలో ఎస్ఎమ్ ఏకాకి అయ్యాడు. ఆయన దానిని పార్వతీపురం కుట్రకేసు తనమీద జరిగిన మొదటి కుట్ర అయితే, పత్తిచేను కుట్ర రెండవదన్నాడు. పార్టీలో తొలగింపును రాజ్యం చేసిన కుట్రతో పోల్చవద్దని నేను చెప్పాను. ఏమైతేనేం 1990 నాటికి ఆయన బహిరంగ జీవితానికి వచ్చాడు. కాని, అప్పటికి సిపిఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ బోల్షివిక్‌పార్టీ పెట్టడానికనే చెప్పాడు. ఎందుకంటే పీపుల్స్‌వార్‌ ఆర్థికవాదానికి గురిఅయిందని, కార్మికవర్గాన్ని రాజ్యాధికారానికి తెచ్చే రాజకీయాచరణలో లేదని మొదట చెప్పాడు. ఊసాతో కలిసి మార్క్సిస్టు లెనినిస్టు ఐక్యతాకేంద్రం పేరుతో ఎదురీత పత్రికా నిర్వహణలో పాల్గొన్నాడు. అక్కడా ఎక్కువకాలం నిలవలేదు. ఆ తర్వాత ఊసా యాసిన్‌ అరాఫత్‌, నెల్సన్‌ మండేలాలతో పాటు ఎస్ఎమ్ను ‘గజ ఈతగాడు’ అని వెక్కిరించాడు. ఆ తర్వాత ఎస్ఎమ్ బిఎస్‌పిలో చేరాడు. దానిలోనుంచి చీలి ఎపికి పరిమితమై తానొక బిఎస్‌పి ఏర్పాటు చేసాడు. కాని, ఏ రాజకీయ ఆచరణలోనూ నిలవలేదు. అప్పుడుకాని పార్టీలో కులం గురించి మాట్లాడాడు. కారంచేడు సంఘటన నాటికి నిజానికి కులం ప్రాతిపదికగా విభేదాలున్నట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. పైగా కారంచేడు విజయనగర్‌లో కారంచేడు బాధితుల శిబిరం కాని, జిల్లాలో పీపుల్స్‌వార్‌ పార్టీ గాని పూర్తిగా దళితులపక్షం నిలబడి పోరాడింది. జననాట్యమండలి, విరసం, ఆర్‌వైయల్‌ అందులో క్రియాశీలంగా పాల్గొన్నాయి. జిల్లానాయకత్వంలో ఉన్న శేషప్రసాద్‌ ఈ విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించాడు. అది చెంచురామయ్యను శిక్షించాలని నిర్ణయాన్ని కూడా అమలు చేసింది.

1968, 69 నుంచి కెఎస్‌ నాయకత్వంలో మాలె పార్టీలో ఉన్నప్పుడు గాని, చివరి దాకా గాని ఎస్ఎమ్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచాడు. 68-69 ఉద్యమంలో వరంగల్‌లో చక్కిళ్ల ఐలయ్యతోపాటు సికింద్రాబాద్‌లో కొల్లిపర నరసింహారావుతో పాటు స్వయంగా ఆ ఉద్యమానికి ప్రోత్సాహాన్నందించాడు. ఆ కాలంలోనే జైలుకు కూడా పోయాడు. గద్దర్‌ మీద హత్యాప్రయత్నం తర్వాత బహుశా ఆయన రాజకీయ జీవితంలో ఆఖరిసారిగా ఆయన సిపిఐఎమ్ఎల్‌ ప్రజాప్రతిఘటన కార్యదర్శి అయి ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరచకపోవడం వల్ల బయటికి వచ్చాడు. అది పీపుల్స్‌వార్‌ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 97లో మళ్లీ ప్రారంభించిన కాలం.

ఆయన ఎదురీత పత్రికలో పనిచేస్తున్న రోజుల్లోనే 80లలో ఆయనకు రాడికల్‌ యువకుడిగా సన్నిహితుడైన కృష్ణమాదిగ కూడా అందులో పనిచేసాడు. వాళ్లకు చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. కృష్ణమాదిగ ఎస్‌సి వర్గీకరణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఎస్ఎమ్ అందుకు అండగా నిలబడ్డాడు.

నా ఊరేగింపు కవితా సంకలనం ఆయనకు అంకితం ఇవ్వడం మాత్రమే కాదు, దానికి ఆయన ముందుమాట కూడా రాసాడు. సముద్రం కవితాసంకలనాన్ని చాలా ఇష్టపడ్డాడు. కాని 90ల తర్వాత రాజకీయ విభేదాల వల్ల ఆయన నా కవిత్వం విషయంలో తన తొలి అభిప్రాయాలు మార్చుకున్నాడు. అయినా Without prejudice and malice శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వంలో ఆయనదే స్థానం అని, ముఖ్యంగా 70ల విప్లవ కవిత్వానికి పాణిగ్రాహి తర్వాత ఆయనే మార్గదర్శకుడని, అందుకే శివసాగర్‌కు మరణం లేదని చిత్తశుద్ధిగా ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నాను.

- వరవరరావు
హైదరాబాద్‌
ఏప్రిల్‌ 17, 2012
http://varavararao.org/blog/2012/04/18/sivasagar/

Posted on  April 18, 2012  No Comments
Siva Sagar, Photo by G.Bharath Bhushan

(ఆంధ్రజ్యోతి దినపత్రికలో 23-04-2012న ఇదే పేరుతో వచ్చిన కథనం చివరలో బాగా కత్తిరింపులకు గురైంది. వివి సమగ్ర కథనం ఇక్కడే - పై లింకులో- చూడవచ్చు. శివసాగర్ రాజకీయ వైఫల్యంపై అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ అధికారిక వైఖరికి సమీపంగా ఉన్న అంశాలను ఈ కథనంలోనే చూడవచ్చు.

ఆ మేరకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వి.వి. కథనం కంటే స్వంత బ్లాగులోని వి.వి.  పూర్తి కథనం చాలా ప్రాధాన్యత కలిగినట్టిది.

శివసాగర్‌కు మరణం లేదు
-వరవరరావు
http://andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/apr/23/vividha/23vividha2&more=2012/apr/23/vividha/vividhamain&date=4/23/2012